E-Governance is given high priority in Secretariat services *The new system is a platform for quick services and transparent governance *Central team visited the district.. Collector Suryakumari explained the services
Publish Date : 16/09/2022
సచివాలయ సేవల్లో ఈ-గవర్నెన్స్‌కు అధిక ప్రాధాన్యత
*సత్వర సేవలకు, పారదర్శక పాలనకు వేదికగా నిలుస్తోన్న నూతన వ్యవస్థ
*జిల్లాకు విచ్చేసిన కేంద్ర బృందం.. సేవలను వివరించిన కలెక్టర్ సూర్యకుమారి
విజయనగరం, సెప్టెంబర్ 14 ః సామాన్య ప్రజలకు సులభంగా.. వేగంగా నాణ్యమైన సేవలందించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చిందని, తద్వారా ప్రజలకు సుమారు 798 రకాల సేవలందిస్తోందని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి పేర్కొన్నారు. సచివాలయ వ్యవస్థ పనితీరును పరిశీలించేందుకు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు రాజు సరస్వత్, విజత్ ప్రకాశ్ భట్ లు బుధవారం జిల్లాకు విచ్చేశారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ సూర్యకుమారిని తన ఛాంబర్లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారితో పలు అంశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ పనితీరు, సామాన్య ప్రజలకు అందుతున్న సేవల గురించి వివరించారు.
సచివాలయ వ్యవస్థ ద్వారా ఈ-గవర్నెన్స్ విధానానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ సేవలందిస్తున్నామని గుర్తు చేశారు. మొత్తం సేవల్లో 540 సేవలను ఏపీ సేవా పోర్టల్ ద్వారా, మరో 252 సేవలను సీఎస్‌సీ పోర్టల్ ద్వారా అందిస్తున్నామని పేర్కొన్నారు. వీటితో పాటు ఆధార్, ఐజీఆర్ ఎస్ పోర్టల్ ద్వారా మరికొన్ని సేవలను అందిస్తున్నామని కమిటీ సభ్యులకు వివరించారు. జిల్లాలో 626 సచివాలయాల ద్వారా ఉన్నత చదువులు చదివిన సిబ్బంది సేవలను అందిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే వారికి సహాయంగా క్షేత్ర స్థాయిలో వాలంటీర్లు తోడ్పాటు అందిస్తున్నారని చెప్పారు. సాంకేతికతను ఉపయోగించి అన్ని రకాల సేవలను ఆన్‌లైన్ ద్వారా అందిస్తున్నామన్నారు. డిజిటల్ ప్రక్రియలో విద్యార్థులకు, రైతులకు, ఇతర సామాన్య ప్రజలకు అవసరమైన అన్ని రకాల ధృవ పత్రాలను జారీ చేస్తున్నామని వివరించారు. సత్వర సేవలందించేందుకు గాను వివిధ రకాల యాప్‌లను వినియోగిస్తున్నట్లు కలెక్టర్ కమిటీ సభ్యులకు తెలిపారు.
ఎన్నో లక్ష్యాలను చేరుకున్నాం
సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి ఎన్నో లక్ష్యాలను చేరుకున్నామని కలెక్టర్ సూర్యకుమారి కమిటీ సభ్యులకు వెల్లడించారు. బాల్య వివాహాలను తగ్గించామని, రక్త హీనత సమస్యను అధిగమించామని, మధ్యలో బడిమానివేసే పిల్లల సంఖ్యను బాగా తగ్గించామని, గృహ హింసను అరికట్టామని, కరోనా సమయంలో నిర్ణీత కాలంలో జిల్లాలోని ప్రజలందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించగలిగామని వివరించారు. వీటితో పాటు వ్యవసాయ, వైద్య, విద్యా రంగ సంబంధిత సేవలను సులభంగా అందిస్తున్నామని పేర్కొన్నారు.
అనంతరం జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ స్థానిక కలెక్టరేట్ మీటింగ్ హాలులో సీపీవో బాలాజీ, జడ్పీ సీఈవో అశోక్ కుమార్లతో కలిసి కమిటీ సభ్యులకు సచివాలయ వ్యవస్థ రూపకల్పన, జిల్లాలో తద్వారా అందిస్తున్న సేవల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రజలకు చేరువగా ఉంటూ నాణ్యమైన సేవలందిస్తున్నామని, అనూహ్యమై ఫలితాలు చవిచూశామని జేసీ పేర్కొన్నారు.
జిల్లాలో మూడు రోజుల పాటు కమిటీ పర్యటన
సచివాలయ వ్యవస్థ ద్వారా అందుతున్న సేవలు, నూతన వ్యవస్థ పనితీరు గురించి పరిశీలించేందుకు జిల్లాకు విచ్చేసిన కమిటీ సభ్యులు రాజు సరస్వత్, విజత్ ప్రకాశ్ భట్ లు జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని సచివాలయాలను సందర్శిస్తారని అక్కడ అందే సేవలపై పరిశోధన చేస్తారని పేర్కొన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందజేస్తున్న సేవలు, అమలు చేస్తున్న పథకాల గురించి ఆరా తీస్తారని చెప్పారు. వీటితో పాటు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న భూముల రీసర్వే ప్రక్రియను, రైతు భరోసా కేంద్రాలను, వెల్‌నెస్ కేంద్రాలను పరిశీలిస్తారని వివరించారు.
కార్యక్రమాల్లో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, సీపీవో బాలాజీ, జడ్పీ సీఈవో అశోక్ కుమార్, సచివాలయాల జిల్లా కో-ఆర్డినేటర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.