రైతు పక్షానే ప్రభుత్వం ఉంటుంది· యూరియా వినియోగం పై రైతుల్లో అవగాహన కలిగించాలి–మంత్రి కొండపల్లి·
Publish Date : 07/11/2025
రైతు పక్షానే ప్రభుత్వం ఉంటుంది· యూరియా వినియోగం పై రైతుల్లో అవగాహన కలిగించాలి–మంత్రి కొండపల్లి· వైద్య కళాశాలల విషయం లో పిపి మోడల్ తో ప్రయోజనం-మంత్రి గుమ్మిడి సంద్యారాణి· 35 శాతం లోపల జరిగిన పంట నష్టాన్ని కూడా పరిగణన లోకి తీసుకోవాలి-జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జిశ్రీనివాస రావు· జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం లో మెడికల్ కళాశాల ,పంట నష్ట
రైతు పక్షానే ప్రభుత్వం ఉంటుంది
- యూరియా వినియోగం పై రైతుల్లో అవగాహన కలిగించాలి –మంత్రి కొండపల్లి
- వైద్య కళాశాలల విషయం లో పిపి మోడల్ తో ప్రయోజనం -మంత్రి గుమ్మిడి సంద్యారాణి
- 35 శాతం లోపల జరిగిన పంట నష్టాన్ని కూడా పరిగణన లోకి తీసుకోవాలి-జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు
- జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం లో మెడికల్ కళాశాల , పంట నష్ట పరిహారం పై చర్చ
విజయనగరం, నవంబర్ 06 : మోన్థా తుఫాన్ కు నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం అందిస్తామని రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఈ , ఎన్.ఆర్.ఐ వ్యవహారాల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. తుఫాన్ హెచ్చరికలు అందిన నుండే ముందస్తు చర్యలు తీసుకొని రాష్ట్రమంతటా అప్రమత్తం చేయడం జరిగిందని, ఈ చర్యల వల్లనే తుఫాన్ నష్టాలను తగ్గించగలిగామని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం రైతు పక్షానే ఉంటుందని, రైతు సమస్యల పై ప్రభుత్వం నుండి అన్ని రకాలుగా సహకారం ఉంటుందని అన్నారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరం లో జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం జరిగింది. జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం లో రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మిడి సంద్యారాణి, కురుపాం ఎం.ఎల్.ఏ మరియు ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, విజయనగరం, మన్యం జిల్లాల కలెక్టర్లు ఎస్. రాంసుందర్ రెడ్డి, డా.ఎన్ .ప్రభాకర్ రెడ్డి, విజయనగరం జే.సి సేదు మాధవన్, పార్వతీపురం సుబ కలెక్టర్ డా.ఆర్. వైశాలి పాల్గొన్నారు.
ధాన్యం సేకరణ పై జరిగిన చర్చ లో భాగంగా జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు మాట్లాడుతూ 35 శాతం కన్నా ఎక్కువ పంట నష్టం జరిగితేనే నమోదు చేస్తున్నారని, అంత కన్నా తక్కువ జరిగిన వారి పరిస్థితేంటని ప్రశ్నించారు. ఇప్పటికీ పంట కొంత మేరకు నీటిలో మునిగి ఉందని, ధాన్యం రంగు మారే అవకాశం ఉందని, వాటిని ఏ విధంగా కోనుగోలు చేస్తారో రైతులకు వివరించాలని కోరారు. అలాగే 30 శాతం లోపల నష్టం జరిగిన వారి వివరాలను కూడా నమోదు చేసి ప్రభుత్వం దృష్టి లో పెట్టాలని, వారికీ నష్ట పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పంట నష్టాలను నమోదు చేసేటప్పుడు భౌతికంగా పంట ను తనిఖీ చేసి నమోదు చేయాలనీ, ఎవరో చెప్పారని నమోదు చేయకూడదని తెలిపారు. వీలైతే పంట నష్ట నష్టాలను నమోదు తేదీలను పొడిగించాలని కోరారు. అలాగే గోనె సంచులు ప్రభుత్వం సరఫరా చేస్తుందా లేక రైతులే సమకుర్చుకోవాలా స్పష్టంగా చెప్పాలన్నారు. జే.సి సేదు మాధవన్ స్పందిస్తూ జిల్లాకు కోటి గోనె సంచులు అవసరం అవుతాయని, ప్రస్తుతం జిల్లా స్థాయి లో 50 లక్షల వరకు సర్దుబాటు అవుతున్నాయని, మిగిలిన వాటి కోసం ప్రభుత్వం స్థాయి లో చర్చ జరుగుతోందని తెలిపారు.
