Coordinated Coastal Security Measures, Fishermen Identity Cards, District Collector Smt. A. Suryakumari
Publish Date : 08/10/2021
సమన్వయంతో తీరప్రాంత భద్రతకు చర్యలు
మత్స్యకారులకు గుర్తింపు కార్డులు
జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి
విజయనగరం, సెప్టెంబరు 30; తీరప్రాంత భద్రతకు సంబంధించి ఇందులో భాగస్వామ్యం కలిగిన అన్ని పక్షాల మధ్య సమన్వయం అవసరమని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో తీరప్రాంత భద్రతపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన గురువారం జరిగింది. ముఖ్యంగా తీరప్రాంత భద్రత విషయంలో మత్స్యకారులతో సమన్వయం అవసరమని పేర్కొన్నారు. తీరప్రాంతంలో అనుమానితులు, కొత్త వ్యక్తుల సమాచారం తెలుసుకోవడం వంటి అంశాల్లో మత్స్యకారుల సహకారం తీసుకోవలసి వుందన్నారు. భద్రతా సంస్థలు తీరప్రాంతంలో నివసించే మత్స్యకారులకు హైసెక్యూరిటీ గుర్తింపుకార్డులు జారీచేయడం ద్వారా కొత్త వ్యక్తుల సమాచారం తెలుసుకోవచ్చన్నారు. మత్స్యకారులకు వి.హెచ్.ఎఫ్. పరికరాలు అందజేసి తద్వారా సముద్రం నుంచి తీరప్రాంతానికి బోట్లలో వచ్చే వారి సమాచారం తెలుసుకోవడం, సముద్రంలో జరిగే ప్రమాదాలు, ఇతర సంఘటనల గురించిన సమాచారం తెలుసుకొనే వీలుంటుందని పేర్కొన్నారు. పూసపాటిరేగ మండలం చింతపల్లిలోని మెరైన్ పోలీసు స్టేషన్‌కు ప్రహారీగోడ నిర్మాణం, ఇతర వసతుల కల్పనపై చర్చించారు. మత్స్యకారులు వి.హెచ్.ఎఫ్. సెట్ల ద్వారా ప్రమాదాలు, ఇతర సమాచారాన్ని తీరరక్షణ దళం(కోస్ట్ గార్డ్)కు తెలియజేయవచ్చని ఆ సంస్థ ప్రతినిధి వివరించారు. ప్రతి నెలా ఒక నిర్ణీత తేదీన తీరప్రాంత భద్రతకు సంబంధించిన సమావేశాలు జరిగేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.జి.సి. కిషోర్ కుమార్, తీరరక్షణ విభాగం అడిషనల్ ఎస్పీ విమలకుమారి, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతిరావు, డి.ఎస్.పి. అనిల్ కుమార్, మత్స్యశాఖ డి.డి. నిర్మలాకుమారి, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
——————————————————————————————————————
జారీ సహాయ సంచాలకులు, సమాచార పౌరసంబంధాల శాఖ, విజయనగరం