Disabled persons must get UDID cards, said Collector Suryakumari in a conference on card issuance process.
Publish Date : 26/09/2022
దివ్యాంగులు తప్పకుండా యూడీఐడీ కార్డులు పొందాలి
కార్డుల జారీ ప్రక్రియపై జరిగిన సదస్సులో కలెక్టర్ సూర్యకుమారి
విజయనగరం, సెప్టెంబర్ 16 ః కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అన్ని రకాల సేవలూ, అమలు చేసే పథకాలు పొందేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం యూడీఐడీ(యునిక్ డిజబెలిటీ ఐడీ) కార్డును అందుబాటులోకి తీసుకొచ్చిందని దీనిని దివ్యాంగులందరూ తప్పకుండా ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా పొందాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి సూచించారు. ఇక నుంచి అన్ని రకాల సేవలకూ యూడీఐడీ కార్డు ప్రామాణికం కానుందని కావున వీలైనంత త్వరగా ప్రతి ఒక్కరూ దీన్ని తీసుకోవాలని చెప్పారు. యూడీఐడీ(యునిక్ డిజెబిలిటీ ఐడీ) కార్డుల జారీ ప్రక్రియపై అవగాహన కల్పించే నిమిత్తం స్థానిక యూత్ హాస్టల్‌లో విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కార్డులను అన్ని చోట్లా అంగీకరించేలా అన్ని శాఖలకూ లేఖలు రాసి పంపించాలని విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయక సంచాలకులకు ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. భవిష్యత్తులో అన్ని కార్యకలాపాలు యూడీఐడీ కార్డుపై ఆధారపడే జరుగుతాయని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలోనే ప్రథమంగా విజయనగరం జిల్లాలో ఈ ప్రత్యేక క్యాంపు పెట్టామని దీనిని అందరూ సద్వినియోగం చేసుకొని కార్డులు పొందాలని సూచించారు. అనంతరం యూడీఐడీ ప్రోగ్రాం రాష్ట్ర కో-ఆర్డినేటర్ జి. సురేష్ కార్డు పొందే విధానంపై అవగాహన కల్పించారు. కార్డు కావాల్సిన వారు https://www.swavlambancard.gov.in/ అనే సైట్ ద్వారా దరఖాస్తు పెట్టుకోవాలని సూచించారు.
ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి
కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కాసేపు దివ్యాంగులతో ముచ్చటించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అంగవైకల్యం అనేది మనం కోరుకుంటే వచ్చింది కాదని.. దాని గురించి ఆలోచిస్తూ ఆత్మన్యూనతా భావానికి గురికావొద్దని ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని ఈ సందర్భంగా కలెక్టర్ వారిలో ధైర్యం నింపారు. ప్రణాళిక ప్రకారం అత్యున్నత స్థానాలకు చేరుకొని ఇతరులకు ఆదర్శంగా నిలివాలని స్ఫూర్తి నింపారు. ఇతరులపై ఆధారపడకుండా స్వశక్తితో ఎదగాలని.. సమాజం గర్వించదగ్గ విజేతలుగా నిలవాలని పేర్కొన్నారు.
కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల విభాగం సహాయ సంచాలకులు జగదీష్, గురుదేవా ఛారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు జగదీష్ బాబు, ద్వారకామయి అంధుల పాఠశాల ప్రన్సిపాల్ ఆశాజ్యోతి, వివిధ సంస్థల నిర్వాహకులు, పాఠశాలల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.