మంత్రి కొండపల్లి మాట్లాడుతూ అవసరమైన కంటే ఎక్కువ మోతాదు లో రైతులు యూరియా వినియోగిస్తున్నారని, యూరియా ఎక్కువగా వినియోగించడం వలన కాన్సర్ వంటి వ్యాధులు వస్తున్నాయని, రైతులకు యూరియా వినియోగం పై అవగాహన కలిగించాలని తెలిపారు. ప్రజల ఆరోగ్యం ముఖ్యమని, దీనిని రాజకీయం చేయకూడదని మంత్రి అన్నారు. అధికంగా నిల్వ చేసుకోవడం వలన జిల్లాలో యూరియా కొంత లోటు ఏర్పడినప్పటికీ ప్రభుత్వం యూరియా సరఫరా సకాలం లో చేయడం జరిగిందని తెలిపారు.
వైద్య శాఖలో చర్చ సందర్భంగా పలువురు జెడ్.పిటి సి లు, ఎం.పి.పి లు మాట్లాడుతూ గత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేస్తే ఈ ప్రభుత్వం వాటిని ప్రైవేటు మోడల్ కు తేవడం బాధాకరమని, పేద ప్రజలకు వైద్యం దూరం అవుతుందని ఆవేదన వ్యక్తం చేరు. మెడికల్ కళాశాలల్లో గత ప్రభుత్వం మంజూరు చేసిన పాలసీ ని కొనసాగించాలని, ప్రైవేటు భాగస్వామ్యం తో నష్టం జరుగుతుందని తెల్పారు. మంత్రి గుమ్మిడి సంద్యారాణి స్పందిస్తూ పి పి అపేదే లేదని, ఈ విధానం ప్రజలకు, పేదలకు ప్రయోజనమని భావించి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు. దీనివలన పేదలకు మెడికల్ సీట్లు పెరుగుతాయని, ఉచిత, నాణ్యమైన వైద్యం అందుతుందని తెలిపారు. ఎం.ఎస్.ఎం.ఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ విజయనగరం మెడికల్ కాలేజీ ప్రారంభం అయినప్పటికీ ఇంకనూ 600 కోట్ల రూపాయలను ఖర్చు చేయవలసి ఉందని, ఆ విధంగా అన్ని కాలేజీ లకు వేల కోట్లను ఖర్చు చేయవలసి ఉంటుందని, ఇది ప్రభుత్వానికి భారం అవుతుందని, ప్రజలకు అందించే సౌకర్యాలలో ఎటువంటి లోపం లేకుండా చూస్తామని, ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యం అందరికీ ఆమోదయోగ్యమని పేర్కొన్నారు.
కొత్త పించన్లు ఎప్పుడు ఇస్తారని వై.సి.పి నాయకులూ ప్రశ్నించగా మంత్రి కొండపల్లి మాట్లాడుతూ దరఖాస్తులను తీసుకోవడం జరుగుతోందని, దీని పై త్వరలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. భోగాపురం ఎం.పిపి మాట్లాడుతూ రావాడ పంచాయతి లో కి ఎయిర్పోర్ట్ నుండి నీటిని పంపడం తో గ్రామం లో కాలు పెట్టలేని పరిస్థితి నెలకొందని, దీనికి పరిష్కారం కావాలని తెలుపగా జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి స్పందిస్తూ ఈ సమస్య తన దృష్టి కి వచ్చిందని, ఇరిగేషన్, రెవిన్యూ, ఎయిర్పోర్ట్ అధికారులతో కలిసి టీం వర్క్ జరగవలసి ఉందని, త్వరలో ఈ సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు.
ఈ సమావేశం లో శాసన మండలి సభ్యులు డా. సురేష్ బాబు, ఎం.ఎల్.ఏ లు అదితి గజపతి రాజు, కోళ్ళ లలిత కుమారి, లోకం నాగమాధవి, డి.సి.ఎం.ఎస్. చైర్మన్ గొంప కృష్ణ , కాపు కార్పొరేషన్ ఛైర్పర్సన్ పాలవలస యశస్వి, పలు సమస్యల పై మాట్లాడారు. ఈ సమావేశం లో జిల్లా పరిషత్ సి.ఈ.ఓ సత్యనారాయణ, రెండు జిల్లాలకు చెందిన అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
……………………………………………………………………………………………………
జారీ ః జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖాధికారి, విజయనగరం.

071125-A


071125-F

071125-E

071125-D

071125-C
071125-B