Collector Suryakumari unveils Helpline 14567 poster for seniors
Publish Date : 04/05/2022
వృద్దుల కోసం హెల్ప్‌లైన్ 14567
పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్ సూర్యకుమారి
విజయనగరం, మే 02 ః
వృద్దులకు అన్నివిధాలా సహాయ సహకారాలను అందించేందుకు ఏర్పాటైన హెల్ప్‌లైన్ సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి కోరారు. జాతీయ వృద్ధుల హెల్ప్ లైన్ -14567 పోస్టర్ ను, కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. జాతీయ వృద్ధుల హెల్ప్ లైన్ నెంబర్ 14567, వృద్దులందరి దగ్గరా ఉండాలని ఆమె సూచించారు. వృద్దులు వివిధ రకాల సమాచారాన్ని, న్యాయ సలహాలు, సూచనలు, సహాయాన్ని పొందేందుకు ఈ హెల్ప్‌లైన్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఒంటరితనం వేధిస్తున్నా, ఇతర సమస్యలపైనా ఈ హెల్ప్‌లైన్ ద్వారా కౌన్సిలింగ్ అందించడం జరుగుతుందన్నారు. నిర్భాగ్యులైన వృద్దులగురించి ఈ హెల్ప్‌లైన్‌కు సమాచారాన్ని అందించవచ్చని సూచించారు. ఎవరైనా వృద్దులపై దాడిచేసి, దూషించినా, హింసించినా, దీనిద్వారా పోలీసులనుంచి సేవలను పొందే అవకాశం ఉందని తెలిపారు. వృద్దులకు అన్నివిధాలా చేదోడు వాదోడుగా ఉండే ఈ హెల్ప్‌లైన్ నెంబర్‌ను అందరికి తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఎం.గణపతిరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు బి.పద్మావతి, సూర్యనారాయణ, వికలాంగులు, వయోవృద్దుల సంక్షేమశాఖ ఇన్‌చార్జి సహాయ సంచాలకులు డి. కీర్తి, జాతీయ వృద్ధుల హెల్ప్ లైన్ ఎఫ్ఆర్ఓ తిరుపతిరావు, జిల్లా అధికారు పాల్గొన్నారు