Close

Be alert for storm surges, chance of heavy rains from 3am, farmers’ hardship should not be wasted, all precautionary measures should be taken, Collector Suryakumari in video conference

Publish Date : 03/12/2021

తుఫాను ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండండి

3 నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం

రైతుల క‌ష్టం వృధా కాకూడ‌దు

అన్ని ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లూ చేప‌ట్టాలి

వీడియో కాన్ఫ‌రెన్స్ లో క‌లెక్టర్ సూర్య‌కుమారి

విజ‌య‌న‌గ‌రం, డిసెంబ‌రు 01 ః             బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం కార‌ణంగా ఈ నెల 3వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని, అన్ని ముందు జాగ్ర‌త్త‌లూ తీసుకోవాల‌ని జిల్లా యంత్రాంగాన్ని క‌లెక్ట‌ర్ శ్రీ‌మతి ఎ.సూర్య‌కుమారి అప్ర‌మ‌త్తం చేశారు. ఈ అల్ప‌పీడ‌నం ఒక‌వేళ‌ తుఫానుగా మార‌క‌పోయినా, వ‌ర్షాలు మాత్రం విస్తారంగా కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించిన‌ట్లు తెలిపారు. మండ‌ల ప్ర‌త్యేకాధికారులు, తాశీల్దార్లు, ఎంపిడిఓలు, వ్య‌వ‌సాయాధికారుల‌తో క‌లెక్ట‌రేట్ నుంచి బుధ‌వారం వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.

        ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, 3వ తేదీ నుంచి నాలుగు రోజుల‌పాటు భారీ వ‌ర్షాలు, ఈదురు గాలులు వీచే అవ‌కాశం ఉంద‌న్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని జిల్లాలో ఎటువంటి ప్రాణ‌, ఆస్తి న‌ష్టాలు జ‌ర‌గ‌కుండా అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌ల‌నూ తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ముఖ్యంగా ప్ర‌స్తుతం వ‌రిపంట కోత‌ద‌శ‌లో ఉంద‌ని, రైతుల క‌ష్టం వృధా కాకుండా చూడాల‌న్నారు. ధాన్యం బ‌స్తాల‌ను సుర‌క్షిత చోటుకు త‌ర‌లించాల‌ని సూచించారు. టార్పాలిన్ల‌తో వాటిని భ‌ద్ర‌ప‌ర‌చాల‌న్నారు. కోత‌కు సిద్ద‌మైన పంట పొలాల్లో నీరు నిల్వ ఉండ‌కుండా పాయ‌లు తీసి ఉంచాల‌ని సూచించారు. అవ‌స‌ర‌మైతే ప్ర‌జ‌ల‌ను త‌ర‌లించేందుకు త‌గిన ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు భ‌వ‌నాల‌ను గుర్తించాల‌ని సూచించారు. త‌గినన్ని ఆహార ప‌దార్దాలు, త్రాగునీటిని సిద్దం చేసుకొని ఉంచాల‌న్నారు. కొవ్వొత్తులు, పెట్రోమాక్స్ లైట్లు లాంటివాటిని కూడా సిద్దం చేయాల‌న్నారు. చెట్లు కూలిపోయే ప్ర‌మాదం ఉన్నందున అవ‌స‌ర‌మైన రంపాలు, యంత్రాల‌ను సిద్దంగా ఉంచాల‌ని, అగ్నిమాప‌క అధికారులు అన్నివిధాలా సిద్దంగా ఉండాల‌ని సూచించారు. ప్ర‌తీమండ‌లంలో కంట్రోలు రూమును ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు.

