Collector A. Suryakumari directed the district authorities to submit the reports pertaining to Vijayanagaram and Parvathipuram Central districts zone-wise within the stipulated time in order to achieve the targets set by the state government.
Publish Date : 01/04/2022
నూతన లక్ష్యాలను నిర్దేశించుకొని పని చేయండి
*ఇప్పటి వరకు అయిన పనుల నివేదికలను అప్లోడ్ చేయండి
*పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రన్సిపల్ సెక్రటరీ జీకే ద్వివేదీ
విజయనగరం, మార్చి 31 ః ఈ ఆర్థిక సంవత్సరంలో నూతన లక్ష్యాలను నిర్దేశించుకొని ఆశాజనక ఫలితాలు సాధించాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేదీ పేర్కొన్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటవుతున్న నేపథ్యంలో తాజా వివరాలతో కూడిన ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. చెత్త నిర్వహణ కేంద్రాలు, శానిటరీ కాంప్లెక్సులు, జలజీవన్ మిషన్, తాగునీటి వసతుల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై డిప్యూటీ కమిషనర్ కోన శశిధర్ తో కలిసి ఆయన వివిధ జిల్లాల కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రణాళికాయుతంగా వ్యవహరించి నిర్దేశిత లక్ష్యాలను చేరుకొని ఆశాజనక ఫలితాలు సాధించాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, జగనన్న స్వచ్ఛ సంకల్పం లక్ష్యాలను చేరుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ముందుకెళ్లాలని చెప్పారు. ఇంటి పన్నుల వసూళ్లలో వేగం పెంచాలని, నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేందుకు అందరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. చెత్త నిర్వహణ షెడ్ల నిర్మాణాల పనులను వేగవంతం చేయాలన్నారు. విద్యుత్ కనెక్షన్లు, అప్రోచ్ రోడ్లు, నీటి సౌకర్యం తదితర మౌలిక వసతులను కల్పించాలని సూచించారు. కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టాలన్నారు. శానిటరీ కాంప్లెక్సుల నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలని త్వరితగతిన పనులు పూర్తయ్యేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్లను ఆదేశించారు.
మండలాల వారీగా నివేదికలను అందించండి
రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేందుకు అనుగుణంగా విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించిన నివేదికలను మండలాల వారీగా నిర్ణీత కాలంలో అందించాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఎ. సూర్యకుమారి ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ డ్వమా పీడీ ఉమా పరమేరశ్వరి, డీపీవో సుభాషిణి, పంచాయతీ రాజ్ ఎస్.ఈ. గుప్తా, ఆర్.డబ్ల్యూ.ఎస్. ఎస్.ఈ. శివానంద కుమార్, డ్వామా ఏపీడీ లక్ష్మణ్ లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా సాధ్యమైనంత ఎక్కువ మందికి పనులు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు. శానిటరీ కాంప్లెక్సుల నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, పనులు ప్రారంభించాలని సూచించారు. ఇంకా ప్రారంభం కాని ఎస్.డబ్ల్యూ.పి.సి. కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీల నిర్మాణాలకు అవసరమైన ప్రణాళికలతో రావాలని అధికారులను ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి డ్వామా పీడీ ఉమా పరమేశ్వరి, డీపీవో సుభాసిణి, పంచాయతీ రాజ్ ఎస్.ఈ. గుప్తా, ఆర్.డబ్ల్యూ.ఎస్. ఎస్.ఈ. శివానందరావు, డ్వామా ఏపీడీ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.