District Collector A. Surya Kumari has directed to complete the construction of houses sanctioned under the Housing for All Poor Scheme and prepare for housing in March.
Publish Date : 18/02/2022
మార్చి నెలలో గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలి
ప్రజలతో, ప్రజా ప్రతినిధులతో స్నేహపూర్వకంగా మెలగాలి
గడువు లోపలే వినతులను పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి
విజయనగరం, ఫిబ్రవరి 17 :: నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ళు పధకం క్రింద మంజూరు చేసిన గృహాల నిర్మాణాలు పూర్తి చేసిన వాటికి మార్చి నెలలో గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలనీ జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి సూచించారు. ఇప్పటికే ప్రారంభం అయిన వాటిని వేగంగా పూర్తి అయ్యేలా చూడాలన్నారు. గృహ నిర్మాణాలకు ముందుకురాని వారివి రద్దు చేసి కొత్తవారికి మంజూరు చేయాలనీ ఆదేశించారు. గురువారం కలెక్టర్ దత్తిరాజేరు మండలం ఇంగిలాపల్లి, వి.కృష్ణాపురం గ్రామ సచివాలయాలను తనిఖీ చేసారు. గృహనిర్మాణాల సమీక్ష లో భాగంగా పురోగతి పై ఆరా తీసారు. గృహాలు మంజూరైన వారిని నిర్మించుకునేలా లబ్దిదారులను చైతన్య పరచాలని, అందుకోసం ప్రజాప్రతినిధుల సహకారాన్ని కూడా తీసుకోవాలని , అప్పటికీ ముందుకు రాని వారివి రద్దు చేయాలనీ, అనేక మంది కొత్త వారు దరఖాస్తులు చేసి యున్నారని, వారిలోని అర్హులకు వాటిని కేటాయించడం జరుగుతుందని సచివాలయ సిబ్బందికి సూచించారు.
ఇంగిలాపల్లి సచివాలయం లో స్పందన దరఖాస్తులు కుల ధృవీకరణ, ఆదాయ ధ్రువ పత్రాలు గడువు దాటి పరిష్కరించినవి ఉండడం తో సంబంధిత వి.ఆర్.ఓ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. స్కూల్స్ కు వెళ్లి పిల్లల ఆరోగ్య పరీక్షలు జరిపారా లేదా అని ఏ.ఎన్.ఎం ను ప్రశ్నించారు. పరీక్షించానని చెప్పగా నమోదు చేసిన రికార్డు ను చూపించమని కలెక్టర్ అడిగారు. రికార్డు అందుబాటులో లేదని ఏ.ఎన్.ఎం చెప్పగా సాయంత్రం లోగా కలెక్టర్ కార్యాలయానికి తెచ్చి చూపించాలని కలెక్టర్ ఆదేశించారు. ఉపాధి హామీ పధకం క్రింద ఎన్ని పనులకు గ్రామ సభ లో తీర్మానం చేసారని అడుగగా 21 పనులకు తీర్మానం చేయడం జరిగిందని సెక్రటరీ తెలుపగా , ఏ ఏ పనులకు చేసారని ప్రశ్నించారు. బోర్ వెల్స్ క్లీనింగ్, ప్లాట్ ఫారం లు కట్టాలని సూచించారు. రైతులకు ప్రకృతి వ్యవసాయం పై అవగాహన కలిగించాలని సూచించారు. సచివాలయ సిబ్బంది ప్రజా ప్రతినిధులను గౌరవించి, సంక్షేమ పధకాలను ప్రజలకు అవగాహన కల్పించడం లో వారి సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. గ్రామ పరిసరాల్లో ప్లాస్టిక్ వ్యర్ధాలు ఎక్కువగా కనపడుతున్నాయని, ప్రజా ప్రతినిధుల సహకారం తో వాటిని తొలగించాలని, పారిశుధ్యం పై అవగాహన కలిగించాలని సూచించారు. అనంతరం సచివాలయం లో నున్న అన్ని రికార్డు లను తనిఖీ చేసారు.
వి.కృష్ణా పురం గ్రామ సచివాలయం లో ఫ్రైడే డ్రై డే గా అవగాహన కల్పిస్తూ పాటిస్తున్న ఏ.ఎన్.ఎం. ను అభినందించారు. క్లాప్ కార్యక్రమం లో భాగంగా తడి, పొడి చెత్తలను వేరు చేసి డిస్పోజ్ చేయడం పై కూడా అవగాహన కలిగించాలన్నారు. గ్రామం లో నున్న అంగన్వాడి కేంద్రం లోని పిల్లలందరూ ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూడాలన్నారు. గర్భిణీ, బాలింత స్త్రీల నమోదు, వారి పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నది లేనిది అడిగి తెలుసుకున్నారు.
ఈ తనిఖీ లో మండల అభివృద్ధి అధికారి సుభ్రహ్మణ్యం , తహసిల్దార్ సులోచనా రాణి , గృహ నిర్మాణ ఏ.ఈ లు, తదితరులు పాల్గొన్నారు.