Priority for women in PMMSY scheme * Collector A. Suryakumari at District Committee meeting * Proposals for various units and works with an estimate of Rs.7.35 crore
Publish Date : 23/06/2022
పీఎంఎంఎస్వై పథకంలో మహిళలకు ప్రాధాన్యత
*జిల్లా కమిటీ సమావేశంలో కలెక్టర్ ఎ. సూర్యకుమారి
*రూ.7.35 కోట్ల అంచనాతో వివిధ యూనిట్లకు, పనులకు ప్రతిపాదనలు
విజయనగరం, జూన్ 22 ః ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్వై) పథకంలో భాగంగా మహిళల ఉపాధికి ప్రాధాన్యత ఇవ్వాలని, వారికి తగినన్ని యూనిట్లు కేటాయించాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. పీఎంఎంఎస్వై పథకంలో భాగంగా జిల్లా నుంచి వివిధ పనులకు, యూనిట్ల కేటాయింపునకు సంబంధించి రూ.7.35 కోట్ల అంచనాతో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రతిపాదనలు రూపొందించగా బుధవారం తన ఛాంబర్లో జిల్లా కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ప్రతిపాదనల రూపకల్పనలో జిల్లా నుంచి అధికంగా అన్ని వర్గాల మహిళలకు ఉపాధి లభించేలా చర్యలు తీసుకోవాలని, అధిక యూనిట్లు కేటాయించాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు. ఐస్ బాక్స్‌తో కూడిన మోటర్ సైకిల్స్, వాహన భీమా, బోట్లు సమకూర్చుట, రీ సర్క్యులేటరీ ఆక్వా సిస్టమ్ ఏర్పాటు, లవ్ ఫిష్ వెండింగ్ తదితర అవసరాలను దృష్టిలో ఉంచుకొని 335 యూనిట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, భవిష్యత్తులో మెరుగైన ఉపాధి కల్పనకు ఊతం ఇచ్చేలా జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. పోలిపల్లిలో ఏర్పాటు చేయబోయే రీ సర్క్యులేటరీ ఆక్వా సిస్టమ్ ను డీఆర్డీఏ పీడీతో పాటు వెళ్లి పరిశీలించాలని మత్స్య శాఖ డీడీని ఆదేశించారు. పూర్తిస్థాయిలో పరిశీలన చేసిన అనంతరం జిల్లా అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతిపాదనలు రూపొందించాలని, మార్పులు చేర్పులు చేయాలని సూచించారు.
సమావేశంలో మత్స్యశాఖ డీడీ నిర్మలా కుమారి, డీఆర్డీఏ పీడీ కల్యాణ చక్రవర్తి, ఎల్.డి.ఎం. శ్రీనివాసరావు, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ చంద్రబాబు, ఎఫ్.డి.వో. చాందిని, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.
