Close

Decisions should be taken to protect government lands, revenue issues should be resolved expeditiously, District Collector Suryakumari at the Revenue Officers’ Conference

Publish Date : 23/10/2021

ప్రభుత్వ భూములు ప‌రిర‌క్షించేలా నిర్ణయాలు వుండాలి

రెవిన్యూ  సంబంధ స‌మ‌స్యలు త్వర‌గా ప‌రిష్కారం కావాలి

రెవిన్యూ అధికారుల సద‌స్సులో జిల్లా క‌లెక్టర్ సూర్యకుమారి

విజ‌య‌న‌గ‌రం, అక్టోబ‌రు 22; రెవిన్యూ అధికారులు ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రభుత్వ భూములు ప‌రిర‌క్షించేందిగా వుండాల‌ని, ప్రభుత్వ భూముల విష‌యంలో నిర్ణయాలు తీసుకునేట‌ప్పుడు బాధ్యత‌గా, అప్రమ‌త్తంగా వ్యవ‌హ‌రించాల‌ని జిల్లా క‌లెక్టర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్యకుమారి త‌హ‌శీల్దార్లను ఆదేశించారు. ప్రభుత్వం వివిధ అవ‌స‌రాల నిమిత్తం సేక‌రించిన భూముల‌ను ప్రభుత్వ భూములుగా రికార్డుల్లో న‌మోదు చేసేందుకు అవ‌స‌ర‌మైన పూర్తి ప్రక్రియ‌నుపూర్తి చేసి భ‌విష్యత్తులో ఆ భూముల‌పై ఎలాంటి వివాదాలు త‌లెత్తకుండా చూడాల‌న్నారు.

      క‌లెక్టర్ కార్యాల‌యంలో జిల్లా రెవిన్యూ అధికారుల స‌మావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. తెలుగుత‌ల్లి చిత్రప‌ టం వ‌ద్ద జిల్లా క‌లెక్టర్ శ్రీ‌మ‌తి సూర్యకుమారి జ్యోతి ప్రజ్వల‌న చేసి స‌మావేశాన్ని ప్రారంభించారు. దాదాపు రెండేళ్ల తర్వాత రెవిన్యూ అధికారుల స‌మావేశం నిర్వహించ‌డం ఆనందంగా వుంద‌న్నారు. కోవిడ్ ప‌రిస్థితుల కార‌ణంగా ప్రత్యక్ష స‌మావేశాలు నిర్వహించ‌లేద‌ని పేర్కొన్నారు. తొలి ద‌శ‌ కోవిడ్ ప‌రిస్థితుల‌ను ఎదుర్కోవ‌డంలో ఈ జిల్లా ఇత‌ర జిల్లాల కంటే ముందువ‌రుస‌లో నిలిచింద‌న్నారు. జిల్లాలో 45 ఏళ్లకు పైబ‌డిన వ‌య‌స్సుగ‌ల వారిలో 92.5 శాతం వ్యాక్సినేష‌న్ సాధించామ‌ని, 18 ఏళ్లకు పైబ‌డిన వారిలో 65శాతం వ్యాక్సినేష‌న్ సాధించామ‌న్నారు.

ప్రభుత్వానికి గ్రామ స్థాయిలో ప‌రిస్థితులు, ఖ‌చ్చిత‌మైన‌ డేటా సేక‌ర‌ణ‌కోసం రెవిన్యూ శాఖ కే బాధ్యత‌లు అప్పగిస్తార‌ని, రెవిన్యూశాఖకు ఏ ప‌ని అప్పగించినా వాస్తవిక‌మైన స‌మాచారం త్వరితంగా సేక‌రించి అందిస్తుంద‌నే న‌మ్మకం వుంద‌న్నారు. ఎలాంటి ఆ న‌మ్మకాన్ని నిల‌బెట్టేలా అధికారులు వ్య‌వ‌హ‌రించాల‌ని చెప్పారు. రెవిన్యూ శాఖ‌కు సంబంధించి ప్రజలు త‌మ స‌మ‌స్యల ప‌రిష్కారం కోసం ప‌దే ప‌దే కార్యాల‌యాల‌కు రావ‌ల‌సిన అవ‌స‌రం లేకుండా త్వర‌గా ప‌రిష్కరించాల‌ని సూచించారు. గ్రామ స‌చివాల‌యాల నుంచి వ‌చ్చిన స‌మ‌స్యలు ఎంత కాల వ్యవ‌ధిలో ప‌రిష్కారం అవుతున్నాయో ప్రతి వారం స‌మీక్షించాల‌న్నారు.

     గ్రామ స‌చివాల‌యాల త‌నిఖీల ద్వారా నిర్దిష్ట ప్రయోజ‌నం క‌లిగేలా త‌హ‌శీల్దార్లు చ‌ర్యలు చేప‌ట్టాల‌న్నారు. స‌చివాల‌యం త‌నిఖీ చేసిన‌పుడు గ్రామంలో ప్రజ‌ల నుంచి వ‌చ్చిన రెవిన్యూ సంబంధ స‌మ‌స్యలు ఏవిధంగా ప‌రిష్కరిస్తున్నారు, స‌కాలంలో స‌మ‌స్యలు ప‌రిష్కారం అవుతున్నాయా లేదా అనే అంశాలు ప‌రిశీలించాల‌న్నారు.

    రేషన్ కార్డు దారులకు సంబంధించి ఇ-కేవైసి తదితర సమస్యలను పరిష్కరించి రేషన్ సరఫరాకు ఆటంకం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బియ్యం పంపిణీ చేసే వాహనాలకు సంబంధించి ఆపరేటర్ల ఖాళీలు ఏర్పడితే వెంటనే భర్తీ చేసే విధంగా ఎం.పి.డి.ఓ. లతో సమన్వయము చేసుకోవాలన్నారు.

   సమావేశంలో జాయింట్ కలెక్టర్(రెవిన్యూ) డా.జి.సి.కిషోర్ కుమార్, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) మయూర్ అశోక్, జాయింట్ కలెక్టర్(ఆసరా) జే.వెంకట రావు, ఐ.టి.డి.ఎ. ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్, సబ్ కలెక్టర్ భావనా, ఆర్.డి.ఓ. భవానీ శంకర్, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతి రావు, డి.ఎస్.ఓ. పాపారావు, భూసేకరణ అధికారులు, తహసీల్దార్ లు పాల్గొన్నారు.

Decisions should be taken to protect government lands, revenue issues should be resolved expeditiously, District Collector Suryakumari at the Revenue Officers' Conference