Focus on mother and child health Blood tests should be conducted from time to time Convergence work should be completed expeditiously District Collector A. Suryakumari Anger over uncleanliness Bhogapuram, Denkada (Vijayangaram)
Publish Date : 15/03/2022
తల్లీ, పిల్లల ఆరోగ్యంపై దృష్టి పెట్టండి
ఎప్పటికప్పుడు రక్త పరీక్షలు నిర్వహించాలి
కన్వర్జెన్సీ పనులను త్వరగా పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
అపారిశుధ్యంపై ఆగ్రహం
భోగాపురం, డెంకాడ (విజయనగరం) ః
గర్భిణులు, తల్లులు, పిల్లల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ఆదేశించారు. వారికి తరచూ రక్తపరీక్షలను నిర్వహిస్తూ, రక్తంలో హెమోగ్లోబిన్ శాతం పెరిగేందుకు మందులు ఇచ్చి, ఆరోగ్యకరంగా తయారు చేయాలని సూచించారు. ఫోర్టిఫైడ్ బియ్యాన్ని వినియోగించడం ద్వారా రక్తం పెరుగుతుందని చెప్పారు.
*అభివృద్ది పనుల పరిశీలన*
భోగాపురం, డెంకాడ మండలాల్లో జిల్లా కలెక్టర్ సూర్యకుమారి, మంగళవారం పర్యటించారు. సవరివిల్లి గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణాన్ని, హౌసింగ్ కాలనీని తనిఖీ చేశారు. సిసి రోడ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. హౌసింగ్ కాలనీలో అన్ని ఇళ్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించేలా చూడాలని సూచించారు. బిల్లు పెట్టిన వెంటనే మంజూరయ్యే పరిస్థితి ఉందని, ఈ అవకాశాన్ని లబ్దిదారులు వినియోగించుకోవాలని కోరారు. పూర్తి అయిన ఇంటిని పరిశీలించి, చక్కగా ఉందని అభినందించారు. జగనన్న కాలనీలో అవసరమైతే సామూహిక మరుగుదొడ్డిని నిర్మించాలని సూచించారు. గ్రామంలో రక్షిత మంచినీటి సమీపంలో ఆపారిశుధ్యంపై మండిపడ్డారు. రోడ్లప్రక్కన నీరు నిలిచి మురికిగుంటలుగా ఏర్పడటంపై, సిబ్బందిని మందలించారు. గోతులను పూడ్చి, గంటలో పరిస్థితిని మెరుగుపర్చాలని ఆదేశించారు. రోడ్డుప్రక్కన కాలువలను నిర్మించాలని సూచించారు.
*సచివాలయం తనిఖీ*
సవరవిల్లి గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా సిబ్బంది హాజరును, రికార్డులను పరిశీలించారు. గర్భిణులు, బడిపిల్లల ఆరోగ్య తనిఖీలపై ఆరా తీశారు. రక్త పరీక్షలు చేయకపోవడంపై, ఎఎన్ఎంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తరచూ రక్తపరీక్షలను నిర్వహించి, హెమోగ్లోబిన్ తక్కువ ఉన్నవారికి పోషకాహారాన్ని, అవసరమైన మందులను అందించాలని ఆదేశించారు. రక్తం పెరగడానికి, ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ప్రతీఒక్కరూ వినియోగించుకొనేలా చూడాలని సూచించారు. పిల్లలు ఆరోగ్యంగా తయారైతే, భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉంటాయని స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణపై ఆరా తీశారు. సరుకుల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, గుడ్లు బాగులేకపోతే, తిరస్కరించాలని సూచించారు. ఓటిఎస్ పథకంపై ఆరా తీశారు. ప్రతీఒక్కరూ ఈ పథకాన్ని వినియోగించుకొనేలా చూడాలన్నారు. హాజరు తక్కువగా ఉన్న వలంటీర్లను తొలగించాలని సూచించారు.
గ్రామంలో జరుగుతున్న అభివృద్ది పనులు, ఉపాధిహామీ కన్వర్జెన్సీ నిధుల వినియోగంపై సచివాలయ సిబ్బందిని ప్రశ్నించారు. ఇంకా ప్రారంభించని పనులను వెంటనే మొదలు పెట్టాలని ఆదేశించారు. సిసిరోడ్లు, కాలువల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలన్నారు. కన్వర్జెన్సీ నిధులు సిద్దంగా ఉన్నాయని, పనులు వెంటనే పూర్తిచేసి, బిల్లులు సమర్పించాలని ఆదేశించారు. గ్రామంలో ప్రకృతి సాగును ప్రోత్సహించాలని సూచించారు. సిటిజన్ అవుట్‌రీచ్‌పై ఆరా తీశారు. అర్హలందరికీ పథకాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. 104 వాహనం ద్వారా అందిస్తున్న వైద్య సేవలు, వేక్సినేషన్, టిబి వ్యాధికి చికిత్స తదితర వైద్య సంబంధ విషయాలపై ప్రశ్నించి, పనితీరు మెరుగుపర్చుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ పర్యటనలో భోగాపురం మండల తాశీల్దార్ ఎం.రమణమ్మ పాల్గొన్నారు.
*ఎపిఎస్‌పి క్వార్టర్స్‌లో రహదారుల పరిశీలన*
డెంకాడ మండలం, చింతలవలస వద్దనున్న ఎపిఎస్‌పి 5వ బెటాలియన్ క్వార్టర్స్‌లో నిర్మాణంలో ఉన్న రోడ్లను కలెక్టర్ పరిశీలించారు. సుమారు రూ.35లక్షల అంచనా వ్యయంతో బిటి రోడ్ల నిర్మాణం జరుగుతుండటంతో, పనులను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాటికి సంబంధించిన వివరాలను పోలీసు అధికారులనడిగి తెలుసుకున్నారు. వారంలోగా రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.