ఉపాధ్యాయుడిగా అవతారమెత్తిన కలెక్టర్, విద్యార్ధులతో కలిసి సహపంక్తి భోజనం
Publish Date : 11/11/2025
ఉపాధ్యాయుడిగా అవతారమెత్తిన కలెక్టర్
విద్యార్ధులతో కలిసి సహపంక్తి భోజనం
గంట్యాడ, (విజయనగరం), నవంబరు 07 ః ఆయన జిల్లాకు సర్వోన్నతాధికారి. మొత్తం యంత్రాంగాన్ని శాసించే అత్యుత్తమ ఉన్నతాధికారి. అయినప్పటికీ ఒక సామాన్య వ్యక్తిలా విద్యార్ధులతోబాటు క్యూలో నిల్చొని భోజనం పట్టుకున్నారు. వారితో కలిసి నేలపైనే కూర్చొని భోజనం చేశారు. ఆయనే జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి. ఈ అరుదైన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది.
జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి శుక్రవారం గంట్యాడ మండలంలో ఆకస్మికంగా పర్యటించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ముందుగా తరగతి గదిలోకి వెళ్లి ఆంగ్ల ఉపాధ్యాయుడు డిజిటల్ స్క్రీన్ ద్వారా చెబుతున్న పాఠాన్ని విన్నారు. అదే పాఠాన్ని తాను కూడా కొంతసేపు విద్యార్ధులకు బోధించారు. విద్యార్ధులతో ముచ్చటించి వివిధ అంశాలపై ఆరా తీశారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. తాను కూడా విద్యార్ధులతో కలిసి క్యులైన్లో నిల్చొని పల్లెంలో భోజనం పట్టుకున్నారు. వారితో కలిసి నేలపైనే కూర్చొని భోజనం చేశారు. ఆహారాన్ని రుచికరంగా తయారు చేయాలని, విద్యార్ధులకు కడుపునిండా భోజనం పెట్టాలని ఆదేశించారు.
ఈ పర్యటనలో డిఈఓ యు.మాణిక్యంనాయుడు, తాహసీల్దార్ నీలంఠేశ్వరరెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు ఝాన్సీలక్ష్మి, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
………………………………………………………………………………………………………
జారీ ః జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖాధికారి, విజయనగరం.

111125-A

111125-B

111125-C