District Collector Smt. A. Suryakumari asked for more encouragement for setting up of industries in the district.
Publish Date : 02/05/2022
పరిశ్రమల స్థాపనకు మరింత ప్రోత్సాహం
యువ ఇంజనీర్లకు అవగాహనా సదస్సులు
పిఎంఈజిపిని వినియోగించుకోవాలి
జగనన్న బడుగు వికాశం ద్వారా ఎస్సి, ఎస్టిలకు చేయూత
డిఐఇపిసి సమావేశంలో కలెక్టర్ సూర్యకుమారి
విజయనగరం, ఏప్రెల్ 30 ః
జిల్లాలో పరిశ్రమల స్థాపనకు మరింత ప్రోత్సాహాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి కోరారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తే, జిల్లా యంత్రాంగం తరపున అన్ని విధాలా సహకారం అందిస్తామని, శనివారం ఆన్లైన్లో నిర్వహించిన డిఐఇపిసి సమావేశంలో కలెక్టర్ హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, పరిశ్రమల స్థాపనకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకొనే విధంగా యువతను చైతన్య పరచాలని కోరారు. దీనికోసం యువ ఇంజనీర్లకు అవగాహనా సదస్సులు, రోడ్‌షోలు నిర్వహించాలని సూచించారు. స్టాండప్ ఇండియాలో భాగంగా, పిఎంఇజిపి కార్యక్రమం క్రింద ఎస్సి, ఎస్టి, మహిళా పారిశ్రామిక వేత్తలు కనీసం ఒక్కొక్కిరికీ ప్రతీ బ్యాంకు శాఖ పరిధిలో రుణం ఇవ్వాలన్న నిబంధన ఉందని తెలిపారు. పిఎంఇజిపి కార్యక్రమం ద్వారా రూ.25లక్షలు వరకు బ్యాంకుల నుంచి రుణం మంజూరు చేయడం జరుగుతుందని, దీనిలో 35శాతం వరకు సబ్సిడీ ఉంటుందని చెప్పారు. అలాగే రాష్ట్రప్రభుత్వ పారిశ్రామికాభివృద్ది విధానంలో భాగంగా జగనన్న బడుగు వికాశం పథకాన్ని ప్రవేశపెట్టిందని, దీనిని వినియోగించుకోవాలని కోరారు. ఈ పథకం క్రింద ఎస్సి, ఎస్టిలకు, బిసి, మైనారిటీ మహిళలు పరిశ్రమలను స్థాపించేందుకు సహకారాన్ని అందిస్తోందని చెప్పారు. దీనిక్రింద యూనిట్ ఖరీదులో 45శాతం, గరిష్టంగా కోటి రూపాయలు వరకు సబ్సిడీ లభిస్తుందని తెలిపారు. ఈ పథకం క్రింద ఉత్పత్తి సంస్థలతోపాటు సేవా పరిశ్రమలు, వాహనాలను కూడా కొనుగోలు చేయవచ్చని సూచించారు. ఈ పథకం క్రింద 5 యూనిట్లకు రూ.35లక్షల సబ్సడీని విడుదల చేసేందుకు ఆమోదం తెలిపారు.
జిల్లాలో రైస్‌మిల్లుల స్థాపనకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న రైస్‌మిల్లుల ద్వారా జిల్లాలోని డిమాండ్‌లో కనీసం 5వ వంతు కూడా మిల్లింగ్ జరగడం లేదని అన్నారు. అందువల్ల అనువైన ప్రాంతాల్లోల రైస్‌మిల్లులను ఏర్పాటు చేయాలని సూచించారు. యూనిట్లకు అనుబంధ పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించాలని అన్నారు. ఈ సమావేశంలో పలువురు పారిశ్రామిక వేత్తలు తమ సమస్యలను కలెక్టర్‌కు వివరించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మరో 15 రోజుల్లో విద్యుత్ కొరత తీరే అవకాశం ఉందని చెప్పారు. నెల్లిమర్ల పారిశ్రామిక వాడలోని పరిశ్రమలకు ఆస్తిపన్నుపై అదనంగా వేసిన 30 శాతం నీటి పన్నును తొలగించడానికి ప్రయత్నిస్తామని, వారికి ఎన్ఓసి సర్టికేట్లను జారీ చేస్తామని చెప్పారు. మహిళా పారిశ్రామిక వాడను ఏర్పాటు చేసే పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. పరిశ్రమల స్థాపనకు వచ్చే దరఖాస్తులను సింగిల్ విండో ద్వారా వీలైనంత వేగంగా పరిశీలించి, అనుమతులు జారీ చేయాలని, స్టార్టప్‌లను ప్రోత్సహించాలని సూచించారు. ఔత్సాహికులకు ఇచ్చే శిక్షణ, నేటి సమాజ అవసరాలకు అనుగుణంగా ఉండాలని, సంప్రదాయ కోర్సులకు బదులు, వినూత్నంగా ఆలోచించి శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ కోరారు.
ఈ సమావేశంలో పరిశ్రమలశాఖ జిల్లా మేనేజర్ పాపారావు, డిడి నాగేశ్వర్రావు, ఎల్డిఎం శ్రీనివాసరావు, ఎస్సి కార్పొరేషన్ ఇడి జి.కామేశ్వర్రావు, డిపిఓ సుభాషిణి, మత్స్యశాఖ డిడి నిర్మలాకుమారి, డిఎఫ్ఓ కె.వినయ్, ఎంఎస్ఎంఇ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఎడి జె.చంద్రమౌళి, వివిధ శాఖల ప్రతినిధులు, డిఐఈపిసి సభ్యులు, పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
