Employee Guarantee, Housing, Today-Today, Collector Suryakumari in a review on OTS schemes
Publish Date : 30/04/2022
*ఆరంభంతోనే ఆగిపోవద్దు… ఫలితం వచ్చే వరకు శ్రమించండి*
*ఉపాధి హామీ, గృహ నిర్మాణ, నాడు-నేడు, ఓటీఎస్ పథకాలపై సమీక్షలో కలెక్టర్ సూర్యకుమారి
*పనుల్లో పురోగతి సాధించేందుకు మరింత శ్రద్ధ పెట్టాలని అధికారులకు ఆదేశాలు
*డివిజన్ వారీ పనుల నివేదికల పరిశీలనా బాధ్యతలు ఆర్డీవోలకు అప్పగింత
విజయనగరం, ఏప్రిల్ 29 ః వివిధ పథకాలకు సంబంధించిన పనులు మొదలు పెట్టేటప్పుడు చాలా ఉత్సాహం కనబరుస్తున్నారని… చివరకు వచ్చేసరికి నిస్తేజం కనబరుస్తున్నారని.. ఫలితంగా ఆశించిన ఫలితాలు రావటం లేదని కలెక్టర్ సూర్యకుమారి పేర్కొన్నారు. అనుకున్న ఫలితం వచ్చే వరకు అహర్నిశలూ శ్రమించాలని అధికారులకు సూచించారు. అలాగే క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులపై ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని హితబోధ చేశారు. ఈ ఏడాది జరిగిన గృహ నిర్మాణ, నాడు-నేడు, ఉపాధి హామీ, ఓటీఎస్ పథకాల పనుల పురోగతి, చెత్త సంపద తయారీ కేంద్రాల నిర్వహణపై కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం ఆమె సుదీర్ఘ సమీక్ష చేశారు. విజయనగరం, బొబ్బిలి, చీపురుపల్లి ఆర్డీవోలు, వివిధ జిల్లా స్థాయి అధికారులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన వివిధ పథకాలు తాలూక ప్రగతి మెరుగు పడాలని దీనికి గాను అధికారులు సమన్వయంతో మరింత కష్టపడి పని చేయాలని సూచించారు. ముందుగా మండలాల వారీగా ఈ ఏడాది జరిగిన పనుల నివేదికలను పరిశీలించి కలెక్టర్ సుదీర్ఘంగా సమీక్షించారు. నాడు-నేడు పనుల్లో, ఉపాధి పనుల్లో ప్రణాళిక అవసరమని పేర్కొన్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని ఉపాధి పనులను ఎండ రాకముందే త్వరగా ప్రారంభించాలని సూచించారు. రెండో పూట కూడా పనులను చేపట్టాలని చెప్పారు. అలాగే సాఫ్ట్ వేర్ మార్పు, విధానాల మార్పు గురించి మేట్లకు అవగాహన కల్పించాలని సూచించారు. నాడు-నేడు పథకానికి సంబంధించి ఎంపీడీఓలు, ఎంఈవోలు, ఇతర అధికారులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. ఓటీఎస్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకు ముందుకు వచ్చిన వారికి త్వరితగతిన సంబంధిత పత్రాలు అందజేయాలని ఆదేశించారు. ఇంకా ఎవరైనా ముందుకు వస్తే పథకం ఫలాలు అందేలా చూడాలని చెప్పారు. సంపద తయారీ కేంద్రాల నిర్వహణ మెరుగుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
*ఒక్కసారి రద్దైతే మళ్లీ ఇల్లు రాదు…*
నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా స్థలం పొందిన వారు నిర్ణీత గడువులోగా ఇళ్లు నిర్మించుకోవాలని, ఆ దిశగా అధికారులు లబ్ధిదారులను ప్రోత్సహించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలను అనుసరించి ఒక్కసారి పథకం రద్దైతే మళ్లీ ఇల్లు రావటం కష్టమని పేర్కొన్నారు. ఈ అంశంపై లబ్ధిదారుల్లో విరివిగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇళ్లు కట్టుకునే లబ్ధిదారులకు అవసరమైన సామగ్రి అందజేయాలని గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. స్వయం సహాయ సంఘాల ద్వారా సులభరీతిలో గృహ నిర్మాణ లబ్ధిదారులకు రుణం ఇప్పించాలని చెప్పారు. ఇళ్ల నిర్మాణాలు, ఇతర పనులకు సంబంధించి డివిజన్ వారీ నివేదికలను స్వయంగా ఆర్డీవోలు పరిశీలించాలని కలెక్టర్ స్పష్టంగా పేర్కొన్నారు.
సమావేశంలో విజయనగరం, బొబ్బిలి, చీపురుపల్లి ఆర్డీవోలు భవానీ శంకర్, శేష శైలజ, అప్పారావు, డ్వామా పీడీ ఉమాపరమేశ్వరి, డీపీవో సుభాషిణి, డిప్యూటీ సీఈవో రామచంద్రరావు, ఎస్.ఎస్.ఎ. పీవో స్వామినాయుడు, ఎంపీడీవోలు, ఏపీవోలు, ఈసీలు తదితరులు పాల్గొన్నారు.