District is very conducive to the establishment of industries, Entrepreneurial Entrepreneurs should come forward, District Collector A. Suryakumari called
Publish Date : 20/12/2021
పరిశ్రమల స్థాపనకు జిల్లా ఎంతో అనుకూలం
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి పిలుపు
విజయనగరం, డిసెంబరు 18 ః పరిశ్రమల స్థాపనకు జిల్లాలో ఎంతో అనుకూలమైన వాతావరణం ఉందని, దీనిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి కోరారు. జిల్లాలోని వనరులను ఉపయోగించుకొని, పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. జిల్లాలో పారిశ్రామికాభివృద్దికి ఉన్న అవకాశాలు, సవాళ్లు అన్న అంశపై ఎపి ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ ఫెడరేషన్ (విశాఖ జోన్) ఆద్వర్యంలో, స్థానిక ఎస్విఎన్ లేక్ప్యాలెస్లో శనివారం నిర్వహించిన సదస్సుకు కలెక్టర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అన్నివిధాలా సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని చెప్పారు. విజయనగరం జిల్లాలో పరిశ్రమల స్థాపనకు కావాల్సిన భూమి, రహదారి సౌకర్యం, మానవ వనరులు అందుబాటులో ఉన్నాయన్నారు. డిఆర్డిఏ, మెప్మా తదితర శాఖల ఆధ్వర్యంలో శిక్షణను ఏర్పాటు చేసి, నైపుణ్యమైన కార్మికులను కూడా పరిశ్రమలకు అందించేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు. మరికొద్ది నెలల్లో విశాఖ-రాయపూర్ జాతీయ రహదారి అందుబాటులోకి వస్తుందని, భోగాపురం విమానాశ్రయం కూడా నిర్మితం కానుందని, దీనివల్ల జిల్లాలో పరిశ్రమల స్థాపనకు మరింత అనుకూలంగా మారుతుందని చెప్పారు. ఎక్కడా లేనివిధంగా జిల్లాలో ప్రకృతి వ్యవసాయం ఎక్కువగా జరుగుతోందని, ఈ ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు చాలా అవకాశాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. జిల్లా ప్రజలు కూడా పరిశ్రమల స్థాపనపట్ల చాలా సానుకూల దృక్ఫథాన్ని చూపిస్తున్నారని అన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తామని కలెక్టర్ ప్రకటించారు.
జాయింట్ కలెక్టర్ (ఆసరా) జె.వెంకటరావు మాట్లాడుతూ, పరిశ్రమల స్థాపనకు సంపూర్ణ సహాకారాన్ని అందించేందుకు జిల్లా యంత్రాంగం సిద్దంగా ఉందన్నారు. వాతావరణం కూడా సానుకూలంగా ఉందని, అన్నిరకాల వనరులు దుబాటులో ఉన్నాయని, దీనిని వినియోగించుకోవాలని కోరారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు, జిల్లా కలెక్టర్ ఆద్వర్యంలో ప్రతీనెలా 3వ శనివారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ది చేసేందుకు జిల్లా కలెక్టర్ కృతనిశ్చయంతో ఉన్నారని జెసి తెలిపారు.
ఎపి ఛాంబర్ విశాఖపట్నం జోన్ ఛైర్మన్ కెఆర్‌బి ప్రకాష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో, వైస్ ఛైర్మన్ సిహెచ్ శ్రీనాధ్, ఇసి మెంబర్ కుమార్ రాజా, ఎపి ఛాంబర్ పూర్వ అధ్యక్షులు జి.సాంబశివరావు, మహిళా పారిశ్రామికవేత్తల ఛైర్పర్సన్ ఎ.లీలారాణి తదితరులు మాట్లాడారు. జిల్లాలో పరిశ్రమల పరిస్థితి, కొత్త పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలను, పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ జిఎం శ్రీధర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. డిఆర్డిఏ పిడి డాక్టర్ ఎం.అశోక్‌కుమార్, మెప్మా పిడి ఎస్.సుధాకరరావు, ఉద్యానశాఖ డిడి పిఎన్‌వి లక్ష్మీనారాయణ, ఎల్డిఎం శ్రీనివాసరావు, తదితర వివిధ శాఖల ప్రతినిధులు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.
