They should excel in jobs, District Collector A. Suryakumari, the collector who congratulated the 32 people selected for the jobs
Publish Date : 23/07/2022
ఉద్యోగాల్లో రాణించాలి
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
ఉద్యోగాలకు ఎంపికైన 32 మందిని అభినందించిన కలెక్టర్
విజయనగరం, జులై 22 ః ఉద్యోగాల్లో ప్రతిభ చూపించి, ఉన్నత స్థానానికి ఎదగాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి కోరారు. డిఆర్‌డిఏ, సిడాప్ ద్వారా శిక్షణ పూర్తి చేసుకొని, వివిధ ప్రయివేటు సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికైన 32 మందిని, జిల్లా కలెక్టర్ సూర్యకుమారి, కలెక్టరేట్ వద్ద శుక్రవారం అభినందించారు. సంభాషణా చాతుర్యం, భావప్రకటన, ఆంగ్లభాషా సామర్ధ్యాలను మరింత మెరుగుపర్చుకోవాలని సూచించారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, ఉన్నత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని, దానిని సాధించేందుకు కష్టపడి పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఎ.కల్యాణ చక్రవర్తి, జాబ్స్ జిల్లా మేనేజర్ డి.మార్టిన్ లూథర్, సిబ్బంది, ఎంపికైన అభ్యర్థులు పాల్గొన్నారు. అనంతరం వారికి డిఆర్‌డిఏ పిడి కల్యాణ చక్రవర్తి చేతులమీదుగా శిక్షణా ధృవపత్రాలను, ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు.
90 రోజుల అత్యున్నత శిక్షణ
డిఆర్‌డిఏ- సీడాప్ (సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్, ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ ఇన్ ఎపి) ద్వారా 90 రోజులపాటు స్థానిక టిటిడిసి మహిళా ప్రాంగణంలో డిడియు-జికెవై రిటైల్ శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి అయిన వెంటనే వీరికి, విశాఖపట్నంలోని రిలయన్స్, పాంథలూన్స్, స్పెన్సర్స్, ఖజానా జ్యూయలర్స్ తదితర సంస్థల్లో ఉద్యోగాలు లభించాయి. వీరికి ప్రారంభ జీతం నెలకు రూ.12,500, పిఎఫ్, ఇఎస్ఐ తదితర సౌకర్యాలతో ఉద్యోగాల్లో చేరనున్నారు.
…………………………………………………
మా కాళ్లమీద నిలబడేలా చేసింది.
తనూజ, సాలూరు మండలం.
సిడాప్ అందించిన శిక్షణ మమ్మల్ని మా కాళ్లమీద నిలబడేలా చేసింది. రిటైల్ ట్రైనింగ్ పూర్తి అయిన వెంటనే నాకు విశాఖ సెంట్రల్‌లో జాబ్ వచ్చింది. మాకు కంప్యూటర్, కమ్యూనికేషన్, స్పోకెన్ ఇంగ్లీష్, సేల్ప్ తదితర అంశాల్లో చక్కని శిక్షణ అందించారు. ఈ శిక్షణ మాకు ఎంతగానో ఉపయోగపడి, మా జీవితానికి ఒక మార్గం చూపింది.
ఆత్మవిశ్వాసాన్ని నింపింది
సోములమ్మ, మెంటాడ మండలం
నాకు మూడునెలల శిక్షణ పూర్తి కాగానే విశాఖపట్నం రిలయెన్స్ సెంట్రల్‌లో ఉద్యోగం వచ్చింది. దీనికి మాకు అందించిన అత్యుత్తమ శిక్షణే కారణం. ఈ శిక్షణ మాలో మంచి మార్పును తీసుకువచ్చింది. ఎవరితో ఎలా మాట్లాడాలో, వినియోగదారులను ఎలా ఒప్పించాలో నేర్పించారు. ఇది మాలో ఆత్మ విశ్వాసాన్ని నింపి, ఉద్యోగం సాధించేలా చేసింది.
మధ్యతరగతి వారికి ఇదొక మంచి అవకాశం
మామిడి రమణ, బాడంగి మండలం
సిడాప్ అందిస్తున్న శిక్షణ మాలాంటి మధ్యతరగతి పిల్లలకు గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. మాకు కేవలం మూడు నెలల శిక్షణలోనే ఎన్నో అంశాలను నేర్పించి, ఉద్యోగాలను సాధించేలా చేయగలిగారు. నెలకు రూ.11,500 జీతంతో, వైజాగ్ సెంట్రల్‌లో తొలి ఉద్యోగాన్ని సొంతం చేసుకోగలిగాను. ఇలాంటి ఉపయోగపడే కార్యక్రమాలను చేస్తున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
