Collector tornado tours to Denkada and Poosapatirega zones
Publish Date : 02/02/2022
*డెంకాడ, పూసపాటిరేగ మండలాల్లో కలెక్టర్ సుడిగాలి పర్యటన*
*సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల ఆకస్మిక తనిఖీ
*పూర్తైన సచివాలయ భవనాలను ప్రారంభించాలని పీఆర్ అధికారులకు ఆదేశాలు
విజయనగరం, ఫిబ్రవరి 01 ః జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి డెంకాడ, పూసపాటిరేగ మండలాల్లో మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. సచివాలయాలను, రైతు భరోసా కేంద్రాలను, వెల్‌నెస్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా డెంకాడ మండలం పెదతాడివాడ, గునుపూరుపేట సచివాలయాలను, రైతు భరోసా కేంద్రాలను తనిఖీ చేసి అక్కడ అందుతున్న సేవలపై ఆరా తీశారు. స్థానికంగా నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న సచివాలయ, రైతు భరోసా కేంద్ర సొంత భవనాలను త్వరితగతిన ప్రారంభించి అందుబాటులోకి తీసుకురావాలని పంచాయితీ రాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. దీనిలో భాగంగా స్థానికంగా జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఇప్పటి వరకు ఎంతమందికి మొదటి, రెండో డోసులు వేశారో వైద్యారోగ్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బూస్టర్ డోస్ ప్రక్రియను సజావుగా వేగంగా నిర్వహించాలని సూచించారు.
పెదతాడివాడలో వేసిన జగనన్న కాలనీ లేఅవుట్ లో ఇళ్ల నిర్మాణాల ప్రక్రియను పరిశీలించారు. ఇక్కడ మందకొడిగా సాగుతున్న ఇళ్ల నిర్మాణాలపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జియో ట్యాగింగ్ వల్లే ఆలస్యమవుతున్నాయని తెలపగా.. త్వరితగతిన ప్రక్రియను పూర్తి చేసి ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే గునుపూరుపేటలో విద్యార్థుల రక్త నమూనాల్లో హెచ్.బి. శాతం తక్కువగా ఉండటంతో కలెక్టర్ సందేహం వ్యక్తం చేశారు. చాలా మందికి 8 -9 శాతమే ఉండటంతో ఒకసారి సంబంధిత రిపోర్టును డీఎం &హెచ్‌వోకి పంపించి సరి చూసుకోవాలని స్థానిక వైద్య సిబ్బందికి సూచించారు. ఏమైనా సమస్య ఉంటే త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అనంతరం కలెక్టర్ సూర్యకుమారి పూసపాటిరేగ మండలం కులిమి పంచాయతీని సందర్శించారు. అక్కడ నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న సచివాలయ భవనాన్ని, రైతు భరోసా కేంద్ర భవనాన్ని పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యేలను సంప్రదించి త్వరితగతిన భవనాలను ప్రారంభించి అందుబాటులోకి తీసుకురావాలని పంచాయితీ రాజ్ శాఖ అధికారులను ఆదేశించారు.
పర్యటనలో ఆమె వెంట పంచాయతీ రాజ్ శాఖ ఎస్.ఈ. గుప్తా, ఈఈ శ్రీనివాసరావు, డీఈ బంగారునాయుడు, డెంకాడ ఎంపీడీవో స్వరూపరాణి, తహశీల్దార్ ఆదిలక్ష్మి, వ్యవసాయ శాఖ అధికారి నిర్మల, సచివాలయ సిబ్బంది, పూసపాటిరేగ ఎంపీపీ, సర్పంచ్, స్థానిక సచివాలయ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.