Generous help to cyclone victims from humanitarian point of view, no casualties, Chief Minister Shri YS Jagannath video conference with District Collectors, SPs
Publish Date : 11/05/2022
మానవతా దృక్పథంతో తుపాను బాధితులకు ఉదారంగా సాయం చేయండి
ప్రాణనష్టం జరగడానికి వీల్లేదు
జిల్లా కలెక్టర్లు, ఎస్.పి.లతో ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ వీడియో కాన్ఫరెన్స్
విజయనగరం, మే 11 : అసని తుఫాను ప్రభావితమయ్యే ప్రజానీకాని మానవతా దృక్పథంతో ఉదారంగా సహాయం అందించాలని ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లను కోరారు. తుఫాను వల్ల లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన శిబిరాలకు తరలించేటపుడు వారికి ఆ శిబిరాల్లో అన్నిరకాల మెరుగైన వసతులు కల్పించాలని ఆదేశించారు. తుఫాను అనంతరం వారు శిబిరం నుంచి ఇంటికి వెళ్లేటపుడు ఒక్కో వ్యక్తికి రూ.1000 వంతున గానీ లేదా ఒక్కో కుటుంబానికి రూ.2 వేలు వంతున గాని నగదు సహాయం అందించి పంపించాలన్నారు. అసని తుఫాను ప్రభావం, ఆయా జిల్లాల్లో చేపట్టిన సహాయ పునరావాస చర్యలపై జిల్లా కలెక్టర్లు, ఎస్.పి.లతో ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి బుధవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించి వారికి తుఫాను సహాయక చర్యలపై తగు సూచనలు చేశారు.
తుఫాను ప్రభావిత జిల్లాల్లో ఎక్కడా ప్రాణనష్టం సంభవించడానికి వీల్లేదని, ప్రాణనష్టం జరగకుండా అవసరమైన ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తుఫాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన జనరేటర్లు, జెసిబిలు, ఇతర పరికరాలను, అవసరమైన సరుకులను సిద్ధంచేసి వుంచుకోవాలన్నారు.
తుఫాను మన రాష్ట్ర తీరం దాటే వరకు ఆయా జిల్లాల కలెక్టర్లంతా తమ జిల్లాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని, ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో సంచరించకుండా హెచ్చరించాలన్నారు.
జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం.దీపిక, డి.ఆర్.ఓ. ఎం.గణపతిరావు, డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు మేనేజర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
