District Collector A. Suryakumari urged that our culture, traditions, literature and arts are very rich and it is the responsibility of everyone to protect them and provide them to future generations.
Publish Date : 14/10/2022
మన సంస్కృతి, కళలను పరిరక్షించాలి
రాజమన్నార్ ఆలయంలో అవధానాన్ని తిలకించిన కలెక్టర్
విజయనగరం, అక్టోబరు 10 ః
మన సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం, కళలు ఎంతో గొప్పవని, వీటిని పరిరక్షించి భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపైనా ఉందని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి కోరారు. సాహితీ ప్రక్రియలో విభిన్నమైన అవధాన కళ ఎంతో గొప్పదని కొనియాడారు. ఇలాంటి అరుదైన కళలు అంతరించిపోకుండా, భావి తరానికి అందించాలని కోరారు. దీనికోసం యువత సాహిత్యంపై మక్కువ పెంచుకొని, విలువైన గ్రంథాలను పఠనం చేయాలని సూచించారు.
విజయనగరం ఉత్సవాల్లో భాగంగా, స్థానిక మన్నార్ శ్రీ రాజగోపాలస్వామి ఆలయంలో అవధానం, పథ్యపఠనం తదితర సాహితీ ప్రక్రియలను, సాంస్కృతిక కార్యక్రమాలను సోమవారం నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ సాహితీవేత్త, ఆర్. అనంతపద్మనాభరావు అవధాన్ని కలెక్టర్ సూర్యకుమారి ఆద్యంతమూ తిలకించి, ఆయన ప్రజ్ఞను అభినందించి సత్కరించారు. అనంతరం తిరుపతికి చెందిన శతావధాని ఆమదాల మురళీశర్మ అవధానం జరిగింది. జిల్లాకు చెందిన వివిధ పాఠశాలలు, కళాశాలల తెలుగు ఆచార్యులు, సాహితీ ప్రముఖులు పద్యపఠనం గావించారు. ఆదిభట్ల భరద్వాజ హరికథాగానం, కనపల లక్ష్మి బుర్రకథ ఆద్యంతమూ అలరించాయి. భరతనాట్యం, కూచిపూడి తదితర నృత్య ప్రదర్శనలు, ప్రాచీన పుస్తక ప్రదర్శన ఆకట్టకున్నాయి. ఈ వేదికపై ఏర్పాటు చేసిన కార్యక్రమాలను శాసనసభ ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి, కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కట్టమణి తదితర ప్రముఖులు సైతం తిలకించి, వేదిక ఇన్‌ఛార్జిలుగా వ్యవహరిస్తున్న జిల్లా నైపుణ్యాధికారి డాక్టర్ ఎన్.గోవిందరావు, డైట్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.తిరుపతిరావు, మహారాజా సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ గౌరీశ్వర్రావును అభినందించారు. కార్యక్రమంలో పలువురు సాహితీ ప్రముఖులు, సామితీ ప్రియులు పాల్గొన్నారు.