Close

Create a friendly work environment, work with respect for employees who work with commitment, District Collector A. Surya Kumari

Publish Date : 09/12/2021

పని చేసేచోట స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించుకోవాలి

                నిబద్ధత తో పని చేసే ఉద్యోగులకు గౌరవం లభిస్తుంది

 జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి

విజయనగరం,  డిసెంబర్  09:  మహిళలు పనిచేసే చోట స్నేహపూర్వకమైన వాతావరణాన్ని కల్పించుకోవాలని అప్పుడే ప్రశాంతంగా ఉద్యోగం చేయగలుగుతారని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి తెలిపారు.  మహిళా ఉద్యోగులు సమష్టి గా ఉంటే వారిలో  బలం చేకూరుతుందని,  ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలరని అన్నారు. మహిళల పై లైంగిక వేధింపులను నిరోధించే చట్టం పై గురువారం కలక్టరేట్ ఆడిటోరియం లో   జరిగిన జిల్లా స్థాయి సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిధిగా హాజరైనారు.  ఈ  సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ  మహిళలు బలహీనంగా ఉండకూడదని, వారిలోని ఆత్మస్థైర్యమే వారిని ముందుకు నడిపిస్తుందని హితవు పలికారు.  పనిచేసే చోట గుర్తింపు రావాలంటే నిబద్ధత తో పనిచేయాలని,  పురుషులతో సమాన  వేతనాన్ని పొందుతునపుడు సమాన   పని తీరును కనపరచాలని  అన్నారు.  మహిళలు కూడా  వారి వ్యవహార  శైలి లో, కట్టు, బొట్టు లో హుందాగా ఉండాలని,  అనవసర  టైం పాస్ కబుర్లకు అవకాశం కల్పించకూడదని అన్నారు.  వృత్తి పరమైన సమర్ధతలను పెంచు కోవడం ద్వారా విధి నిర్వహణ లో అందరి మన్ననలు పొందవచ్చన్నారు.   అధికారి ఎక్కువ పని చెప్తున్నారని దానిని వేధించడం గా పరిగణించడం, ఫిర్యాదులు చేయడం  చట్టాన్ని పక్కదారి పట్టించడమేనని పేర్కొన్నారు.   లైంగిక వేధింపులకు గురైతే మాత్రం మౌనంగా ఉండకూడదని వెంటనే ఫిర్యాదు చేయాలనీ స్పష్టం చేసారు.  తల్లులుగా ఆడ, మగ పిల్లల్ని సమానంగా  పెంచాలని, వారికీ  సంస్కారం నేర్పించాలని, స్నేహితులతో కలసి వికృత చేష్టలు చేసే వారిని కఠినంగా దండించాలని సూచించారు.   సచివాలయాల్లో యువకులే ఎక్కువగా పనిచేస్తున్నారని, ఈ చట్టం పట్ల వారికీ అవగహన కలిగించాలని జిల్లా పంచాయతి అధికారి సుభాషినికి సూచించారు.  ప్రతి కార్యాలయం లో ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ లను ఏర్పాటు చేసి నోటీసు బోర్డు పై వారి వివరాలను పెట్టేలా చూడాలని ఐ.సి.డి.ఎస్. పి.డి రాజేశ్వరి కి సూచించారు.  డిగ్రీ కళాశాలల్లో కూడా మహిళలకు  ప్రవర్తనా  వైఖరి పై అవగాహనా సదస్సులు నిర్వహించాలని పి.డి. కి ఆదేశించారు.

     స్త్రీ శిశు అభివృద్ధి ప్రోజక్ట్  డైరెక్టర్  రాజేశ్వరి మాట్లాడుతూ  వివిధ శాఖల్లో 50 వరకు లైంగిక వేధింపుల నిరోధక  కమిటీ లు పనిచేస్తున్నాయని,  అవి చురుకుగా పనిచేయాలని విజ్ఞప్తి చేసారు.  ఫిర్యాదుల పై  ప్రధానంగా కౌన్సిలింగ్  చేయడం ద్వారా పరిష్కారం చేయడం జరుగుతుందని తెలిపారు.   న్యాయ సలహాదారులు, మానసిక నిపుణులు  జిల్లా స్థాయి కమిటీ లో ఉన్నారని వివరించారు.   న్యాయ సలహాదారు  వరలక్ష్మి,  విజయలక్ష్మి లు  చట్టం లోని అంశాలను, వివరించారు. మహిళలు పని చేసే చోట రక్షణ, భద్రత కు ఉద్దేశించే ఈ  చట్టం  అన్ని సంస్థలలో అమలు కావాలని  పేర్కొన్నారు.  మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీయడం, తక్కువ చేసి మాట్లాడడం, మహిళల హక్కుల్ని కాలరాయడం, అశ్లీల దృశ్యాలను చూపించడం, నిస్సహాయరాలుని  చేసి ప్రవర్తించడం, శృంగార పరమైన సంభాషణలు చేయడం  ద్వందార్ధాలు మాట్లాడడం లాంటి విషయాలన్నీ ఈ చట్టం పరిధి లోనికి వస్తాయని పేర్కొన్నారు.

   ఈ సమావేశం లో  ముఖ్య ప్రణాళికాధికారి   విజయలక్ష్మి సభాధ్యక్షత వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. రమణ కుమారి,  డి.ఎస్.పి  అష్మా ఫరీన్, డేంకాడ తహసీల్దార్  ఆదిలక్ష్మి ప్రసంగించారు. అదనపు పి.డి లావణ్య , జిల్లా ఆడిట్ అధికారి హిమ బిందు,   జిల్లా అధికారులు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

Create a friendly work environment, work with respect for employees who work with commitment, District Collector A. Surya Kumari