District Collector A. Suryakumari stated that the district is very suitable for setting up food related industries as all types of food products are available here.
Publish Date : 16/09/2022
ఆహార ఆధారిత పరిశ్రమలకు జిల్లా అనుకూలం
*కేంద్ర బృందానికి నివేదించిన కలెక్టర్ ఎ. సూర్యకుమారి
విజయనగరం, సెప్టెంబర్ 14 ః ఆహార సంబంధిత పరిశ్రమలు నెలకొల్పేందుకు జిల్లా చాలా అనుకూలమని అన్ని రకాల ఆహార ఉత్పత్తులు ఇక్కడ లభిస్తాయని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి పేర్కొన్నారు. సచివాలయ వ్యవస్థ పనితీరును పరిశీలించేందుకు బుధవారం జిల్లాకు విచ్చేసిన కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కమిటీ సభ్యులు రాజు సరస్వత్, విజత్ ప్రకాశ్ భట్ లు జిల్లా కలెక్టర్ సూర్యకుమారిని తన ఛాంబర్లో మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలో పండుతున్న ఆహార, వాణిజ్య పంటల గురించి వివరించారు. జిల్లాలో ఎక్కువగా మామిడి, మొక్కజొన్న అందుబాటులో ఉంటుందని ఆ రెండు రకాల ఉత్పత్తులకు లాభదాయకమైన మార్కెటింగ్ పరిస్థితులు కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సూక్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల విధానంలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఇటీవల కొన్ని ప్రతిపాదనలు కూడా రూపొందించామని కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. ఎగుమతులకు తగిన ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పారు. జిల్లాలోని ఆహార సంబంధిత పరిశ్రమల నెలకొల్పేందుకు ఉన్న అవకాశాలను, పరిస్థితులను కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలని, తగిన సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.