Close

Be vigilant with digital transactions, bill mandatory for every item purchased, District Collector A. Surya Kumari on World Consumer Rights Day

Publish Date : 25/03/2022

డిజిటల్ లావాదేవీల తో అప్రమత్తంగా ఉండాలి

కొనే ప్రతి వస్తువుకు బిల్లు తప్పనిసరి

ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంలో జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి

విజయనగరం, మార్చి 15 : ఆన్లైన్ మార్కెటింగ్ అందుబాటులోకి వచ్చిన ప్రస్తుత పరిస్థితుల్లో డిజిటల్ లావాదేవీలే ఎక్కువగా జరుపుతున్నారని, అయితే దీని పై పూర్తిగా అవగాహన లేకుంటే మోసపోవడం కూడా తేలికగా జరుగుతోందని జిల్లా కలెక్టర్ ఎ.సూర్య కుమారి తెలిపారు. వ్యక్తిగత సమాచారాన్ని ఆన్లైన్ లో ఇవ్వవలసి వచ్చినపుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. మొబైల్స్ కు, మెయిల్స్ కు ఉద్యోగాల కోసం, ఉచిత బహుమతుల కోసం అనేక ఫేక్ మెసేజ్ లు వస్తుంటాయని అత్యాశకు పోతే ముప్పు తప్పదని గ్రహించాలని హితవు పలికారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంలో భాగంగా మహిళా ప్రాంగణం లో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యం లో అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా హాజరైన జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి మాట్లాడుతూ ఏ వస్తువు కొన్నా బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలని లేని యెడల తదుపరి ఫిర్యాదు చేసే అవకాశమే ఉండదని తెలిపారు. ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు బ్రాండెడ్ కంపెనీ వస్తువులనే కొనాలని, ఆ వెబ్సైటు లో కొనుగోలు చేసిన వారి వ్యూస్ ఉంటాయని, తద్వారా మంచి రేటింగ్ ఉన్నవాటిని కొనుగోలు చేయవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరికీ వినియోగదారుల రక్షణ చట్టం లోని అంశాల పై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. వినియోగదారుడు ఏ వస్తువు కొన్నా, ఏ సేవ పొందినా అది వినియోగదారునికి ఉపయోగ పడాలే కానీ హాని కలిగించరాదని , వాటి వలన పూర్తి భద్రత ఉండాలని పేర్కొన్నారు. అలా పొందని పరిస్థితి లో చట్టం ప్రకారంగా . వినియోగదారునికి నష్ట పరిహారం పొందే హక్కు ఉందని తెలిపారు.

సంయుక్త కలెక్టర్ డా. జి.సి.కిషోర్ కుమార్ మాట్లాడుతూ తల్లి గర్భం లో పడిన దగ్గర నుండి మరణం పొందే వరకు ప్రతి ఒక్కరు వినియోగదారులేనని, వినియోగ దారునిగా విజయాలు ఎలా ఉంటాయో అపజయాలు కూడా అదే విధంగా ఉంటాయని అన్నారు. నాణ్యతా లోపాలు ఉన్నవాటిని గుర్తించగలిగితే నష్టాల బారిన పడకుండా ఉండవచ్చని తెలిపారు. డిజిటల్ విధానం లో లావాదేవీలు చేసేటప్పుడు ఓ.టి.పి లు, సివివి లు, పాస్ వర్డ్ లు ఎవరికీ బడితే వారికీ చెప్పకూడదని అన్నారు. ఈ విధానం లో అనేక మోసాలు జరుగుతున్నాయని, అయతే ఎవరికీ ఫిర్యాదు చెయ్యాలో తెలియని పరిస్థితి ఉందని అన్నారు. ఎవరికీ వారే ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని, అనధికారిక కంపెనీ ల నుండి, వ్యక్తుల నుండి వస్తువులను కొనేటప్పుడు ఒకటికి పది సార్లు అలోచించి స్పష్టత తీసుకోవాలని అన్నారు.

వినియోగదారుల ఫోరం అధ్యక్షులు నాగ సుందరం మాట్లాడుతూ వినియోగదారుల వివాదాలను పరిష్కరించడానికి జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలలో మూడంచెల పద్ధతి లో మూడు కమిషన్లు ఉన్నాయని పేర్కొన్నారు. రూ. 12.50 లక్షల విలువైన వివాదాలను జిల్లా స్థాయిలో, 2 కోట్ల విలువైన వివాదాలను రాష్ట్ర స్థాయి లో, ఆ పై విలువ కలిగిన వివాదాలను జాతీయ స్థాయి లో పరిష్కరిచబడతాయని వివరించారు. ఉత్పత్తి చేసిన వస్తువుల పట్ల బాధ్యత లేని సంస్థల పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని , ఈ-కామర్స్ , ఆన్లైన్ అమ్మకాలు, కొనుగోళ్ళ లో జరుగుతున్న మోసాలు అరికట్టబడతాయని అన్నారు. అదే విధంగా నకిలీ వస్తువుల విక్రయం పై జరిమానా విధించడం జరుగుతుందని , ఫిర్యాదులు వినియోగదారుల కోర్ట్ లందు సమీక్షించి తగిన తీర్పులు చెప్పబడతాయని తెలిపారు. అంతే కాకుండా అన్యాయమైన వాణిజ్య పద్ధతులను, తప్పుదోవ పట్టించే ప్రకటనలను అరికట్టడం జరుగుతుందని తెలిపారు. వినియోగదారులకు సమస్య ఎదురైతే ఎలా పరిష్కరించుకోవాలి, ఎవరిని కలవాలి, దీని కోసం పని చేసే సంస్థలు ఏంటి అనే విషయాల పై అవగాహన కలిగించడానికి విద్యా సంస్థల్లో కూడా కన్స్యూమర్ క్లబ్ లను ఏర్పాటు చేసి వాటి ద్వారా ఈ చట్టం పని తీరు , చట్టం లోని అంశాల పై అవగాహన కలిగించడం జరుగుతోందని అన్నారు.

ఈ సదస్సు లో లీగల్ మెట్రాలజి డిప్యూటీ కంట్రోలర్ మాట్లాడుతూ ఎం.ఆర్.పి కన్నా ఎక్కువ ధరలకు అమ్మిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. బిల్లుల పై స్పష్టంగా వస్తువుల వివరాలు ఉండేలా వినియోగదారులు చూసుకోవాలన్నారు. మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు శ్యాం కుమార్ , ఆహార నియంత్రణాదికారి , ఔషధ నియంత్రనాధికారి తదితరులు వినియోగ దారుల హక్కుల పై అవగాహన కలిగించారు. ఈ సమావేశం లో ఫోరం సభ్యులు అశోక్ శర్మ, శ్రీదేవి, చదలవాడ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. జిల్లా పౌర సరఫరాల అధికారి పాపా రావు సభాద్యక్షత వహించారు. జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ దేవుల నాయక్, మెప్మ పి.డి సుధాకర్ రావు, మహిళా సంఘాల ప్రతినిధులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లీగల్ మెట్రోలజి , వైద్య ఆరోగ్య శాఖ, ఆహార భద్రతా సంస్థల ఆధ్వర్యం లో పలు స్టాల్స్ ను ఏర్పాటు చేసో అవగాహన కలిగించారు.

Be vigilant with digital transactions, bill mandatory for every item purchased, District Collector A. Surya Kumari on World Consumer Rights Day