Construction of houses should be started immediately, District Collector A. Suryakumari
Publish Date : 25/03/2022
ఇళ్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలి
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
కొండకరకాంలో పర్యటించిన కలెక్టర్
విజయనగరం, మార్చి 22 ః గృహనిర్మాణ లబ్దిదారులందరూ వెంటనే ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ఆదేశించారు. విజయనగరం మండలం కొండకరకాం రూరల్, అర్బన్ లేఅవుట్లను ఆమె మంగళవారం పరిశీలించారు. అర్బన్ లేఅవుట్లో సుమారు 2,887 ఇళ్లకుగాను, స్వల్ప సంఖ్యలో ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించడం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిర్మాణానికి అవసరమైన నీరు, విద్యుత్ తదితర మౌలిక వసతులను కల్పించి, వెంటనే ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వార్డుల వారీగా అవగాహనా సదస్సులను నిర్వహించి, లబ్దిదారులను చైతన్యపరచాలని చెప్పారు. ఈ లేఅవుట్లో మూడు బ్లాకులకు, ముగ్గురు వార్డు ఎమినిటీస్ సెక్రటరీలను ఇన్ఛార్జులుగా నియమించి, లబ్దిదారులకు అన్ని విధాలా సహకారం అందించేలా చూడాలని ఆదేశించారు. ఇసుక, సిమ్మెంటు తదితర సామగ్రిని లేఅవుట్లోనే సరఫరా చేయాలని సూచించారు. కొండకరకాం గ్రామస్తులకు ఇచ్చిన రూరల్ లేఅవుట్లో నిర్మాణాలపట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ లేఅవుట్లో మిగిలిపోయిన ఇళ్లను కూడా మొదలు పెట్టేలా చూడాలని ఆదేశించారు.
ఓటిఎస్ కు ఉగాది వరకే గడువు
జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం (ఓటిఎస్) అమలుకు ఉగాదివరకే గడువు ఉందని, ఈ పథకం అమలును మరింత వేగవంతం చేయాలని సచివాలయ సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. కొండకరకాం గ్రామ సచివాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా రిజిష్టర్లను, వివిధ పథకాల అమలును పరిశీలించారు. ఓటిఎస్ పథకానికి ఇంకా ఎక్కువ సమయం లేనందున, అర్హులంతా దీనిని వెంటనే వినియోగించుకొనేలా చూడాలని సూచించారు. ఓటిఎస్ వినియోగించుకున్నవారి ఇళ్ల స్థలాలను 22ఏ జాబితానుంచి తొలగించాలని ఆదేశించారు. అవసరమైనవారికి బ్యాంకులనుంచి రుణాలు ఇప్పించాలన్నారు. చెత్తనుంచి సంపద కేంద్రం పనితీరు, గ్రామీణ ఉపాధిహామీ పథకం అమలు, మహిళలకు, పిల్లలకు రక్త పరీక్షలు, వేక్సినేషన్, 12-14 ఏళ్ల మధ్యవారికి కోవిడ్ వేక్సినేషన్, రీసర్వే, ఈ క్రాప్ నమోదు తదితర అంశాలపై ఆరా తీశారు. గ్రామీణ ఉపాధిహామీ పథకం క్రింద అవసరమైనచోట యుద్దప్రాతిపదికన గ్రావెల్ రోడ్లు వేయాలని, వెంటవెంటనే బిల్లులు పెట్టాలని సిబ్బందిని ఆదేశించారు.
ఈ పర్యటనలో కలెక్టర్ వెంట తాశీల్దార్ కోటేశ్వర్రావు, ఎంపిడిఓ సత్యనారాయణ, హౌసింగ్ డిఇ సోమేశ్వర్రావు, ఏఈ రాంప్రసాద్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
