District Collector S. Ramsunder Reddy takes drastic measures to bring back fishermen
Publish Date : 24/10/2025
మత్స్యకారులను రప్పించేందుకు ముమ్మర చర్యలు
జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి
విజయనగరం, అక్టోబర్ 23:బంగ్లాదేశ్ నేవీకి చిక్కిన విజయనగరం జిల్లాకు చెందిన ఎనిమిది మంది మత్స్యకారులను స్వదేశానికి క్షేమంగా రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని స్థాయిల్లో చర్యలు వేగవంతం చేసిందని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు.
సముద్రంలో చేపల వేటకు వెళ్లి పొరపాటున బంగ్లాదేశ్ సముద్ర సరిహద్దులోకి ప్రవేశించిన ఈ మత్స్యకారుల పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై, కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ (MEA)తో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తోందని కలెక్టర్ చెప్పారు. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీలోని ఏపీ భవన్ ద్వారా అధికారిక చర్చలు కొనసాగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విదేశాంగ మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ బి. శ్యామ్ ను సంప్రదించి కేసు పురోగతిని తెలుసుకున్నట్లు తెలిపారు.
ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, బంగ్లాదేశ్‌లో మత్స్యకారులపై చార్జ్‌షీట్ దాఖలయిందని, అయితే ఢాకాలోని భారత హైకమిషన్ ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయబృందం వారిని రక్షించేందుకు అవసరమైన న్యాయ సహాయాన్ని అందిస్తోందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిరంతరం హైకమిషన్ మరియు బంగ్లాదేశ్ రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతూ ఉందని చెప్పారు.
బాధిత కుటుంబాలను జిల్లా పరిపాలన నిరంతరం సంప్రదిస్తూ, వారికి అన్ని రకాల సహాయాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ పేర్కొన్నారు. తన ఆదేశాల మేరకు ఆర్డీఓ డి. కీర్తి విశాఖపట్నం వెళ్లి బాధిత కుటుంబాలను కలిసి ధైర్యం చెప్పారని తెలిపారు. మత్స్యకారులను క్షేమంగా దేశానికి తీసుకురావడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేస్తూ నిరంతరం కృషి చేస్తోందని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి స్పష్టం చేశారు.
……………
జారీ : జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి, విజయనగరం.