Farmers should not lose out, should weigh grain accurately, Joint Collector Dr. GC Kishore Kumar
Publish Date : 14/02/2022
రైతులు నష్టపోకుండా చూడండి
ధాన్యం తూకంలో ఖచ్చితత్వం పాటించాలి
జాయింట్ కలెక్టర్ డాక్టర్ జిసి కిశోర్ కుమార్
డిటిలు, విఆర్ఓలకు తూకంపై అవగాహనా సదస్సు
విజయనగరం, ఫిబ్రవరి 11 ః రైతుల ప్రయోజనాలను కాపాడాలని, వారు నష్టపోకుండా చూడాలని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ జిసి కిశోర్ కుమార్ అన్నారు. ధాన్యం తూకంలో ఖచ్చితత్వం పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో తూకాన్ని పర్యవేక్షించడం, వేబ్రిడ్జిల నిర్వహణ, నికర తూకాన్ని లెక్కించే విధానం తదితర అంశాలపై, సివిల్ సప్లయిస్ డిప్యుటీ తాశీల్దార్లు, విఆర్ఓలకు స్థానిక ఆనందగజపతి ఆడిటోరియంలో శుక్రవారం అవగాహనా సదస్సు నిర్వహించారు. తూకాన్ని సరిగ్గా వేయించడం, వే బ్రిడ్జి పనిచేసే విధానం, దానిపై లారీలతో ధాన్యాన్ని తూకం వేయడం తదితర అంశాలను నమూనాలతో చేసి చూపించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జాయింట్ కలెక్టర్ కిశోర్ మాట్లాడుతూ, ధాన్యం తూకం విషయంలో రైతులు మోసపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికోసం ప్రతీ ఒక్కరూ తూకం వేసే విధానంపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. అలాగే వే బ్రిడ్జిల్లో తూకం వేసే విధానంపై సంపూర్ణ అవగాహన ఉన్నప్పుడు మాత్రమే, మోసాలను నివారించవచ్చని స్పష్టం చేశారు. అన్ని వే బ్రిడ్జిలను తనిఖీ చేయాలని సూచించారు. మిల్లర్లచేతిలో రైతులు మోసపోకూడదన్నది ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. దీనిలో భాగంగానే ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు, మిల్లర్లకు మధ్య నేరుగా లావాదేవీలేవీ జరగకుండా, రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు జరుగుతోందని చెప్పారు. రైతులు మిల్లర్లవద్దకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. కొనుగోలు ప్రక్రియ అంతా రైతుభరోసా కేంద్రాల ద్వారానే జరుగుతుందని స్పష్టం చేశారు. వే బ్రిడ్జికి జియో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతీ వే బిల్లుపైనా సంబంధిత రైసుమిల్లు కస్టోడియన్ అధికారి తప్పనిసరిగా సంతకం చేయాలని చెప్పారు. అధికారులు తరచూ తూకాలను తనిఖీ చేస్తుండాలని జెసి ఆదేశించారు.
తూనికలు కొలతలశాఖ డిప్యుటీ కంట్రోలర్ జనార్ధన్ మాట్లాడుతూ, వే బ్రిడ్జిపై ధాన్యం లారీలను తూకం వేసే విధానాన్ని ప్రయోగాత్మకంగా వివరించారు. తూకం వేయడానికి ముందు చేయాల్సిన తనిఖీలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు. లారీలతో తూచే సమయంలో, సాధారణంగా జరిగే మోసాలను, వాటిని నివారించే పద్దతులను వివరించారు. అలాగే రైతులు గుడ్డిగా లారీ డ్రైవర్లను నమ్మేయకుండా, వారు కూడా వే బ్రిడ్జిలవద్దకు లారీతోపాటు వచ్చి, తూకాన్ని గమనించాలని సూచించారు. వాస్తవంగా నమోదైన తూకాన్ని, రికార్డు చేసిన తూకాన్ని సరిపోల్చి చూసుకోవాలని చెప్పారు. తూకం వేసే సమయంలో వ్యక్తులెవరూ వేబ్రిడ్జిపై లేకుండా చూడాలని సూచించారు.
ఈ సదస్సులో జిల్లా సరఫరా అధికారి పాపారావు, లీగల్ మెట్రాలజీ డిసి జనార్ధన్, మార్క్ఫెడ్ డిఎం యాసిన్, సివిల్ సప్లయిస్ డిఎం దేవుల్ నాయక్, ఎజిఎం మీనా కుమారి తదితరులు పాల్గొన్నారు.
