District Collector Smt. A. Suryakumari directed to open Jandhan bank account by every family holding white ration card
Publish Date : 28/04/2022
ప్రతీఒక్కరికీ జన్‌ధన్ ఖాతా
ఏడాదికి మూడు పంటలు పండించాలి
అర్హత ఉన్నవారికి ఉపాధిహామీ జాబ్ కార్డులు
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
గజపతినగరం, దత్తిరాజేరులో పర్యటన
పదోతరగతి పరీక్షా కేంద్రం తనిఖీ
గజపతినగరం, దత్తిరాజేరు (విజయనగరం), ఏప్రెల్ 27 ః. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతీ కుటుంబం చేతా జన్‌ధన్ బ్యాంకు ఖాతాను తెరిపించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న బీమా పథకాలను పొందేందుకు జన్‌దన్ ఖాతాలు తప్పనిసరి అని ఆమె స్పష్టం చేశారు. గజపతినగరం, దత్తిరాజేరులో బుధవారం కలెక్టర్ సూర్యకుమారి సుడిగాలి పర్యటన జరిపారు. పలు అభివృద్ది కార్యక్రమాలను, ప్రభుత్వ సంస్థలను తనిఖీ చేశారు.
ఉపాధిహామీ పనుల పరిశీలన
మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం క్రింద గజపతినగరం మండలం మధుపాడ గ్రామంలో జరుగుతున్న చెరువు పనులను కలెక్టర్ పరిశీలించారు. ఎంతమంది పనులకు హాజరైనది తెలుసుకున్నారు. క్షేత్ర సహాయకులతో, మేట్లతో మాట్లాడి, పనులపై ఆరా తీశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున, ఉపాధి వేతన దారులకు తప్పనిసరిగా త్రాగునీటిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వారికి అవసరమైన వసతులను కల్పించాలని సూచించారు.
పదోతరగతి పరీక్షా కేంద్రం తనిఖీ
దత్తిరాజేరు మండలం మరడాం గ్రామంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదోతరగతి పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సెంటర్ ఛీఫ్ వి.నాగమణితో మాట్లాడి, పరీక్షల నిర్వహణకు చేసిన ఏర్పాట్లను తెలుసుకున్నారు. ఈ పరీక్షా కేంద్రానికి 219 మంది విద్యార్థులను కేటాయించగా, శతశాతం హాజరైనట్లు తెలుసుకున్నారు. చూసిరాతలకు తావివ్వకుండా, పరీక్షలను పకడ్భంధీగా నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థులకు త్రాగునీటిని అందుబాటులో ఉంచాలని సూచించారు. పాఠశాలలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంపై ఆరా తీశారు.
సచివాలయాల సందర్శన
కలెక్టర్ సూర్యకుమారి తన పర్యటనలో భాగంగా మరడాం, కె.కొత్తవలస గ్రామ సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆలస్యంగా వచ్చిన సిబ్బందిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హాజరుశాతం తక్కువగా ఉన్న వలంటీర్లను తొలగించాలని ఆదేశించారు. ఉపాధిహామీ పనులు, ఓటిఎస్ అమలు, జగనన్న విద్యాదీవెన, ఇ-క్రాప్ నమోదు, టీకా కార్యక్రమం, మహిళలకు, పిల్లలకు పోషకాహార పంపిణీ తదితర ప్రభుత్వ కార్యక్రమాలపై ఆరా తీశారు. పిల్లలు, మహిళల ఆరోగ్యంపై దృష్టిపెట్టి, రక్తశాతం పెరిగేందుకు అవసరమైన పోషకాహారాన్ని, మందులను అందజేయాలని సూచించారు. సచివాలయాల్లో దరఖాస్తులు పెండింగ్ ఉండటం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఉపాధిహామీ పనులు నిర్వహించడానికి ఇదే తగిన సమయమని, పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎస్డబ్ల్యూపిసి కేంద్రాలను పూర్తిస్థాయిలో వినియోగించాలని, వాటినుంచి ఎరువును ఉత్పత్తి చేయాలని సూచించారు. ఉత్పత్తి చేసిన ఎరువును ఎప్పటికప్పుడు రైతులకు విక్రయించాలని చెప్పారు. ఆయా గ్రామాల్లో కూరగాయల రైతుల సమస్యలను తెలుసుకున్నారు. కూరగాయలకు అవసరమైన మార్కెటింగ్ సదుపాయాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఉపాధిహామీ పథకం క్రింద కిచెన్ షెడ్లు, మినీ గోకులాలను మంజూరు చేస్తామని చెప్పారు. భూగర్భ జలాలను పెంచే రెయిన్ హార్వెస్టింగ్ కట్టడాలను నిర్మించాలని సూచించారు. అర్హత ఉన్న రైతులందరికీ కెసిసి కార్డులను జారీ చేయాలని ఆదేశించారు. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని సూచించారు. ఏడాదికి మూడు పంటలు పండించేందుకు తగిన ప్రణాళికను రూపొందించాలని, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని రైతుభరోసా కేంద్రం సిబ్బందిని ఆదేశించారు. తెల్లకార్డు కలిగిన ప్రతీ కుటుంబానీకి జన్‌ధన్ ఖాతా ఉండేలా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
హౌసింగ్ కాలనీ పరిశీలన
కె.కొత్తవలసలో నిర్మాణంలో ఉన్న జగనన్న కాలనీని కలెక్టర్ పరిశీలించారు. ఇక్కడ 17 ఇళ్లు మంజూరు కాగా, 16 ఇళ్లు నిర్మాణంలో ఉండటం పట్ల కలెక్టర్ సంతృప్తిని వ్యక్తం చేశారు. మిగిలిపోయిన ఇంటి నిర్మాణాన్ని కూడా ప్రారంభింపజేయాలని, నిర్మాణంలో ఉన్న ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యేలోపే, కాలనీలో రోడ్లు, త్రాగునీరు, విద్యుత్ సరఫరా తదితర మౌలిక సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ నమూనా ప్రకారమే ఇంటికి కేటాయించిన ఇసుకను సరఫరా చేయాలని, డిజైన్‌ను మార్చుకున్నవారికి అదనంగా ఇసుకను ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు.
