Jagan Anna housing should be expedited, infrastructure in completed colonies, District Collector A. Suryakumari
Publish Date : 17/05/2022
జగనన్న గృహనిర్మాణాన్ని వేగవంతం చేయాలి
పూర్తిచేసిన కాలనీల్లో మౌలిక సదుపాయాలు
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
గుర్ల, విజయనగరం, మే 16 ః జగనన్న గృహనిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ఆదేశించారు. గుర్ల మండలం జమ్ముపేట, విజయనగరం మండలం కొండకరకాం, గుంకలాం లేఅవుట్లను, గృహనిర్మాణాన్ని ఆమె సోమవారం పరిశీలించారు. ఆయా గ్రామాలకు మంజూరైన ఇళ్లు, మొదలు పెట్టిన ఇళ్లపై ఆరా తీశారు. మంజూరైన ప్రతీ ఇళ్లూ ప్రారంభించాలని ఆదేశించారు. కాలనీల్లో అన్ని ఇళ్ల నిర్మాణం పూర్తి అయితే, వెంటనే మౌలిక వసతులను కల్పిస్తామని చెప్పారు. జమ్ము కాలనీలో ఇంకా రెండు ఇళ్లు మాత్రమే మొదలు పెట్టాల్సి ఉందని, వాటిని కూడా పూర్తి చేస్తే, రూ.35లక్షలతో ఇంటింటికీ కొళాయి కనక్షన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
విజయనగరం మండలం కొండకరకాం వద్ద రూరల్ లేఅవుట్‌ను పరిశీలించి, సంతృప్తిని వ్యక్తం చేశారు. పట్టణ పేదలకోసం ఇక్కడ మంజూరు చేసిన ఇళ్లను నేటికీ మొదలు పెట్టకపోవడం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనంతరం గుంకలాం లేఅవుట్‌ను పరిశీలించారు. లబ్దిదారులు థర్డ్ ఆప్షన్ క్రింద కాంట్రాక్టు నిర్మాణానికి అంగీకరించిన ఇళ్లను పరిశీలించారు. ఇప్పటికు సుమారు మూడు వేలమంది ఈ ఇళ్ల నిర్మాణానికి అంగీకరించారని, వారికి యుద్దప్రాతిపదికన నిర్మాణాన్ని పూర్తి చేయాలని కాంట్రాక్టరును కోరారు. దీనికోసం 24 గంటలూ పనులు జరిగేలా చూడాలన్నారు. ఈ బ్లాక్‌లో ఇళ్లకు మార్కింగ్ చేపట్టడానికి, ఇంజనీరింగ్ అసిస్టెంట్లను వినియోగించాలని, డిఇ రంగారావు, మున్సిపల్ కో-ఆర్డినేటర్ హరీషలను కలెక్టర్ ఆదేశించారు.
