Close

Construction work should be completed within the stipulated time, District Collector Mrs. Suryakumari orders

Publish Date : 02/05/2022

నిర్దేశిత స‌మ‌యంలో నిర్మాణ‌ ప‌నులు పూర్తికావాలి
ఇంజ‌నీరింగ్ స‌హాయ‌కుల‌దే ప‌నుల బాధ్య‌త‌
వేస‌విలో ప‌నుల‌కు అనుకూల స‌మ‌యం
దీనిని స‌ద్వినియోగం చేసుకోవాలి
జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి సూర్య‌కుమారి ఆదేశాలు
ఇంజ‌నీరింగ్ స‌హాయ‌కుల‌తో ఆన్ లైన్ స‌మావేశం
విజ‌య‌న‌గ‌రం, ఏప్రిల్ 30 :
గ్రామాల్లో నిర్మాణ ప‌నులు చేప‌ట్టేందుకు వేస‌విలో వ‌చ్చే రెండు నెల‌లు ఎంతో అనుకూల స‌మ‌యమ‌ని, దీనిని స‌ద్వినియోగం చేసుకొని, నిర్మాణ ప‌నులు వేగ‌వంతం చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్య‌కుమారి ఇంజ‌నీరింగ్ అధికారులు, స‌హాయ‌కుల‌ను ఆదేశించారు. గ్రామాల్లో జ‌రిగే ప్ర‌భుత్వ‌ ఇంజ‌నీరింగ్ ప‌నుల‌కు స‌చివాల‌యాల్లోని ఇంజ‌నీరింగ్ స‌హాయ‌కులే బాధ్య‌త వ‌హించాల్సి వుంటుంద‌న్నారు. ఏ ప‌ని మంజూరైనా దానిని ప్రారంభించి పూర్తిచేసే వ‌ర‌కూ ఇంజ‌నీరింగ్ స‌హాయ‌కులు పూర్తిస్థాయిలో ప‌ర్య‌వేక్ష‌ణ చేయాల్సి వుంటుంద‌న్నారు. ముఖ్యంగా జిల్లాలో ఉపాధిహామీ క‌న్వ‌ర్జెన్స్ నిధుల‌తో ఆయా గ్రామాల్లో చేప‌ట్టిన స‌చివాల‌య భ‌వ‌నాలు, రైతుభ‌రోసా కేంద్రాలు, వెల్ నెస్ కేంద్రాలు వంటి భ‌వ‌నాలు ఏద‌శ‌లో వున్నాయో ఎప్ప‌టిక‌ప్పుడు పంచాయ‌తీరాజ్ ఇంజ‌నీరింగ్ అధికారులు, జిల్లా అధికారుల‌కు నివేదిస్తుండాల‌ని క‌లెక్ట‌ర్ స్ప‌ష్టంచేశారు. జిల్లాలోని ఇంజ‌నీరింగ్ స‌హాయ‌కుల‌తో క‌లెక్ట‌ర్ శ‌నివారం ఆన్ లైన్ స‌మావేశంలో మాట్లాడారు. ప్ర‌తి శుక్ర‌, శ‌నివారాల్లో ఆయా ప‌నుల ఫోటోల‌ను తీసి ఆన్ లైన్ ద్వారా అప్‌డేట్ చేయాల‌న్నారు. గ్రామాల్లో ప‌నుల‌పై ఇంజ‌నీరింగ్ స‌హాయ‌కుల‌నే ప్ర‌శ్నిస్తామ‌ని స్ప‌ష్టంచేశారు. ఎక్క‌డైనా ప‌నులు మంజూరై ప్రారంభించ‌న‌ట్ల‌యితే గ్రామ సర్పంచ్‌, ఎంపిటిసిల దృష్టికి తీసుకువెళ్లి వాటి నిర్మాణం ప్రారంభించేలా చొర‌వ చూపాల‌న్నారు. తుది ద‌శ‌లో చేరుకున్న ప‌నుల‌ను ప్రారంభించి వినియోగంలోకి తేవాల‌న్నారు.
గ్రామాల్లో ల‌బ్దిదారుల‌కు మంజూరైన ఇళ్ల నిర్మాణం కూడా వేగవంతం చేసేలా చొర‌వ చూపాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. ఇళ్లు మంజూరైన లబ్దిదారులు మే నెలాఖ‌రులోగా వాటిని ప్రారంభించి క‌నీసం ఒక విడ‌త చెల్లింపులైనా పూర్తిచేసేలా వుండాల‌న్నారు. పంచాయ‌తీరాజ్ ఇంజ‌నీరింగ్ విభాగం ఎస్‌.ఇ. గుప్తా త‌దిత‌రులు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు.
Construction work should be completed within the stipulated time, District Collector Mrs. Suryakumari orders