Encourage farmers towards profitable crops *Collector Suryakumari directs agriculture officials *Incidental inspection of Denkada Mandal Singapuram, Golagam RBKs
Publish Date : 14/10/2022
లాభదాయక పంటల వైపు రైతులను ప్రోత్సహించండి
*వ్యవసాయ అధికారులను ఆదేశించిన కలెక్టర్ సూర్యకుమారి
*డెంకాడ మండలం శింగాపురం, గొలగాం ఆర్బీకేల ఆకస్మిక తనిఖీ
విజయనగరం, అక్టోబర్ 07 ః సంప్రదాయ పద్దతుల్లో.. సంప్రదాయ పంటలను పండించే రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించటం ద్వారా లాభదాయకమైన ఇతర పంటలు వేసేలా రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ అధికారులను, సచివాలయ సిబ్బందిని కలెక్టర్ ఎ. సూర్యకుమారి ఆదేశించారు. ఈ-క్రాప్ అథెంటికేషన్ ప్రక్రియ, ధాన్యం కొనుగోలుకు సంబంధించి తీసుకుంటున్న చర్యలు, ఇతర సేవలను పరిశీలించే నిమిత్తం ఆమె శుక్రవారం డెంకాడ మండలంలోని శింగాపురం, గొలగాం రైతు భరోసా కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో అక్కడ అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఈ-క్రాప్ లో నమోదైన పంటల వివరాలను తనిఖీ చేస్తూ రైతులందరూ ఒకే రకమైన పంటలను సాగు చేస్తున్నారని, స్థానిక మట్టి నమూనాలను సేకరించి అనుకూలమైన ఇతర పంటలను సూచించాలని మండల వ్యవసాయ అధికారిణి పి. నిర్మలను, రైతు భరోసా కేంద్ర సిబ్బందిని ఆదేశించారు. వరి, మామిడికి బదులుగా నేల సారవంతాన్ని బట్టి ఇతర పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని, అవగాహన సదస్సులు పెట్టడం ద్వారా వారిలో సంపూర్ణ అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ క్రమంలో శింగాపురం గ్రామ వార్డు సచివాలయాన్ని కూడా ఆమె సందర్శించారు. అక్కడ అందుతున్న సేవలపై ఆరా తీశారు. రీ-సర్వే ప్రక్రియ సజావుగా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆమె వెంట వచ్చిన డెంకాడ తహశీల్లార్ ఆదిలక్ష్మిని కలెక్టర్ ఆదేశించారు. సిబ్బంది బాధ్యతగా వ్యవహరించి ప్రజలకు మెరుగైన సేవలందించాలని ఈ సందర్బంగా సూచించారు. ఎడ్యుకేషన్ & వెల్ఫేర్ అసిస్టెంట్ తరచూ పాఠశాలలను సందర్శించాలని అక్కడ పరిస్థితిని తెలుసుకోవాలని చెప్పారు. డ్రాపౌట్లు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి వైద్యాధికారులకు తెలియజేయాలని ఏఎన్ఎంకు సూచించారు.
ఆమె వెంట డెంకాడ తహశీల్దార్ ఆదిలక్ష్మి, మండల వ్యవసాయ అధికారి పి. నిర్మల, ఇతర అధికారులు, సచివాలయ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు తదిరులు ఉన్నారు.