విజయనగరం ఉత్సవాలను విజయవంతం చేయాలి వేదికలను పరిశీలించిన కలెక్టర్ సూర్యకుమారి భక్తులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశం
Publish Date : 03/10/2022
విజయనగరం, అక్టోబరు 03 ః
ఈనెల 9,10,11 తేదీల్లో జరగనున్న విజయనగరం ఉత్సవాలని విజయవంతం చేసేందుకు ప్రతీఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి కోరారు. గతం కంటే వైభవంగా ఈ సారి ఉత్సవాలకు ఏర్పాట్లను చేస్తున్నట్లు చెప్పారు. సంప్రదాయ వేదికలతోపాటు ఈ సారి కొత్తగా మన్నార్ రాజగోపాలస్వామి ఆలయంలో పథ్యపఠనం, అవథానం ఏర్పాటు చేస్తున్నామన్నారు. శిల్పారామంలో వివిధ జానపద క్రీడల ప్రదర్శన జరుగుతుందని చెప్పారు. రెవెన్యూ హోమ్‌లో పాటల పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, విజయనగరం ఉత్సవాలకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఉత్సవాలు జరిగే వేదికలను కలెక్టర్ సూర్యకుమారి, సోమవారం సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు.
అయోధ్యా మైదానాన్ని కలెక్టర్ ముందుగా సందర్శించారు. మెగా కల్చరల్ ఈవెంట్ కోసం మైదానంలో చేస్తున్న ఏర్పాట్లను, వయోజన విద్యాశాఖ డిడి కోట్ల సుగుణాకరరావు, సిపిఓ పి.బాలాజీ వివరించారు. వేదికను మైదానం మద్యలో ఏర్పాటు చేయాలని, ప్రత్యేకంగా పార్కింగ్ కోసం స్థలాన్ని విడిచిపెట్టాలని, గ్యాలరీని బాగుచేసి, ప్రేక్షకులు కూర్చొనేవిధంగా ఏర్పాటు చేయాలని, మైదానంలోని పిచ్చిమొక్కలను తొలగించాలని కలెక్టర్ సూచించారు. అమ్మవారి జాతరకు వచ్చే భక్తులు పార్కింగ్ కోసం ఇబ్బంది పడకుండా, తగిన ఏర్పాట్లు చేయాలని, డిఎస్‌పి త్రినాధ్‌కు కలెక్టర్ సూచించారు.
సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించే ఆనందగజపతి ఆడిటోరియంను సందర్శించారు. అక్కడ చేస్తున్న ఏర్పాట్లను మెప్మా పిడి సుధాకరరావు, డిప్యుటీ సిఇఓ కె.రాజ్‌కుమార్, మున్సిపల్ ఇఇ శ్రీనివాసరావు వివరించారు. ర్యాలీ అనంతరం నిర్వహించే కళారూపాల ప్రదర్శన కోసం చేస్తున్న ఏర్పాట్లపై కలెక్టర్ ఆరా తీశారు. సుమారు పదివేల మంది ర్యాలీలో పాల్గొంటారని, ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆలయ నమూనాలను ప్రదర్శించే టిటిడి కల్యాణ మండపం, నాటక ప్రదర్శన జరిగే గురజాడ కళాక్షేత్రం, మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలను పరిశీలించారు. ఫల పుష్ప ప్రదర్శనను ఏర్పాటు చేసే సంగీత కళాశాలవద్ద ఎల్ఇడి లైట్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.
విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించే కోటను సందర్శించారు. కోటవద్ద చేస్తున్న ఏర్పాట్లను, వేదిక ఇన్‌ఛార్జ్, సమగ్ర శిక్ష ఎపిసి పి.ఏ.స్వామినాయుడు, స్వాగత ద్వారం గురించి, జిల్లా గృహనిర్మాణశాఖాధికారి ఎస్‌వి రమణమూర్తి వివరించారు. అవథానం, పద్యపఠనం, బుర్రకథలు, హరికథలు జరిగే శ్రీ మన్నార్ రాజగోపాల స్వామి ఆలయాన్ని సందర్శించారు. దక్షిణవైపు కూడా ద్వారాన్ని ఏర్పాటు చేస్తే, అందరికీ సౌకర్యవంతంగా ఉంటుందని, తాత్కాలికంగా అయినా, ద్వారాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. అనంతరం రాజీవ్ క్రీడా మైదానాన్ని సందర్శించి, విద్యార్థులకు క్రీడా పోటీలపై సెట్విజ్ సిఈఓ రామానందంతో చర్చించారు. ఈ పర్యటనలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, హౌసింగ్ పిడి ఎస్‌వి రమణమూర్తి, ఆయా వేదికల ఇన్‌ఛార్జి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
……………………………………………………………………………………………………
జారీ ః జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖాధికారి, విజయనగరం.