District Collector A. Suryakumari has ordered to provide all the basic facilities in Jaganna Colony and make it ready for house entry by November.
Publish Date : 21/10/2022
జగనన్న కాలనీలకు తక్షణమే త్రాగునీరు, విద్యుత్
నవంబరు నాటికి గృహప్రవేశాలకు సిద్దం చేయాలి
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
అభివృద్ది కార్యక్రమాలపై సమీక్ష
విజయనగరం, అక్టోబరు 17 ః
జగనన్న కాలనీల్లో అన్ని మౌలిక సదుపాయాలను కల్పించి, నవంబరు నాటికి గృహప్రవేశాలకు సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశించారు. పూర్తి అయిన కాలనీలకు తక్షణమే త్రాగునీరు, విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలని సూచించారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్‌నెస్‌సెంటర్లు, జగనన్న గృహనిర్మాణం, జలజీవన్ మిషన్ తదితర అభివృద్ది కార్యక్రమాలపై తన ఛాంబర్‌లో సోమవారం సమీక్షా సమావేశాన్నినిర్వహించారు.
సచివాలయాలు, ఆర్‌బికె, వెల్‌నెస్ సెంటర్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సూచించారు. ఇప్పటికీ మొదలు పెట్టని పనులపట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పనులు మొదలుపెట్టకపోతే రద్దు అయిపోతాయని స్పష్టం చేశారు. కన్వర్జెన్సీ పనులను సకాలంలో పూర్తి చేయకపోతే, మార్చి తరువాత నిధులు మురిగిపోతాయని, దీనిని ప్రతీఒక్కరూ దృష్టిలో పెట్టుకోవాలన్నారు. జగనన్న కాలనీలను సిద్దం చేయాలన్నారు. పెద్ద కాలనీలను మోడల్ కాలనీలుగా అభివృద్ది చేయాలని, రోడ్లు, విద్యుత్, త్రాగునీరు తదితర అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించాలని సూచించారు. ఎట్టిపరిస్థితిలోనూ నవంబరు నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలని స్పష్టం చేశారు. మూడో ఆప్షన్ ఎంచుకొని, నిర్మాణంలో ఉన్న ఇళ్లపై ఆరా తీశారు. గృహనిర్మాణం కోసం అదనంగా ఇస్తున్న రూ.30వేల రుణం, లబ్దిదారులకు అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ కనక్షన్ల మంజూరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెలాఖరులోగా 237 కాలనీలకు విద్యుత్ సదుపాయం కల్పించాలని, నవంబరులో మిగిలిన వంద కాలనీలకు విద్యుత్ ఇవ్వాలని ఆదేశించారు. దీనికోసం రోజువారీ లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు. జలజీవన్ మిషన్ పనులను త్వరగా పూర్తి చేసి, ఇంటింటికీ కుళాయి కనక్షన్లు ఇవ్వాలని చెప్పారు. గ్రామాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్న అభివృద్ది పనుల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్లను క్రియాశీలకం చేయాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో డిఆర్‌డిఏ పిడి ఎ.కల్యాణచక్రవర్తి, మెప్మా పిడి సుధాకరరావు, పిఆర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఈలు బిఎస్ఆర్ గుప్త, బి.ఉమాశంకర్, హౌసింగ్ పిడి ఎన్‌వి రమణమూర్తి, వివిధ శాఖల ఇఇలు, డిఇలు పాల్గొన్నారు.