Pregnant women must take food in Anganwadis, the secretariat staff should be fully aware of this, District Collector A. Suryakumari directed during a visit to the secretariats.
Publish Date : 14/09/2022
గర్భిణులు తప్పకుండా అంగన్వాడీల్లో ఆహారం తీసుకోవాలి
దీనిపై సచివాలయ సిబ్బంది పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి
సచివాలయాల సందర్శనలో జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి ఆదేశాలు
విజయనగరం, సెప్టెంబర్ 13 ః వైఎస్సార్ పోషణ్ అభియాన్ పథకంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో అందించే ఆహారాన్ని గర్భిణులు, చిన్నారులు తప్పకుండా వచ్చి తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి పేర్కొన్నారు. పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అంగన్వాడీల్లో అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని దానిలో భాగంగా కేంద్రాల్లో గర్భిణులకు ఆహారం వండి పెట్టే కార్యక్రమాన్ని అమలు చేస్తోందని గుర్తు చేశారు. దీని ప్రయోజనాలను తెలుసుకొని ప్రతి గర్భిణీ అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి ఆహారాన్ని తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సచివాలయ సిబ్బంది దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ గర్భిణుల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. నగర పరిధిలోని కుమ్మరవీధి, బుక్కవీధి, పుచ్చలవీధిలో ఉన్న వార్డు సచివాలయాలను సోమవారం మధ్యాహ్నం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ప్రభుత్వ కార్యక్రమాలను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయటంలో సచివాలయ సిబ్బంది ప్రధాన భూమిక పోషించాలని, అర్హులెవరూ పథకాలకు దూరం కాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. కుమ్మరవీధి, బుక్కవీధి, పుచ్చలవీధి సచివాలయాల పరిధిలో నివశిస్తున్న ప్రజలు, విద్యార్థుల హెచ్.బి. శాతాలపై కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. రక్తహీనత ఉన్న వారి శాతం ఎక్కువగా ఉందని వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ వారంలో డీవార్మింగ్ నిర్వహించి తగిన మందులు అందజేయాలని, వైద్యపరమైన సలహాలు, సూచనలు చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. పాఠశాలల్లో డ్రాపౌడ్ రేట్ తగ్గించాలని, వయోజనుల అక్షరాస్యతను పెంచాలని చెప్పారు. గృహ నిర్మాణాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అప్‌లోడ్ చేయాలని, లబ్ధిదారులను ప్రోత్సహించి ప్రతి ఒక్కరూ ఇళ్లు కట్టుకునేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. ఓటీఎస్‌లో నగదు జమ చేసిన వారికి త్వరితగతిన ధృవ పత్రాలు అందజేయాలని, సచివాలయాలకు వచ్చే ప్రజలకు సత్వర సేవలందించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
