District Collector Smt. A. Suryakumari said that education is the only way to develop. She made it clear that anything could be achieved if it was difficult.
Publish Date : 06/04/2022
అభివృద్ది చెందడానికి చదువు మాత్రమే ఏకైక మార్గమని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి పేర్కొన్నారు. కష్టపడితే ఏదైనా సాధించడం సాధ్యమేనని ఆమె స్పష్టం చేశారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, సంఘ సంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని, డాక్టర్ బాబూ జగజ్జీవన్ రామ్ 114వ జయంతోత్సవం, కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం సాంఘిక సంక్షేమశాఖ ఆద్వర్యంలో ఘనంగా జరిగింది. ముందుగా బాబూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ, బాబూ జగజ్జీవన్‌రామ్ లాంటి మహానుభావులను స్ఫూర్తిగా తీసుకొని, జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకొనేందుకు యువత కృషి చేయాలని కోరారు. చిరస్థాయిగా మన పేరు నిలిచేలా, అందరికీ మార్గదర్శకులుగా మారే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఏ రంగంలో ఉన్నత స్థానం సాధించాలన్నా, దానికి చదువు ఒక్కటే ఏకైక మార్గమని ఆమె పేర్కొన్నారు. చదువు గొప్ప గుర్తింపుని, రాణింపుని ఇస్తుందని అన్నారు. ప్రభుత్వ పథకాలు చేయూతను మాత్రమే ఇస్తాయని, వాటిని సద్వినియోగం చేసుకొని కృషి చేసినప్పుడే, అభివృద్ది సాధ్యమవుతుందని అన్నారు. ముఖ్యంగా బాలికలు ఉన్నత చదువులపై దృష్టిపెట్టి, బాలురతో సమానంగా పోటీపడాలని పిలుపునిచ్చారు. ఒక కుటుంబంలో తల్లి చదువుకున్నదయితే, ఆమె చదువు ఒక తరాన్ని నిలబెడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.
రాజాం శాసనసభ్యులు కంబాల జోగులు మాట్లాడుతూ, బాబూజీ ఆశయ సాధనకు ప్రతీఒక్కరూ కృషి చేయాలని కోరారు. అతిచిన్న వయసులోనే శాసనసభ్యునిగా ఎన్నికైన బాబూజీ, సుమారు 30ఏళ్లపాటు కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానిగా దేశానికి సేవలందించారని కొనియాడారు. వారి సేవలను నిరంతరం స్మరించుకొని, స్ఫూర్తి పొందాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందన్నారు. చదువు ద్వారా ఆర్థిక సమానత్వాన్ని సాధించవచ్చునని అన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని, మంచి ఉద్యోగాలను సాధించాలని కోరారు. ఉన్నత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని, దానిని సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి ఆధ్వర్యంలో, రాష్ట్రంలో రాజ్యాంగబద్దమైన పాలన సాగుతోందని, సంక్షేమ పథకాలు ప్రతీఒక్కరికీ అందుతున్నాయని అన్నారు. ఆర్థిక లక్ష్యాలను సాధించేందుకు, అభివృద్ది ఫలాలు అందించేందుకే వివిధ కులాలకు కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు.
బాబూజీ జయంతిని పురస్కరించుకొని, విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థులకు జగనన్న వసతి దీవెన చెక్కలను, డప్పు కళాకారులకు పింఛన్లను పంపిణీ చేశారు. బాబూజీ జీవిత చరిత్రను గురుకుల కళాశాల విద్యార్థిని విజయలక్ష్మి చక్కగా వివరించారు. వివిధ దళిత సంఘాల నాయకులు బసవ సూర్యనారాయణ, గోక రమేష్, గంటాన అప్పారావు, చిన్న బంగార్రాజు మాట్లాడుతూ, జగజ్జీవన్‌రామ్ గొప్పదనాన్ని, తమ సమస్యలను వివరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డిఆర్ఓ ఎం.గణపతిరావు, సాంఘిక సంక్షేమశాఖ డిప్యుటీ డైరెక్టర్ కె.సునీల్ రాజ్‌కుమార్, ఎస్సి కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుధాకరరావు, వివిధ శాఖల అధికారులు, వసతిగృహ సంక్షేమాధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
