Joint Collector Mayur Ashok directed the concerned departmental officials to provide adequate encouragement to the enthusiasts who come forward to set up the industries and to grant permits in an easy manner.
Publish Date : 25/06/2022
పరిశ్రమల ఏర్పాటుకు తగిన ప్రోత్సాహం
*పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో జేసీ
*ఉత్సాహంగా పని చేసి ఉత్తమ ఫలితాలు సాధించాలని అధికారులకు హితవు
విజయనగరం, జూన్ 25 ః పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు తగిన ప్రోత్సాహం అందించాలని, సులభతర రీతిలో అనుమతులు మంజూరు చేయాలని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు. ఉత్సాహంగా పని చేసి ఉత్తమ ఫలితాలు సాధించాలని హితవు పలికారు. వ్యక్తిగత లక్ష్యాలను నిర్దేశించుకొని నిర్ణీత కాలంలో చేరుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయాలని, పెట్టుబడులను ఆకర్షించాలని అధికారులకు నిర్దేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం జరిగిన పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు తగిన ప్రోత్సాహం అందించాలని ప్రతీ డిపార్ట్మెంట్ నుంచి ఒక్కో ఐదు కంపెనీలు నెలకొల్పేందుకు ఔత్సాహికులను గుర్తించాలని నిర్దేశించారు. వచ్చే సమావేశం నాటికి కొత్త కంపెనీల ఏర్పాటు జాబితాతో సిద్ధంగా రావాలని సూచించారు. ప్రధాన మంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ (పీఎంఈజీపీ) పథకంలో భాగంగా లబ్ధిదారులను గుర్తించి పరిశ్రమలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని, ఈ పథకంపై వారికి పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. పీఎంఈజీపీ ద్వారా రూ.50 లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుందని, అందులో గ్రామీణ ప్రాంతం వారికి అయితే 35 శాతం, పట్టణ ప్రాంతం వారికి 25 శాతం రాయితీ ఉంటుందని జేసీ వివరించారు. దీనిపై ఔత్సాహికుల్లో విస్తృత అవగాహన కల్పించటం ద్వారా ఆశాజనక ఫలితాలు సాధించాలని సూచించారు. యువతకు, మహిళలకు, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల వారికి ఉపాధి కల్పించే రంగాలపై ప్రధానంగా దృష్టి సారించాలని, ఔత్సాహికులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని చెప్పారు. సింగిల్ డెస్క్ పోర్టల్ లో వచ్చిన దరఖాస్తులు తీసుకున్న చర్యలపై జేసీ వివిధ విభాగాల అధికారులను ఆరా తీశారు.
సమావేశంలో ముందుగా పరిశ్రమల శాఖ జీఎం పాపారావు అజెండా అంశాలను కమిటీకి వివరించారు. రెల్లి, కంటకాపల్లిలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటు, ఫుడ్ కోర్టులకు వచ్చిన వినతులు, రుణ సదుపాయం కల్పన, నెల్లిమర్ల పారిశ్రామిక పార్కులో నీటి వసతి సమస్య, గరివిడి ప్యాకర్స్ కంపెనీ సమస్య తదితర అంశాలను ప్రస్తావించారు. వాటన్నింటిపైనా పరిశీలించి నిర్ణీత కాలంలోగా తగిన చర్యలు తీసుకోవాలని జేసీ ఆదేశించారు.
కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జీఎం ఆర్. పాపారావు, డీడీ నాగేశ్వరరావు, ఐపీవో వర్ధన్, ఎల్.డి.ఎం. శ్రీనివాసరావు, ఏపీఐఐసీ జోన్ల్ మేనేజర్ యతిరాజులు, పీసీబీ ఈఈ సుదర్శన్ రావు, డీఎఫ్వో వినయ్, మత్స్యశాఖ డీడీ నిర్మలా కుమారి, ఉద్యాన శాఖ డీడీ శ్రీనివాసరావు, మార్కెటింగ్ శాఖ ఏడీ శ్యామ్ కుమార్, వీఎంఆర్డీఏ జేపీవో శాస్త్రి, బుడా పీవో పద్మజ, ఈపీడీసీఎస్ ఈఈ ధర్మరాజు, ఇతర విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.