27.12.2025 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సౌర విద్యుత్, జనవరి మొదటివారంలో అమలుకు కలెక్టర్ ఆదేశం
Publish Date : 29/12/2025
పత్రికా ప్రకటన
ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సౌర విద్యుత్
జనవరి మొదటివారంలో అమలుకు కలెక్టర్ ఆదేశం
విజయనగరం, డిసెంబరు 27 : ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకంలో భాగంగా, జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు చెందిన కుటుంబాలకు ఉచితంగా సౌర విద్యుత్‌ను అందించే పథకాన్ని జనవరి మొదటి వారంలో ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. అర్హులైన ప్రతి ఇంటిపై రెండు కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ ఫలకాలను ప్రభుత్వం ఎటువంటి ఖర్చు లేకుండా ఉచితంగా ఏర్పాటు చేయనుందని, దీనిని లబ్దిదారులకు త్వరితగతిన అందజేయాలని సూచించారు.
ఈ పథకం అమలుపై జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఎపిఈపిడిసిఎల్ ఎస్ఈ ఎం.లక్ష్మణరావుతోపాటు సంబంధిత సంస్థల ప్రతినిధులతో శనివారం తమ ఛాంబర్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. పనులను వేగవంతం చేసి, 2026 జనవరి మొదటి వారంలోనే మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు మరియు ఇతర ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ పథకం ద్వారా వేల కుటుంబాలకు విద్యుత్ బిల్లుల భారం తగ్గి, శాశ్వత ప్రాతిపదికన వెలుగులు నిండనున్నాయి.
పథకం వివరాలు ః
జిల్లా వ్యాప్తంగా విభాగాల వారీగా పనుల కేటాయింపు పూర్తయింది. బొబ్బిలి విభాగంలో 3,948 ఇళ్లకు (ఎస్సీ 2,764, ఎస్టీ 1,184), -మెస్సర్స్ ప్రష ఎనర్జీ కన్సల్టింగ్. చీపురుపల్లి విభాగంలో 1,326 ఇళ్లకు (ఎస్సీ 926, ఎస్టీ 397), -మెస్సర్స్ రాక్‌లాండ్ ఇండస్ట్రీస్ విజయనగరం గ్రామీణ విభాగంలో అత్యధికంగా 5,410 ఇళ్లకు (ఎస్సీ 3,787, ఎస్టీ 1,623) పనులను ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. -మెస్సర్స్ సద్భవ్ ఫ్యూచర్‌టెక్ లిమిటెడ్. విజయనగరం పట్టణ విభాగానికి సంబంధించి 2,869 ఇళ్లకు (ఎస్సీ 2,686, ఎస్టీ 184) టెండర్ల ప్రక్రియ ప్రస్తుతం పరిశీలనలో ఉంది.
……………………………………………………………………………………………………
జారీ ః జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖాధికారి, విజయనగరం.

27-12-1

27-12-2