Close

* Do not go hunting … Do not harvest rice .. * * Collector A. Suryankumari appealed to fishermen and farmers.

Publish Date : 03/12/2021

*వేట‌కు వెళ్లొద్దు… వ‌రి కోత‌లు కోయొద్దు..*

* మ‌త్స్య‌కారుల‌కు, రైతుల‌కు విజ్ఞ‌ప్తి చేసిన క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి

* తుఫాన్ హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో తీర ప్రాంతంలో సుడిగాలి ప‌ర్య‌ట‌న‌

* అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, తుఫాన్ షెల్ట‌ర్ల‌లో ఏర్పాట్లు చేసుకోవాల‌ని అధికారుల‌కు సూచ‌న‌

* సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించే క్ర‌మంలో అధికారుల‌కు స‌హ‌క‌రించాల‌ని ప్ర‌జ‌ల‌కు మ‌న‌వి

విజ‌య‌న‌గ‌రం, డిసెంబ‌ర్ 02 ః జావెద్‌ తుఫాను ప్ర‌మాదం పొంచి ఉంద‌ని, అధికారులు, ప్ర‌జ‌లూ అప్ర‌మ‌త్తంగా ఉండాలని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి హెచ్చరించారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో నివ‌సించే వారు మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు. మ‌త్స్య‌కారులు, రైతులు అధికారుల సూచ‌న‌లు పాటించాల‌ని ఈ గండం గ‌ట్టెక్కేదాకా వేట‌కు వెళ్లొద్ద‌ని వ‌రి కోత‌లు కోయ‌వ‌ద్ద‌ని క‌లెక్ట‌ర్ ఈ సంద‌ర్భంగా విజ్ఞ‌ప్తి చేశారు. తుపాను నేప‌థ్యంలో స్థానిక అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు స‌మన్వ‌యంతో వ్య‌వ‌హ‌రించి ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కోరారు. జావెద్ తుఫాను హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో క‌లెక్ట‌ర్ గురువారం ఉద‌యం జిల్లాలోని తీర ప్రాంతాల్లో సుడిగాలి ప‌ర్య‌ట‌న చేశారు. ముందుగా పూస‌పాటిరేగ మండ‌లం తిప్ప‌లవ‌ల‌స‌, భోగాపురం మండలం ముక్కాం గ్రామాల్లో ప‌ర్య‌టించి తీర ప్రాంత ప్ర‌జ‌ల‌తో మాట్లాడారు. అనంత‌రం బొండ‌ప‌ల్లి, గ‌జ‌ప‌తిన‌గ‌రం మండ‌లాల్లో ప‌ర్య‌టించారు.

*ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేయాలి*

     ప‌ర్య‌ట‌న‌లో భాగంగా క‌లెక్ట‌ర్ ఆయా మండ‌లాల అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. ప్ర‌మాదం పొంచి ఉంద‌ని ఎవ‌రూ ఏమ‌ర‌పాటుగా ఉండొద్ద‌ని సూచించారు. ముందుగానే గ్రామాల్లో దండోరాలు వేయించి ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేయాల‌ని చెప్పారు. చాలా చోట్ల వ‌రి పండిపోయి ఉంద‌ని ఈ రెండు మూడు రోజులు రైతులు కోత‌లు కోయ‌కుండా చూసుకోవాల‌ని ముందుగానే వారిని అప్ర‌మ‌త్తం చేయాల‌ని సంబంధిత అధికారుల‌కు సూచించారు. ఎక్క‌డైనా కోత‌లు కోసేసి ఉంటే పంట‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌రలించే ఏర్పాట్లు చేయాల‌ని చెప్పారు. తీర ప్రాంతాల్లోని మ‌త్స్య‌కారులు ఎవ‌రూ వేట‌కు వెళ్ల‌కుండా స్థానిక అధికారులు జాగ్ర‌త్త వ‌హించాల‌న్నారు. తుఫాను షెల్ట‌ర్ల‌లో ముంద‌స్తు ఏర్పాట్లు చేసుకోవాల‌ని, నిత్య‌వ‌స‌ర స‌రుకులు, తాగునీరు అందుబాటులో ఉంచుకోవాల‌ని చెప్పారు. రెవెన్యూ, పోలీసు అధికారులు స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించి ప్రమాద నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. అలాగే తీర ప్రాంత ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించే క్ర‌మంలో స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు స‌హాయ స‌హ‌కారాలు తీసుకోవాల‌ని అధికారుల‌కు క‌లెక్ట‌ర్ సూచించారు. ప‌రిస్థితిని చూసి పాఠ‌శాల‌ల‌కు, కార్యాల‌యాల‌కు సెల‌వులు ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు గ‌జ‌ప‌తిన‌గ‌రంలో స్థానిక విలేక‌రులు అడిగిన ప్ర‌శ్న‌కు బ‌దులుగా క‌లెక్ట‌ర్ స్పష్టం చేశారు. ప్ర‌జ‌లు కూడా ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని, ప్ర‌యాణాలు చేయ‌వ‌ద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

*బొండ‌పల్లి పెద్ద‌చెరువు వ‌ల్ల న‌ష్టం జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు*

