Health cards should be issued to girls as soon as possible. District Collector A. Suryakumari celebrated International Girls’ Day.
Publish Date : 18/10/2021
బాలికలకు త్వరలో హెల్త్ కార్డులు
వారికి ఆరోగ్యంపట్ల అవగాహన కల్పించాలి
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
ఘనంగా అంతర్జాతీయ బాలికల దినోత్సవం
విజయనగరం, అక్టోబరు 12 ః వసతిగృహాల్లో చదువుతున్న బాలికలకు త్వరలో హెల్త్‌కార్డులు జారీ చేస్తామని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ప్రకటించారు. దసరా సెలవుల అనంతరం, కౌమార బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని, దీనికి జిల్లాలోని వైద్యులంతా సహకరించాలని కోరారు. జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమం కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని మంచీ, చెడులపట్ల కౌమార బాలికలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. మన కట్టుబాట్లు, నైతిక విలువల గురించి తెలియజెప్పాల్సిన సమయం ఇదేనని ఆమె స్పష్టం చేశారు. 16 నుంచి 18 ఏళ్లు మధ్యనున్న బాలికలకు, వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యం, వివిధ రకాల చట్టాలపట్లా అవగాహన కల్పించాలని సూచించారు. వారికి ఇప్పటినుంచే ఆరోగ్య పరీక్షలను నిర్వహించి, తగిన వైద్య సహాయాన్ని అందించడం ద్వారా, భవిష్యత్తులో తల్లీబిడ్డల ఆరోగ్యం బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని రకాల సదుపాయాలను వినియోగించుకొని, మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా మహిళల్లో రక్తహీనత ఎక్కువగా కనిపిస్తోందని, దానిని నివారించేందుకు తగిన పోషకాహారాన్ని అందించాలని సూచించారు. స్త్రీపురుష నిష్పత్తిలో తేడాలు లేకుండా చూడాలని, స్త్రీపురుషులిద్దరూ సమానమేనన్న అవగాహన కల్పించాలని కోరారు. బాలికల పట్ల వివక్షత తొలగించాలని, గర్భస్థ లింగనిర్ధారణా పరీక్షలు ఎక్కడా జరగకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.
అంతకుముందు పలువురు ఆశా వర్కర్లు, ఎఎన్ఎంలు మాట్లాడుతూ, సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, వారిపట్ల చూపిస్తున్న వివక్షతకు సంబంధించిన విషయాలను, తమ స్వీయ అనుభవాలను వివరించారు. వివిధ పిహెచ్‌సిల పరిధిలో ఉత్తమ సేవలందిస్తున్న సిబ్బందికి ఈ సందర్భంగా ప్రశంసా పత్రాలను బహూకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్(అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్‌కుమార్, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ ఎస్‌వి రమణకుమారి, డిసిహెచ్ఎస్ డాక్టర్ జి.నాగభూషణరావు, అడిషనల్ డిఎంఅండ్‌హెచ్ఓ డాక్టర్ ఎల్.రామ్మోహన్, సిపిఓ జె.విజయలక్ష్మి, ఐసిడిఎస్ పిడి ఎం.రాజేశ్వరి, వివిధ పిహెచ్సి, సిహెసిల వైద్యాధికారులు, ఎఎన్ఎంలు, ఆశావర్కర్లు పాల్గొన్నారు.