Achieve Sustainable Integrated Development Goals, District Collector A. Suryakumari
Publish Date : 09/02/2022
సుస్థిర సమగ్రాభివృద్ది లక్ష్యాలను సాధించాలి
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
విజయనగరం, ఫిబ్రవరి 07 ః సుస్థిర సమగ్రాభివృద్ది లక్ష్యాలను సాధించేందుకు ప్రతీశాఖా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ఆదేశించారు. శాఖలవారీగా లక్ష్యాలను నిర్ధేశించుకొని, వాటిని చేరేందుకు సమగ్ర ప్రణాళికలను రూపాందించుకోవాలని సూచించారు. సుస్థిరాభివృద్ది లక్ష్యాల సాధనపై వివిధ శాఖల జిల్లా అధికారులకు అవగాహనా కార్యక్రమం సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగింది.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ, విద్య, వైద్యం, ఆరోగ్యం, నీటిపారుదల, పరిశ్రమలు, పర్యావరణం, మానవ వనరుల అభివృద్ది, పేదరిక నిర్మూలన, మౌలిక సదుపాయాల కల్పన తదితర కీలక అంశాల్లో సుస్థిరమైన, సమగ్రమైన అభివృద్ది సాధించేందుకు ఆయా శాఖలవారీగా లక్ష్యాలను నిర్ధేశించడం జరిగిందని చెప్పారు. మొత్తం 17 లక్ష్యాల్లో 115 సూచికలను నిర్ణయించారని, వాటి ఆధారంగా జిల్లాకు ర్యాంకులు ఇవ్వడం జరుగుతోందని చెప్పారు. అందువల్ల ప్రతీ అంశంపైనా దృష్టి పెట్టి, ప్రగతిని సాధించాలని సూచించారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా పారిశుధ్యానికి కూడా ప్రస్తుతం అధిక ప్రాధాన్యత నివ్వడం జరుగుతోందన్నారు. అక్షరాస్యత పెంచడం, డ్రాపౌట్స్‌ను తగ్గించడం, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం, స్త్రీపురుష నిష్పత్తిలో తేడాలు తగ్గించడం, మౌలిక సదుపాయాల కల్పన, ఫోర్టిఫైడ్ రైస్ వినియోగం, అయోడైజ్డ్ ఉప్పు వాడకాన్ని పెంపొందించడం, రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రభుత్వ శాఖల పరంగా సేవలను మెరుగుపర్చడం పైనా ప్రత్యేకాధికారులు దృష్టిపెట్టాలని సూచించారు. ప్రభుత్వ శాఖలన్నీ పరస్పర సమన్వయంతో లక్ష్యాల సాధనకు కృషి చేయాలని కలెక్టర్ కోరారు.
సుస్థిరాభివృద్ది లక్ష్యాలు, వాటి సాధనలో జిల్లా సాధించిన ర్యాంకులు, జిల్లాలోని పరిస్థితులను, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి జె.విజయలక్ష్మి వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ జిసి కిశోర్ కుమార్, జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ (ఆసరా) జె.వెంకటరావు, వివిధ శాఖల అధికారులు, ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.