Cleanliness keeps diseases away – Always wash hands cleanly – Girl students should study well and reach high level – District Collector A. Suryakumari.
Publish Date : 17/10/2022
పరిశుభ్రతతో రోగాలు దూరం
– ఎల్లప్పుడూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి
– విద్యార్థినిలు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలి
– జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి.
జామి, (విజయనగరం), అక్టోబర్ 15 :
సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవడం ద్వారా, రోగాలను కడిగేయచ్చని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి అన్నారు. జామి మండలం కుమరాం లోని కెజిబివిలో, శనివారం గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థినిలు ముందు తమ ఆరోగ్యంపై శ్రద్ద చూపాలని కోరారు. ఇందుకోసం చేతులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని ఆమె సూచించారు. సబ్బుతో చేతులు కడుకున్నప్పుడు 7 రకాల సూత్రాలను పాటించాలని చెప్పారు. చేతులు కడిగే సమయంలో చేతి గోళ్ళు సందుల్లో ఎలాంటి మురికి లేకుండా ఉండేలా శుభ్రపరచుకోవాలని వివరించారు. ఇలా చేయడం వలన అంటురోగాలను దరిచేయకుండా జాగ్రత్తలు తిసుకోవచ్చునన్నారు. ఆహారం తీసుకునే సమయంలో చేతులు శుభ్రంగా కడుక్కొని, ఆహారాన్ని తీసుకోవాలని తెలిపారు. అలాగే చేతులను శుభ్రంగా ఉంచేందుకు తరచూ కడుక్కోవాలని సూచించారు. ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి, విద్యార్థినులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా వేడి నీళ్ళు తాగుతూ ఉండాలని తెలిపారు.
చదువులో విద్యార్ధినుల సామర్ధ్యాన్ని పరిశీలిచారు. వారితో మాట్లాడుతూ బాగా చదువుకుని భవిష్యత్ లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు. 10వ తరగతి విద్యార్థినిలు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న వైద్యులచేత, విద్యార్ధినిలకు హిమోగ్లోబిన్ కౌంట్ పరీక్షలు చేయించిన రిపోర్ట్ ను కలెక్టర్ పరిశీలించారు. అలాగే హెచ్.బి. కౌంట్ కు సంబందించిన రికార్డ్స్ పరిశీలిచారు. విద్యార్ధినిలకు ఎప్పటికప్పుడు ఆరోగ్య తనిఖీలు చేపట్టాలని వైద్యులను కలెక్టర్ ఆదేశించారు.
సమగ్రశిక్ష పథక అధికారి డా. వేమలి స్వామినాయుడు మాట్లాడుతూ, విద్యార్ధినులకు ఉన్నత భవిష్యత్ అందించే దిశగా, సమగ్రశిక్ష అన్ని అవకాశాలు కల్పిస్తుందని అన్నారు. విద్యార్ధినులకు ఆరోగ్య పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా, కెజిబివిలలో పని చేస్తున్న ఎఎన్ఎం దృష్టి సారించాలని ఆదేశించారు. విద్యార్ధినులు నిత్యం తమ చేతులు శుభ్రం చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జె. జయశ్రీ, కెజిబివి ప్రిన్సిపాల్ బి. జ్యోతి, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.