* District Athletes Shining in Weightlifting Competitions * * Won a total of 45 medals in various categories * Collector Suryakumari Congratulating the Winners
Publish Date : 30/11/2021
*వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో మెరిసిన జిల్లా క్రీడాకారులు*
* వివిధ విభాగాల్లో మొత్తం 45 పతకాలు కైవసం
* విజేతలను అభినందించిన కలెక్టర్ సూర్యకుమారి
విజయనగరం, నవంబర్ 29 ః ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు ఏలూరు కేంద్రంగా జరిగిన రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ చాంఫియన్ షిప్ పోటీల్లో జిల్లా నుంచి పాల్గొన్న క్రీడాకారులు అత్యంత ప్రతిభ కనబరిచారు. వివిధ విభాగాల్లో పాల్గొన్న బాల, బాలికలు మొత్తం 45 పతకాలు సాధించారు. వాటిలో అత్యధికంగా 18 స్వర్ణ పతకాలుండటం గమనార్హం. ఈ మేరకు వెయిట్ లిఫ్టింగ్ సీనియర్, జూనియర్ విభాగాల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి సోమవారం ప్రత్యేకంగా అభినందించారు. మరింత బాగా ఆడాలని, భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఈ సందర్భంగా ఆమె ఆకాంక్షించారు. ఒకేసారి ఇన్ని పతకాలు సాధించటం జిల్లాకు గర్వకారణమని ప్రశంసించారు.
అనంతరం జిల్లా స్పోర్ట్స్ అధికారి వెంకటేశ్వరావు మాట్లాడుతూ జిల్లా నుంచి వివిధ విభాగాల్లో పాల్గొని పతకాలు సాధించిన విజేతల వివరాలు వెల్లడించారు. ఈ సారి అత్యధిక మంది పతకాలు సాధించారని, వారిలో బాలికలు ఎక్కువ పతకాలు సాధించారని పేర్కొన్నారు. 87, 81, 76, 64, 59, 55, 49, 45, 40 కేజీల విభాగాల్లో పాల్గొన్న బాలికలు 27 పతకాలు, 96, 89, 81, 73, 63, 61, 55, 49 కేజీల విభాగాల్లో పాల్గొన్న బాలురు 18 పతకాలు కైవసం చేసుకున్నారని తెలిపారు. వివిధ విభాగాల్లో పాల్గొన్న సీనియర్, జూనియర్ బాలికలు 14 స్వర్ణం, 10 రజతం, 3 కాంస్య పతకాలు సాధించగా, సీనియర్, జూనియర్ బాలురు 4 స్వర్ణం, 9 రజతం, 5 కాంస్య పతకాలు సాధించారని వివరించారు.
కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అధికారి వెంకటేశ్వరరావు, డా. బి.ఎస్.ఆర్. మూర్తి, పి. అప్పారావు, డా. విశ్వేశ్వరరావు, ఎ. లక్ష్మీనాయుడు, సీహెచ్. రాము, ఎం. శ్రీనివాసు, బి. రవి తదితరులు పాల్గొన్నారు.