District Collector A. Suryakumari directed that applications submitted by aspiring industrialists for the establishment of industries should be scrutinized immediately and permission given to them within the stipulated period.
Publish Date : 29/09/2022
త్వరితగతిన పరిశ్రమలకు అనుమతి
డిఐఇపిసి సమావేశంలో కలెక్టర్ ఎ.సూర్యకుమారి
విజయనగరం, సెప్టెంబరు 27 ః పరిశ్రమల స్థాపనకు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు అందజేసిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి, నిర్ణీత కాలవ్యవధిలోపలే వాటికి అనుమతులు ఇవ్వాలని, జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశించారు. జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం జరిగింది. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలు, వచ్చిన దరఖాస్తులు, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పరిశ్రమల స్థాపనకు మొత్తం 47 దరఖాస్తులు అందగా, వాటిలో ఇప్పటికే 14 పరిశ్రమలకు అనుమతిచ్చినట్లు చెప్పారు. మిగిలిన వాటిని వెంటనే పరిశీలించి, అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. జిల్లాలో వ్యవసాయాధారిత పరిశ్రమల స్థాపనకోసం రైతు సంఘాలు ఉత్సాహం చూపిస్తున్నాయని, వాటిపై దృష్టి పెట్టాలని సూచించారు. దీనికి అనువుగా సంప్రదాయ పంటలకు బదులు, ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని చెప్పారు. జిల్లా పారిశ్రామికంగా అభివృద్ది చెందాలంటే, బ్యాంకుల సహకారం చాలా అవసరమని స్పష్టం చేశారు.
స్ఫూర్తి కార్యక్రమం క్రింద జిల్లాలో పరిశ్రలమ స్థాపనకు జరుగుతున్న ప్రయత్నాలను, డిఆర్‌డిఏ పిడి ఎ.కల్యాణ చక్రవర్తి వివరించారు. ఎస్‌కోట ప్రాంతంలో భోజన ప్లేట్లు తయారీ, బీమాలిలో మామిడి తాండ్ర, పచ్చళ్ల తయారీ, మెరకముడిదాంలో పూతరేకుల తయారీ, గుర్ల ప్రాంతంలో వస్త్ర పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమలశాఖ మేనేజర్ పాపారావు, డిడి నాగేశ్వర్రావు, ట్రైనీ డిప్యుటీ కలెక్టర్ శ్రీకర్, మెప్మా పిడి సుధాకర్, ఉద్యానశాఖ డిడి జమదగ్ని, మత్య్సశాఖ డిడి నిర్మలాకుమారి, వ్యవసాయశాఖ ఎడి అన్నపూర్ణ, ఎఎల్‌డిఎం ప్రత్యూష, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.