ప్రాధమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ
కె.కొత్తవలస ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్నికలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. రోజుకు ఎంతమంది రోగులు వస్తున్నదీ, పిహెచ్సి డాక్టర్ వి.సంతోషి రూపను అడిగి తెలుసుకున్నారు. ఫీవర్ సర్వే, స్క్రీనింగ్ పరీక్షలు, స్పెషలిస్టుల సేవలు, వేక్సినేషన్, మధుమేహం తదితర రక్త పరీక్షలపై ప్రశ్నించారు. మరింత మెరుగ్గా సేవలను అందించాలని ఆదేశించారు. ఆసుపత్రిలో స్టోర్ రూముల నిర్మాణానికి ఎవరైనా దాతలు ముందుకు వస్తే, ఆ కట్టడాలకు వారి పేర్లు పెట్టడం జరుగుతుందని కలెక్టర్ సూచించారు.
కూరగాయల రైతులకు గిట్టుబాటు ధరలు
కూరగాయలు పండిస్తున్న రైతులకు గిట్టుబాటు ధరను కల్పించేందుకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ సూర్యకుమారి హామీ ఇచ్చారు. మార్క్‌ఫెడ్ ద్వారా కూరగాయలను కొనుగోలు చేసి, మార్కెటింగ్ చేయాలని, అవసరమైతే వాటిని సంక్షేమ హాస్టళ్లకు కూడా సరఫరా చేయాలని సూచించారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మండలంలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలపై దత్తిరాజేరు ఎంపిడిఓ కార్యాలయంలో వివిధశాఖల మండలస్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.
గ్రామీణ ఉపాధిహామీ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ పథకం క్రింద కిచెన్ షెడ్లు, మినీ గోకులాలు, గ్రావెల్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిస్తే, మంజూరు చేస్తామని చెప్పారు. పంచాయితీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ది పనులపై సమీక్షిస్తూ, త్వరగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఆగస్టు నెల చివరికల్లా సచివాలయాల నిర్మాణాన్ని, సెప్టెంబరు ఆఖరుకి రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్ల నిర్మాణాన్ని, డిసెంబరు నాటికి డిజిటల్ లైబ్రరీల నిర్మాణాన్ని ఎట్టిపరిస్థితిలోనూ పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. పనులను నిర్వహించడానికి ఇదే తగిన అనుకూల సమయమని, వర్షాలు ప్రారంభం కాకముందే యుద్దప్రాతిపదికన పనులు చేయాలని సూచించారు. పదోతరగతి పరీక్షలు ముగిసిన వెంటనే నాడూ-నేడు రెండో దశ పనులను మొదలుపెట్టి, పాఠశాలలు పునఃప్రారంభించే నాటికి సిద్దం చేయాలని ఆదేశించారు. ఆగిపోయిన పాఠశాల భవనాల నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. అర్హులందరిచేతా జనధన్ ఖాతాలను తప్పనిసరిగా తెరిపించాలన్నారు. చిన్నచిన్న పరిశ్రమలను స్థాపించడానికి ముందుకు వచ్చే మహిళలను ప్రోత్సహించి, వారికి రుణాలు ఇప్పించాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమాల్లో ఎంపిడిఓ ఎం.బి.సుబ్రమణ్యం, ఏఓ కె.గోవిందమ్మ, పిఆర్ జెఇ అప్పలనాయుడు, ఆర్డబ్ల్యూఎస్ జెఇ చంద్రకళ, హౌసింగ్ ఏఇ పి.ఉమామహేశ్వర్రావు, మండల సర్వేయర్ తేజేశ్వ్రరావు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
