Precautions should be taken to prevent loss of life due to cyclone, teleconference with Tahsildars, Municipal Commissioners, District Collector Smt. Suryakumari
Publish Date : 11/05/2022
తుఫాను వల్ల ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
పిడుగులు పడే అవకాశం – ఇళ్ల నుంచి బయటకు రావొద్దు
వరి, మొక్కజొన్న పంటల కోతలు వాయిదా వేయండి
ముందు జాగ్రత్త చర్యగానే విద్యుత్ సరఫరా నిలుపుదల
తహశీల్దార్లు, మునిసిపల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్
జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి
విజయనగరం, మే 11 : బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాను ప్రభావంతో జిల్లాలో పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం వున్నందున తుఫాను జిల్లాను దాటే వరకు అత్యవసర పరిస్థితుల్లో మినహా ప్రజలు తమ ఇళ్ల నుంచి సాధ్యమైనంతవరకు బయటకు రావొద్దని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి విజ్ఞప్తి చేశారు. రైతులు తమ పొలాల్లోకి వెళ్లవద్దని, అదేవిధంగా చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లవద్దని సూచించారు. వరి, మొక్కజొన్న రైతులు తమ పంటను కోతలు రెండు రోజులపాటు వాయిదా వేసుకోవాలని కోరారు. తుఫాను వల్ల వర్షాలు కురిసే అవకాశం వుందని, పెనుగాలులు వీచే అవకాశం కూడా వుందని అందువల్ల ఎవరూ ప్రయాణాలు చేయవద్దన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు కోరినపుడు అధికార యంత్రాంగంతో సహకరించి తరలి వెళ్లాలని కోరారు. పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రజలు తుఫాను పరిస్థితుల దృష్ట్యా బుధవారం రాత్రి వరకు బయట సంచరించవద్దని సూచించారు. బుధవారం రాత్రి వరకు జిల్లాపై తుఫాను ప్రభావం వుండే అవకాశం ఉందని అందువల్ల అప్రమత్తంగా సురక్షిత ప్రాంతాల్లో వుండాలన్నారు. జిల్లాలో తుఫాను సందర్భంగా తీసుకోవలసిన జాగ్రత్తలపై బుధవారం రెవిన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లు, మునిసిపల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి తుఫాను పరిస్థితిపై తెలుసుకొని పలు సూచనలు చేశారు. మూడు, నాలుగు రోజుల్లో కాన్పునకు తేదీలు ఇచ్చిన గర్భిణీలను వారికి సమీపంలోని సబ్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 108 వాహనాల ద్వారా చేర్పించాలన్నారు. జిల్లాలో మత్స్యకార గ్రామాలు ఇతర ప్రాంతాల్లో 15 వరకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. విశాఖ జిల్లాను ఆనుకొని వున్న వేపాడ, ఎల్.కోట, జామి, మెంటాడ తదితర మండలాల్లో భారీ వర్షాలు, పెనుగాలులకు కొద్ది ఎకరాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయని వాటి పంటనష్టాలను వర్షాలు తగ్గిన అనంతరం అంచనాలు వేస్తారని చెప్పారు. జాతీయ రహదారిపై తుఫాను సందర్భంగా ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తగిన పర్యవేక్షణ చేయాలన్నారు. తుఫాను వల్ల వీచే గాలుల కారణంగా విద్యుత్ లైన్లు తెగి ప్రమాదాలు జరిగే అవకాశం వున్నందున, గాలులు తగ్గే వరకూ విద్యుత్ సరఫరా ముందుజాగ్రత్త చర్యగా నిలుపుదల చేస్తున్నారని దీనిని ప్రజలు గమనించాలని కోరారు. గ్రామీణ ప్రాంత రోడ్లపై నీరు పారే అవకాశం వున్న చోట తగిన జాగ్రత్తలు తీసుకొని నీరు ప్రవహించే సమయంలో వాహనాల రాకపోకలు లేకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు.
జిల్లాలోని వివిధ మండలాల్లో వర్షపాతం, గాలులు, వాతావరణ పరిస్థితులను కలెక్టర్ తెలుసుకున్నారు. జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతిరావు, రెవిన్యూ డివిజనల్ అధికారులు బిహెచ్.భవానీ శంకర్ (విజయనగరం), ఎం.అప్పారావు (చీపురుపల్లి), బి.శేషశైలజ(బొబ్బిలి), తహశీల్దార్లు, మునిసిపల్ కమిషనర్లు కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
