District Collector Smt. A. Suryakumari directed to complete the convergence work undertaken under the Mahatma Gandhi National Rural Employment Scheme on war footing. It was suggested that the work should be completed immediately and the bills should be uploaded immediately.
Publish Date : 25/03/2022
ఉపాధి పనులను యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
పూసపాటిరేగ మండలంలో పర్యటించిన కలెక్టర్
పూసపాటిరేగ, (విజయనగరం), మార్చి 22 ః
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం క్రింద చేపట్టిన కన్వర్జెన్సీ పనులను యుద్దప్రాతిపదికన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ఆదేశించారు. పనులను తక్షణమే పూర్తిచేసి, బిల్లులను వెంటవెంటనే అప్లోడ్ చేయాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ సూర్యకుమారి పూసపాటిరేగ మండలంలో మంగళవారం పర్యటించారు. ముందుగా ఆమె కందివలస గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేశారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలు పై సచివాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. గృహనిర్మాణ కార్యక్రమంపై సమీక్షిస్తూ, పనులను మరింత వేగవంతం చేయాలని, లబ్దిదారులందరి చేతా ఇంటి నిర్మాణాన్ని ప్రారంభింపచేయాలని ఆదేశించారు. గ్రామాలను అభివృద్ది చేయడానికి ఉపాధిహామీ పనులు ఒక గొప్ప అవకాశమని పేర్కొన్నారు. గ్రామ అవసరాలు తీర్చేలా ఉపాధి పనులు వినియోగించు కోవాలని, గ్రావెల్ రోడ్లు ఉంటే తక్షణమే పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. సచివాలయం సిబ్బంది బయో మెట్రిక్ హాజరును, రికార్డులను తనిఖీ చేసి పలువురి సిబ్బంది హాజరు తక్కువగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామంలోని ప్రజల ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. అధిక శాతం మంది డయాబెటిస్, హైపర్ టెన్షన్ వంటి వ్యాధులతో వున్నట్టు ఆరోగ్య కార్యకర్తలు వివరించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ, గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి కారణాలు గుర్తించాలని సూచించారు. బాలికలకు రక్త హీనత పరీక్షలు నిర్వహిస్తున్నది లేనిదీ తెలుసుకున్నారు. హీమోగ్లోబిన్ శాతం, వేక్సినేషన్పై ప్రశ్నించారు. గ్రామంలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక పై వ్యవసాయ అధికారిని ప్రశ్నించారు. ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ఈ క్రాప్ ఏవిధంగా చేస్తున్నదీ ఆరా తీశారు. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రశ్నించారు. చెత్తశుద్ది కేంద్రాల నిర్వహణను తెలుసుకున్నారు. గోవిందపురం నుంచి భరణికాం గ్రామానికీ ఉపాధి హామీ కన్వర్జెన్స్ నిధులతో నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులను కలెక్టర్ పరిశీలించారు. త్వరగా రోడ్డుపనులను పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో తాశీల్దార్ కృష్ణమూర్తి, హౌసింగ్ డిఇ మురళి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.