Child marriage should be eradicated District Collector A. Suryakumari Girls should also study well ZP Chairman Majji Srinivasa Rao
Publish Date : 17/10/2022
బాల్య వివాహాలను నిర్మూలించాలి
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
ఆడపిల్లలు కూడా బాగా చదువుకోవాలి
జెడ్‌పి ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
విజయనగరం, అక్టోబరు 16 ః
బాల్య వివాహాలను నిర్మూలించాలని, జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి, జెడ్‌పి ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా మహారాజా కోట నుంచి ఆర్‌టిసి కాంప్లెక్స్ వరకు ఆదివారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నోబుల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్ధి సూచనలకు అనుగుణంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది.
ర్యాలీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి మాట్లాడుతూ, బాల్య వివాహాలను నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపైనా ఉందన్నారు. ఆడపిల్లలు కూడా కనీసం డిగ్రీవరకైనా చదవాలని కోరారు. జిల్లాలో ఉన్నత పదవులు, అధికార హోదాల్లో ఎంతోమంది మహిళలు ఉన్నారని, వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. బాలికలు కూడా ఒక లక్ష్యాన్ని సాధించడం ద్వారా, తమ ప్రతిభను నిరూపించుకోవాలన్నారు. జిల్లాలో ఒక్క బాల్య వివాహం కూడా జరగని రోజు రావాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
జెడ్‌పి ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, బాలికలకు కూడా చదువు ఎంతో అవసరమన్నారు. బాల్య వివాహాలవల్ల బాలికల ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని చెప్పారు. వారు బాగా చదువుకొని, తమ కాళ్లపై తాము నిలబడిన తరువాతే వివాహం చేసుకోవాలని సూచించారు. మన సమాజంలో ఇప్పటికీ పలు చోట్ల బాల్య వివాహాలు చోటుచేసుకుంటున్నాయని, వీటిని అరికట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. తమ దృష్టికి వచ్చే వివాహాలను అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మైదాన ప్రాంతాలకంటే, గిరిజన ప్రాంతాల్లో బాల్య వివాహాలు ఎక్కువని, అక్కడ కూడా వీటిని అరికట్టేందుకు తగిన చర్యలు చేపట్టాలని కోరారు.
జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి బిహెచ్‌వి లక్ష్మీకుమారి మాట్లాడుతూ, బాల్య వివాహం చేసినవారే కాకుండా, అలాంటి వివాహానికి హాజరైన వారు, జరిపించే పురోహితులు కూడా నేరస్తులుగా పరిగణింపబడతారని చెప్పారు. వీరికి రెండేళ్లవరకు జైలు శిక్ష, లక్షరూపాయలు వరకు జరిమానా విధించే అవకాశం ఉందని అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ద్వారా అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు.
కార్యక్రమంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్మన్ కేసలి అప్పారావు, విజయనగరం మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యుటీ మేయర్ కోలగట్ల శ్రావణి, కమిషన్ జిల్లా ఛైర్‌పర్సన్ జి.హిమబిందు, ఐసిడిఎస్ పిడి బి.శాంతకుమారి, ఐసిడిఎస్ సిబ్బంది, వివిధ శాఖలు, సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.