CMR should be completed within 25 days to increase capacity of rice mills Joint Collector Mayur Ashok
Publish Date : 12/05/2022
రైస్ మిల్లుల సామర్ధ్యాన్ని పెంచండి
25లోగా సిఎంఆర్ పూర్తి చేయాలి
జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్
విజయనగరం, మే 12 ః
వచ్చే ఖరీఫ్‌లో రైస్ మిల్లుల మిల్లింగ్ సామర్ధ్యాన్ని పెంచాలని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ కోరారు. జిల్లాలోని రైస్ మిల్లర్లతో కలెక్టరేట్ సమావేశమందిరంలో గురువారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎంఆర్‌పై మిల్లుల వారీగా సమీక్షించారు. మరో 5వేల మెట్రిక్ టన్నుల సిఎంఆర్ పెండింగ్ ఉందని, దానిని వెంటనే పూర్తిచేసి, అందజేయాలని ఆదేశించారు. ఇప్పుడు విద్యుత్ సమస్య కూడా లేదని, 24 గంటలూ మిల్లును నడిపి, సిఎంఆర్ ఇవ్వాలని సూచించారు. అలాగే రబీ ధాన్యం సేకరణ కూడా మొదలుపెట్టి, మిల్లింగ్‌ను త్వరగా పూర్తి చేసి, రైతులకు సహకరించాలని కోరారు. వచ్చే ఖరీఫ్‌లో సుమారు 4లక్షలా, 20వేల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం సేకరణ జరిగే అవకాశం ఉందని, దీనికి తగ్గట్టుగా రైస్ మిల్లులు, తమ మిల్లింగ్ సామర్ధ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం సార్టెక్స్ బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు మాత్రమే ఆసక్తి చూపుతోందని, ఈ మిల్లులకు మంచి భవిష్యత్తు ఉందని అన్నారు. సాధారణ మిల్లులను సార్టెక్స్ మిల్లులుగా మార్చాలని కోరారు. అలాగే ఏమైనా రైస్ మిల్లులు మూసివేసి ఉంటే, వాటిని తెరిచేందుకు ప్రయత్నించాలని సూచించారు.
రైస్ మిల్లర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైస్‌మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షులు కొండపల్లి కొండలరావు మాట్లాడుతూ, ప్రస్తుతం జిల్లాలో సుమారు 150 రైస్ మిల్లులు ఉన్నాయని, 90శాతం మిల్లులను సార్టెక్స్‌గా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఖరీఫ్‌లో మిల్లింగ్‌కు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉండిపోయిన రవాణా ఛార్జీలు, గోనెసంచుల బకాయిలను ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. పాత మిల్లులను సార్టెక్స్‌గా మార్చేందుకు, అవకాశం ఉంటే ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారాన్ని ఇప్పించాలని, మిల్లులకు విద్యుత్ శాఖ విధించిన జరిమానాను తప్పించాలని కోరారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తానని జెసి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో డిఎస్ఓ పాపారావు, సివిల్ సప్లయిస్ డిఎం మీనా కుమారి, సివిల్ సప్లయిస్ టిడిలు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.
