In addition to the commitment of the banks to grant loans within 48 hours, Titco loans should be given priority over crop loans and education should be encouraged. District Collector A. Suryakumari
Publish Date : 25/03/2022
రుణమంజూరు బ్యాంకుల బాధ్యత
48 గంటల్లోగా జగనన్న తోడు, టిట్కో రుణాలు
పంటరుణాలకు ప్రాధాన్యతనివ్వండి
విద్యారుణాలను ప్రోత్సహించాలి
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
సాధారణ సెల్‌ఫోన్ ద్వారా యుపిఐ పేమెంట్స్
విజయనగరం, మార్చి 23 ః
అర్హులందరికీ రుణాలను మంజూరు చేయాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉందని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి స్పష్టం చేశారు. ప్రతీ ప్రభుత్వ పథకం బ్యాంకులతో ముడిపడి ఉందని, బ్యాంకులు సహకరించినప్పుడే అవి విజయవంతం అవుతాయని అన్నారు. రుణాల మంజూరులో నిర్లక్ష్యం చూపించే బ్యాంకులపై చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు. బ్యాంకులు తమ అసలు లక్ష్యాన్ని గుర్తించాలని సూచించారు.
జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం జరిగింది. వివిధ ప్రభుత్వ పథకాలకు బ్యాంకులు ఇస్తున్న ప్రోత్సాహం, రుణాల మంజూరులో జాప్యానికి కారణాలపై సుదీర్ఘంగా చర్చించారు. కొన్ని పథకాలకు రుణాలను మంజూరు చేయడంలో, బ్యాంకులు చూపించిన అలక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న తోడు, టిట్కో ఇళ్ల రుణాలను 48 గంటల్లోగా మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బ్యాంకుల దృక్ఫథంలో మార్పు రావాలని స్పష్టం చేశారు. రాష్ట్రప్రభుత్వ ప్రాధాన్యతా పథకాలతోపాటు, నీతి అయోగ్ లక్ష్యాల సాధనలో కూడా బ్యాంకుల సంహకారం ఎంతో కీలకమని అన్నారు. బ్యాంకులు కేవలం డిపాజిట్ల సేకరణకే పరిమితం కాకుండా, విరివిగా రుణాలను మంజూరు చేయడానికి ముందుకు రావాలని కోరారు. జిల్లాలో చాలామంది రైతులు పంటకు మదుపులు లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. అర్హత ఉన్న ప్రతిరైతుకు పంటరుణాన్ని మంజూరు చేయాలని కోరారు. రైతులకు రుణాలను ఇప్పించే బాధ్యతను వ్యవసాయశాఖ తీసుకోవాలని ఆదేశించారు. చిరువ్యాపారులను ప్రోత్సహించేందుకు జగనన్న తోడు, స్వానిధి, ముద్ర రుణాలను అర్హత ఉన్నవారికి మంజూరు చేయాలని ఆదేశించారు.
విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, విద్యారుణాల మంజూరుకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ కోరారు. కేవలం సాంకేతిక విద్యకే కాకుండా, ఇతర ఉన్నత చదువులకు కూడా రుణాలివ్వాలన్నారు. జిల్లాలో వ్యవసాయాధారిత పరిశ్రమల స్థాపనకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని చెప్పారు. రుణాలను మంజూరు చేసి వ్యవసాయ పరిశ్రమలను ప్రోత్సహించాలని సూచించారు. వివిధ రకాల మొక్కలకోసం కడియం వెళ్లాల్సి వస్తోందని, జిల్లాలోనే నర్సరీలను స్థాపించేందుకు ప్రోత్సాహాన్ని అందించాలని కోరారు. ముఖ్యంగా ఎస్సి, ఎస్టిలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎస్సి, ఎస్టి, మహిళలచేత పరిశ్రమలను స్థాపించేందుకు, వారికి అవగాహనా సదస్సులు, శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సూచించారు. రుణాలను తిరిగి చెల్లించే విషయంలో లబ్దిదారులను నిరంతరం చైతన్యపరుస్తున్నామని తెలిపారు. రుణ మంజూరులో ప్రతీ బ్యాంకు తమకు కేటాయించిన లక్ష్యాలను సాధించాలని, జిల్లా అభివృద్దిలో తమవంతు సహకారాన్ని అందించాలని కలెక్టర్ కోరారు.
జాయింట్ కలెక్టర్ (ఆసరా) జె.వెంకటరావు మాట్లాడుతూ, జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న కుటీర పరిశ్రమలు, స్వయం ఉపాధి యూనిట్ల వివరాలను తెలిపారు. బొబ్బిలి వీణల తయారీ యూనిట్లు, గరుగుబిల్లి ఇడ్లీరవ్వ తయారీ పరిశ్రమ, బాడంగిలో బెల్లంతో చేసే తినుబండారాల పరిశ్రమలు, ఇత్తడి, రాగి వస్తువుల తయారీ యూనిట్లను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఎస్సి, ఎస్టి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ డేవిడ్ బెర్నార్డ్ మాట్లాడుతూ, స్టేండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా తదితర కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల లక్ష్యాలను పేర్కొన్నారు. ