Close

24 గంట‌లూ విధుల్లో ఉండాలి పున‌రావాస కేంద్రాల్లో అన్ని వ‌స‌తులు జిల్లా తుఫాను ప్ర‌త్యేకాధికారి ర‌వి సుభాష్‌ ప‌లు మండ‌లాల్లో విస్తృత ప‌ర్య‌ట‌న‌

Publish Date : 29/10/2025

గుర్ల‌, గ‌రివిడి, చీపురుప‌ల్లి (విజ‌య‌న‌గ‌రం), అక్టోబ‌రు 28 ః

             మోంథా తుఫానును దృష్టిలో పెట్టుకొని జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన 71 పున‌రావాస కేంద్రాల్లో అన్ని వ‌స‌తుల‌ను క‌ల్పించాల‌ని జిల్లా తుఫాను ప్ర‌త్యేకాధికారి ర‌వి సుభాష్ ప‌ట్టంశెట్టి ఆదేశించారు. కాల్‌సెంట‌ర్ల‌తో పాటు స‌చివాల‌యాలు, పున‌రావాస కేంద్రాల్లో కూడా ప్ర‌భుత్వ సిబ్బంది షిప్టుల‌వారీగా 24 గంట‌లూ విధుల‌ను నిర్వ‌హించాల‌ని స్ప‌ష్టం చేశారు. రేష‌న్ స‌రుకులు, త్రాగునీరు, మందులు, ఇత‌ర అవ‌స‌ర‌మైన వ‌స్తువుల‌న్న‌టినీ సిద్దంగా ఉంచాల‌ని ఆదేశించారు. ఆయ‌న గుర్ల‌, గ‌రివిడి మండ‌లాల్లోని లోత‌ట్టు ప్రాంతాల్లో ఆయ‌న‌ మంగ‌ళ‌వారం విస్తృతంగా ప‌ర్య‌టించారు. పున‌రావాస కేంద్రాలను, స‌చివాల‌యాల‌ను త‌నిఖీ చేశారు. అక్క‌డ ఏర్పాటు చేసిన వ‌స‌తుల‌ను ప‌రిశీలించారు.

             గుర్ల‌ మండ‌లం ఎస్ఎస్ఆర్‌పేట‌లో ముందుగా ఆయ‌న ప‌ర్య‌టించారు. లోత‌ట్టు ప్రాంతంలో నీరు చేరేట‌ప్పుడు త‌గిన జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోవాల‌ని ఆదేశించారు. ఆనంద‌పురం క‌ల్వ‌ర్టును ప‌రిశీలించి, క‌ల్వ‌ర్టుపైనుంచి నీరు ప్ర‌వ‌హించే స‌మ‌యంలో రాక‌పోక‌ల‌ను నిలిపివేయాల‌ని సూచించారు. ఆనంద‌పురం గ్రామంలోని గురునాయుడు చెరువును ప‌రిశీలించారు. గండిప‌కుండా త‌గిన చ‌ర్య‌ల‌ను చేప‌ట్టాల‌ని, ముందుగానే ఇసుక బస్తాల‌ను సిద్దంచేసి ఉంచాల‌ని ఆదేశించారు.

              గ‌రివిడి బంగార‌మ్మ కాల‌నీలో ప్ర‌త్యేకాధికారి ప‌ర్య‌టించారు. ఇనుప విద్యుత్ స్థంభాల‌ను మార్చాల‌ని, అసంపూర్తిగా వ‌దిలేసిన కాలువ‌ను పూర్తి చేయాల‌ని కాల‌నీవాసులు విజ్ఞ‌ప్తి చేశారు. దీంతో వెంట‌నే వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. గ‌రివిడి, చీపురుప‌ల్లి జిల్లాప‌రిష‌త్ పాఠ‌శాల‌ల్లో ఏర్పాటు చేసిన పున‌రావాస కేంద్రాల‌ను సంద‌ర్శించి సంతృప్తిని వ్య‌క్తం చేశారు.

            ఈ ప‌ర్య‌ట‌న‌లో జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.సేధుమాద‌వ‌న్‌, ఆయా మండ‌లాల తాహ‌సీల్దారులు ఆదిల‌క్ష్మి, బంగార్రాజు, ధ‌ర్మ‌రాజు, ఇత‌ర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

…………………………………………………………………………………………………….

జారీ ః జిల్లా స‌మాచార పౌర సంబంధాల శాఖాధికారి, విజ‌య‌న‌గ‌రం.

2910-B

2910-B

2910-C

2910-C

2910-D

2910-D

2910-E

2910-E

2910-F

2910-F

2910-A

2910-A