22.11. 2025-ఉత్తరాంధ్రలో పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేస్తున్న కూటమి ప్రభుత్వం – రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్
Publish Date : 24/11/2025
ఉత్తరాంధ్రలో పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేస్తున్న కూటమి ప్రభుత్వం – రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్.
సిఐఐ సమ్మిట్ తర్వాత ప్రపంచమంతా రాష్ట్రాన్ని కొనియాడుతుంటే, వైకాపా నాయకులు కువిమర్శలు చేస్తున్నారు.
త్వరలో విజయనగరం జిల్లాలో ఐటీ కంపెనీలు రాబోతున్నాయి.
పారిశ్రామిక అభివృద్ధితో స్థానికులకు దక్కనున్న ఉద్యోగాలు.
ధాన్యం కొనుగోలు పై వైకాపా నాయకుల విమర్శించటం తగదు.
గంటల వ్యవధిలో రైతుల ఖాతాలోకి ధాన్యం డబ్బులు.
విజయనగరం: 22 నవంబర్: విశాఖపట్నంలో జరిగిన సీఐఐ సమ్మిట్ తర్వాత ప్రపంచమే మన వైపు చూస్తుందని,ఆంధ్రపదేశ్ ప్రపంచం లోనే ప్రత్యేకంగా నిలిచిన ఈ సందర్భం తరువాత వైసీపీ నేతలు రాష్ట్రం లో ఏమి మాటాడుతున్నారో వాళ్లకే తెలియటం లేదని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అన్నారు, విజయనగరంలోని క్యాంపు కార్యాలయంలో శనివారం మంత్రి శ్రీనివాస్ విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో వైసీపీ నేతలు రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, గత ఐదేళ్లు విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం వైసీపీ నేతలు ఏమి చేశారో చెప్పాలని మంత్రి నిలదీశారు. రాష్ట్రం లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత విశాఖ ఉక్కు కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా రూ.11,400 కోట్ల నిధులు తీసుకొచ్చి పరిశ్రమను గాడిలో పెట్టామని చెప్పారు. విశాఖ ఉక్కుకి సొంత గనులు లేవని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుకూలమైన గనులు లేనందున కేంద్రప్రభుత్వ సంస్థ యన్ఎండిసి వద్దనుంచి ముడి ఇనుప ఖనిజం కొంటున్నారని, అర్సిలర్ మిట్టల్ కు పైపులైన్ ద్వారా ముడి ఇనుము యన్ఎండిసి నుంచే వస్తుందని చెప్పారు. యువనేత నారా లోకేష్ యువగళంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రం లో 20 లక్షలు ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తున్నామని, ఇందుకోసం క్యాబినెట్ సబ్ కమిటీని వేసి అధ్యయనం చేసి ఉద్యోగ కల్పన కోసం క్యాబినెట్ సభ్యులు పనిచేస్తున్నారని ఆయన చెప్పారు.
విజయనగరం జిల్లాలో కొందరు వైకాపా నాయకులు దాన్యం కొనుగోలు వ్యవహారంపై విమర్శలు చేస్తున్నారని, వారు విమర్శలు చేసే ముందు వారి హయాంలో ఏం జరిగిందో ఒకసారి ఆలోచించి మాట్లాడితే బాగుండేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హితవు పలికారు. గత ఐదేళ్లు ధాన్యం కొనుగోలు విషయం లో ఏమి చేసింది ప్రజలకు తెలుసని, వైకాపా పాలనా కాలంలో దాన్యం కొనుగోలు సందర్భంగా రైతుల నుంచి బస్తాకు ఐదు కేజీలు అదనంగా తీసుకున్న మాట వాస్తవం కాదా అని మంత్రి ప్రశ్నించారు.ఈ ఏడాది విజయనగరం జిల్లాలో నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొలుగోలు చెయ్యడానికి ప్రభుత్వంనిర్ణయం తీసుకున్నదని రైతులకు ఎక్కడ ఇబ్బందులు రాకుండా గన్నీ సంచులను రైతులని తీసుకోమని చెప్పి నేరుగా రైతులకు గన్ని సంచులను డబ్బులను జమ చేస్తున్నామని అన్నారు. రైతులకు ఎక్కడ ఇబ్బంది రాకుండా ఉండేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, గత వైకాపా ప్రభుత్వ హయాంలో రైతులు అమ్ముకున్న ధాన్యానికి సకాలంలో ఎప్పుడైనా డబ్బులు ఇచ్చారా? అలా ఇచ్చిన సందర్భం ఉంటే చెప్పాలని మంత్రి నిలదీశారు. ధాన్యం ప్రభుత్వానికి అమ్ముకున్న రైతులకు ఆరు నెలలకు లేక ఏడాదికో డబ్బు చెల్లించే వాతావరణం అప్పుడు ఉండేదని, తమ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ వాతావరణాన్ని పూర్తిగా మార్చివేసామని, ప్రస్తుతం రైతు రైస్ మిల్లుకు ధాన్యం పంపించిన గంటల వ్యవధిలోనే రైతు ఎకౌంట్ లో సొమ్ము జమ అవుతుందని మంత్రి శ్రీనివాస్ తెలియజేశారు.
విజయనగరం జిల్లాలో అనేక పరిశ్రమలు వస్తున్నాయని, పరిశ్రమలు ఏర్పాటుతో త్వరలో భారీగా ఉద్యోగాలు రాబోతున్నాయని మంత్రి అన్నారు. త్వరలో విజయనగరంలో ఐటీ కంపెనీలు రాబోతున్నాయని మన జిల్లాలో చదువుకున్న నిరుద్యోగ యువతకు ఇక్కడే ఉపాధి అవకాశాలు దక్కుతాయని ఆయన వివరించారు. మన ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు అయితే ఇక్కడే ఉపాధి అవకాశాలు దాకడంతో పాటు, స్థానికులకు ఆర్థిక స్థిరత్వం ఏర్పాటు అవుతుందని తద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి దోహదం చేస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివరించారు.
ఈ ప్రకటన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కార్యాలయం, విజయనగరం నుండి జారీ చేయడమైనది

2411