21.11.2025 మాతృ, శిశు మరణాల పట్ల కలెక్టర్ ఆగ్రహం నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశం
Publish Date : 22/11/2025
పత్రికా ప్రకటన-5
మాతృ, శిశు మరణాల పట్ల కలెక్టర్ ఆగ్రహం
నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశం
విజయనగరం, నవంబరు 21 ః జిల్లాలో మాతృ, శిశు మరణాలు సంభవించడం పట్ల వైద్యారోగ్యశాఖపై జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరణాలు చోటుచేసుకుంటుంటే క్షేత్రస్థాయిలోని ప్రభుత్వ యంత్రాంగం ఏంచేస్తోందని ప్రశ్నించారు. పేద ప్రజల ప్రాణాల రక్షణకోసమే ఈ యంత్రాంగం ఉందని, సిబ్బంది నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
డిస్ట్రిక్ట్ మెటర్నల్, చైల్డ్ డెత్ సర్వైలెన్స్ రెస్పాన్స్ కమిటీ (ఎంపిసిడిఎస్ఆర్) సమీక్షా సమావేశం కలెక్టరేట్లో శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో నాలుగు మాతృ మరణాలు, మూడు శిశు మరణాలపై కలెక్టర్ సమీక్షించారు. ఒక్కొక్క మృతికి కారణాలను తెలుసుకున్నారు. మరణాలు సంభవించిన కుటుంబ సభ్యులను, వారి యోగ క్షేమాలను విచారించారు. వైద్యాధికారులు, చికిత్సనందించిన వైద్యులను ప్రశ్నించి కారణాలను తెలుసుకున్నారు. కొన్ని మరణాల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం కనిపిస్తోందని అన్నారు. ఆయా అధికారులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని మరణాలపై సమగ్ర నివేదికను ఇవ్వాలని ఆదేశించారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఆశ కార్యకర్తలు ఆప్రమత్తంగా ఉండాలని, గర్భిణులు, బాలికలు, మహిళల విషయంలో ప్రత్యేక శ్రద్ద చూపించాలని ఆదేశించారు. ముఖ్యంగా బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రత, కౌమార దశలో వచ్చే శారీరక మార్పులు, నైతిక విలువలు, కట్టుబాట్లు, ఆకర్షణలకు, ప్రలోభాలకు లొంగిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించాలని సూచించారు. అవగాహన కల్పించేందుకు క్షేత్రస్థాయిలో ఏఎన్ఎం, ఆశా, అంగన్వాడీ కార్యకర్త, మహిళా పోలీసులతో కమిటీలు వేయాలని సూచించారు. జిల్లాలో మాతృ, శిశు మరణాలను గణనీయంగా తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ జీవనరాణి, డిసిహెచ్ఎస్ డాక్టర్ పద్మశ్రీరాణి, ఘోషాసుపత్రి గైనకాలజి విభాగాధిపతి డాక్టర్ శుభశ్రీ, డిఐఓ డాక్టర్ అచ్చుతకుమారి, ఐసిడిఎస్ పిడి విమలారాణి, డిటిఓ డాక్టర్ కె.రాణి, పలువురు వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
…………………………………………………………………………………………………….
జారీ ః జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖాధికారి, విజయనగరం.

21-11-1

21-11-2

21-11-3