  భారీ వ‌ర్షాల‌ను దృష్టిలో పెట్టుకొని ప్ర‌జ‌ల‌ను, రైతుల‌ను అప్ర‌మ‌త్తం చేయాల‌న్నారు. మండ‌ల అధికారుల‌కు సెల‌వులు ర‌ద్దు చేసి, మండ‌ల కేంద్రాల్లో అంద‌రూ అందుబాటులో ఉండేలా చూడాల‌న్నారు. మున్సిపాల్టీల్లో వ‌ర్ష‌పునీరు రోడ్ల‌పై పొర్ల‌కుండా, మురుగు కాలువ‌ల‌ను ముందుగానే ఖాలీచేసి ఉంచాల‌న్నారు. సాగునీటి ప్రాజెక్టుల ద‌గ్గ‌ర త‌గిన జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోవాల‌న్నారు. ఇప్ప‌టికే జిల్లాలోని చెరువులు పూర్తిగా నిండి ఉన్నాయ‌ని, గండ్లు ప‌డే అవ‌కాశం ఉన్నందున‌, ఇసుక బ‌స్తాల‌ను సిద్దం చేసుకొని ఉంచాల‌న్నారు. చెరువుల అవుట్ లెట్లును ప‌రిశీలించి, నీరు పోయేందుకు ఆటంకాల‌ను లేకుండా చూడాల‌న్నారు. తీర‌ప్రాంత మండ‌లాల్లోని మ‌త్స్య‌కారుల‌కు ఇప్ప‌టికే తుఫాను హెచ్చ‌రిక‌ను జారీ చేయ‌డం జ‌రిగింద‌ని, ఆయా మండ‌లాల్లోని అధికారులు మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు. జాతీయ‌, రాష్ట్ర ర‌హ‌దారుల ప్ర‌క్క‌నున్న చెరువులను ప‌రిశీలించి, వాటివ‌ల్ల రోడ్లు కొట్టుకుపోకుండా త‌గిన చ‌ర్య‌ల‌ను చేప‌ట్టాల‌న్నారు. ప్రాధ‌మిక ఆరోగ్య కేంద్రాల్లో అవ‌స‌ర‌మైన అత్య‌వ‌స‌ర మందుల‌ను కూడా సిద్దం చేసి ఉంచాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు.

       జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డాక్ట‌ర్ జిసి కిశోర్ కుమార్ మాట్లాడుతూ, అవ‌స‌ర‌మైతే ధాన్యాన్ని రైస్‌మిల్లుల‌కు తీసుకువెళ్లి భ‌ద్ర‌ప‌రుచుకోవాల‌ని సూచించారు. సివిల్ స‌ప్ల‌యిస్ డిటి ఆధ్వ‌ర్యంలో ఈ ప్ర‌క్రియ నిర్వ‌హించాల‌ని, త‌ర‌లించిన ధాన్యానికి రైతు పేరు, ర‌కం త‌దిత‌ర‌ పూర్తి వివ‌రాల‌తో ట్యాగ్ త‌గిలించాల‌ని సూచించారు. ప‌ట్ట‌ణాల్లోని భారీ హోర్డింగులు ఈదురుగాల‌ల కార‌ణంగా నేల‌కూలే ప్ర‌మాదం ఉంద‌ని, వాటిని అధికారులు ప‌రిశీలించాల‌ని సూచించారు. గ్రామాల్లో కోత‌కొచ్చిన వ‌రిపంట‌ను క్ల‌ష్ట‌ర్లుగా విడ‌దీసి, వాటి సంర‌క్ష‌ణా బాధ్య‌త‌ల‌ను వ‌లంటీర్లు, వ్య‌వ‌సాయ‌శాఖ సిబ్బందికి అప్ప‌గించాల‌న్నారు. వారి సూచ‌న‌ల‌కు అనుగుణంగా పంట సంర‌క్ష‌ణా చ‌ర్య‌ల‌ను తీసుకోవాల‌ని సూచించారు. ప‌శు న‌ష్టం జ‌ర‌గ‌కుండా త‌గిన సంర‌క్ష‌ణా చ‌ర్య‌ల‌ను తీసుకోవాల‌ని, ప‌శువుల‌ను ఈ నాలుగు రోజులూ బ‌య‌ట‌కు విడిచిపెట్ట‌కుండా క‌ట్టిఉంచి, ఆహారాన్ని అందించాల‌ని జెసి సూచించారు. ఈ వీడియో కాన్ఫ‌రెన్స్‌లో డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, జిల్లా విప‌త్తుల నివార‌ణాధికారి బి.ప‌ద్మావ‌తి, జెడ్‌పి సిఇఓ టి.వెంక‌టేశ్వ‌ర్రావు, డిపిఓ సుభాషిణి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Be alert for storm surges, chance of heavy rains from 3am, farmers' hardship should not be wasted, all precautionary measures should be taken, Collector Suryakumari in video conference