    బొండ‌ప‌ల్లి పెద్ద‌చెరువు పొంగి స‌మీప పొలాల్లో పంట న‌ష్టం జ‌ర‌గ‌కుండా ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని త‌హ‌శీల్దార్ శ్రీ‌నివాస మిశ్రాకు క‌లెక్ట‌ర్ సూచించారు. చెరువు దిగువున చాలా మేర వ‌రిపొలాలు ఉండ‌టంతో క‌లెక్ట‌ర్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఒక‌వేళ తుఫాను ప్ర‌భావం త‌క్కువ‌గా ఉన్నా… వ‌ర్షాలు మాత్రం విస్తారంగా కురుస్తాయ‌ని కాబ‌ట్టి చెరువులో నీరు ముందుగానే బ‌య‌ట‌కు విడుద‌ల చేసేలా ప్ర‌త్యామ్నాయ మార్గాలు అనుస‌రించాల‌ని సూచించారు. స్లూయిజ్‌ల ద్వారా నీటి విడుద‌ల‌కు చర్య‌లు తీసుకోవాల‌ని త‌హ‌శీల్దార్‌ను ఆదేశించారు. అలాగే నీటి ప్ర‌వాహం వ‌ల్ల ఎలాంటి ప్ర‌మాదం వాటిల్ల‌కుండా ఆర్ & బి అధికారులు ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని చెప్పారు. ఒక‌వేళ ప్ర‌వాహం ఎక్కువ‌గా ఉన్న‌ట్ల‌యితే పోలీసుల సాయంతో ట్రాఫిక్‌ను నియంత్రించాల‌ని సూచించారు.

*జేసీబీల‌ను, ఇత‌ర యంత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి*

     ప‌ర్య‌ట‌న‌లో భాగంగా గ‌జ‌ప‌తిన‌గ‌రం త‌హ‌శీల్దార్ కార్యాల‌యంలో ఆర్ & బి ఎస్‌.ఈ. విజ‌య శ్రీ‌తో క‌లెక్ట‌ర్ ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు. రోడ్ల‌పై ఎక్క‌డైనా చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోయిన‌ట్ల‌యితే వెంట‌నే తొల‌గించేందుకు సిబ్బందిని, యంత్ర ప‌రిక‌రాల‌ను సిద్ధంగా ఉంచుకోవాల‌ని సూచించారు. అధిక సంఖ్య‌లో జేసీబీల‌ను, కొమ్మ‌లు కోసే యంత్రాల‌ను సిద్ధంగా ఉంచుకోవాల‌ని ఆదేశించారు.

*ఈ మండ‌లాల్లో ప్ర‌భావం ఉండొచ్చు*

      ప్ర‌స్తుత అంచ‌నాల మేర‌కు తుఫాను శ్రీ‌కాకుళం జిల్లాలో తీరం దాట‌నుంద‌ని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. ఒక వేళ శ్రీ‌కాకుళంలో తీరం దాటిన‌ట్ల‌యితే విజ‌య‌న‌రం జిల్లాలో పూస‌పాటిరేగ‌, భోగాపురం, నెల్లిమ‌ర్ల‌, చీపురుప‌ల్లి, మొర‌క‌ముడిదాం మండలాల్లో ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుందని చెప్పారు. ఆయా మండలాల అధికారుల‌ను ఇప్ప‌టికే అప్ర‌మ‌త్తం చేశామ‌ని తెలిపారు.
*ముక్కాం గ్రామానికి క‌మ్యూనిటీ భ‌వ‌నం మంజూరు*

     ప‌ర్య‌ట‌నలో భాగంగా భోగాపురం మండ‌లం ముక్కాం గ్రామ ప్ర‌జ‌లు, ప్ర‌జాప్ర‌తినిధులు అక్క‌డ స‌మ‌స్య‌ల‌ను క‌లెక్ట‌ర్‌కు విన్న‌వించారు. ముఖ్యంగా తాగునీటి స‌మ‌స్య అధికంగా ఉంద‌ని, క‌మ్యూనిటీ భవ‌నం పాత‌బ‌డిపోయింద‌ని ప‌రిష్కారం చూపాల‌ని కోరారు. స్థానికుల విజ్ఞ‌ప్తికి స్పందించిన క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి క‌మ్యూనిటీ భ‌వ‌నం మంజూరు చేస్తూ ప్ర‌క‌ట‌న చేశారు. ఎన్‌.ఆర్‌.ఈ.జి.ఎస్‌. నిధుల‌ను ఉప‌యోగించి భ‌వ‌న పనులు పూర్తి చేయాల‌ని, సంబంధిత చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్థానిక అధికారుల‌ను క‌లెక్ట‌ర్ ఆదేశించారు. మ‌త్స్య‌కార కార్పోరేష‌న్ డైరెక్ట‌ర్ మైల‌ప‌ల్లి న‌ర్శ‌మ్మ‌, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ పుష్ఫ‌గుచ్ఛం ఇచ్చారు.

*తిప్ప‌లవ‌ల‌స స‌చివాల‌యాన్ని సంద‌ర్శించిన క‌లెక్ట‌ర్*

    సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లో భాగంగా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి పూస‌పాటిరేగ మండ‌లం తిప్ప‌లవ‌ల‌స గ్రామ స‌చివాల‌యాన్ని ఆక‌స్మికంగా సంద‌ర్శించారు. స్పంద‌న విన‌తుల ప‌రిష్కారానికి సంబంధించిన నివేదిక‌లను ఈ సంద‌ర్భంగా త‌నిఖీ చేశారు. సిబ్బంది స‌మ‌య‌పాల‌న పాటించాల‌ని, బాగా ప‌నిచేయాల‌ని సూచించారు.

* Do not go hunting ... Do not harvest rice .. * * Collector A. Suryankumari appealed to fishermen and farmers.