Collector A. Suryakumari called upon aspiring entrepreneurs to come forward to set up industries in the district.
Publish Date : 29/09/2022
పరిశ్రలమ స్థాపనకు ముందుకు రండి
మరిన్ని పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేస్తాం
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
విజయనగరం, సెప్టెంబరు 27 ః ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు జిల్లాలో పరిశ్రమలను స్థాపించడానికి ముందుకు రావాలని, కలెక్టర్ ఎ.సూర్యకుమారి పిలుపునిచ్చారు. జిల్లా యంత్రాంగం తరపున సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, రైతు సంఘాలకు, విద్యార్థులకు కలెక్టరేట్ ఆడిటోరియంలో పరిశ్రమల స్థాపనపై మంగళవారం అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు.
కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ, జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని వినియోగించుకొని పరిశ్రమలను స్థాపించాలని కోరారు. ముఖ్యంగా వ్యవసాయాధారిత పరిశ్రమల స్థాపనకు జిల్లా ఎంతో అనుకూలమని అన్నారు. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే రైతు సంఘాలకు సహకారాన్ని అందించేందుకు ప్రత్యేకంగా ఒక వ్యవసాయ సహాయ సంచాలకుడిని కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. క్లష్టర్ రూపంలో ఒకే ప్రాంతంలో పరిశ్రమలను స్థాపిస్తే, మౌలిక సదుపాయాల కల్పన సులువవుతుందని అన్నారు. ఎపిఐఐసి ద్వారా జిల్లాలో మరిన్ని పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కొత్తవలస, ఎల్‌కోట, పూసపాటిరేగ ప్రాంతాల్లో పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. బొబ్బిలి పారిశ్రామిక వాడలో 200 ఎకరాలు సిద్దంగా ఉన్నాయని, కావాల్సిన వారికి కేటాయిస్తామని చెప్పారు. విద్యార్థులు తమ చదువు అయిపోయిన తరువాత, ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా, స్వయం ఉపాది యూనిట్ల స్థాపనపై దృష్టి పెట్టాలని కోరారు. పరిశ్రమలను స్థాపించాలనుకొనేవారు, సవివరంగా ప్రాజెక్టు రిపోర్టుతో ముందుకు రావాలని కలెక్టర్ సూచించారు.
ఎంఎస్ఎంఈ ఎడి జి.రఘురామ్ మాట్లాడుతూ, పరిశ్రమలు, సేవా సంస్థల స్థాపనకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాకాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తెలిపారు. సూక్ష, చిన్న, మధ్య తరహా పరిశ్రమల విభాగాలు, ఉద్యమ్ రిజిష్ట్రేషన్, పిఎంఇజిపి, ముద్రా, స్టాండప్ ఇండియా, స్కిల్ డెవలప్‌మెంట్, ట్రైనింగ్, ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్, ఇన్‌ఫ్రాస్టక్చర్ సప్పోర్ట్ స్కీమ్, క్లష్టర్ డెవలప్‌మెంట్, టెక్నాలజీ అప్‌గ్రేడేషన్, జెడ్ఈడి సర్టిఫికేట్, ఇన్‌క్యుబేట్స్, ఐపిఆర్, పిఎంఎస్ తదితర అంశాలను, ప్రభుత్వ రాయితీలను వివరించారు. ఎపిఎస్ఎఫ్‌సి బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, పరిశ్రమలను స్థాపించడమే లక్ష్యంగా తమ సంస్థ చేస్తున్న కృషిని వివరించారు. పరిశ్రమలను స్థాపించడానికి ముందుకు వస్తే, అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తామని చెప్పారు.
పరిశ్రమలశాఖ జిల్లా మేనేజర్ పాపారావు మాట్లాడుతూ, జిల్లాలో పరిశ్రమలను స్థాపించేందుకు కలెక్టర్ చూపిస్తున్న చొరవను వివరించారు. ఈ అవకాశాన్ని ప్రతీఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎపిఐడిసి డైరెక్టర్ ఎస్.బంగారునాయుడు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షులు కాపుగంటి ప్రకాష్, ఎపి ఛాంబర్ పూర్వ అధ్యక్షులు జి.సాంబశివరావు, ట్రైనీ డిప్యుటీ కలెక్టర్ శ్రీకర్, ప్రకాష్‌బాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.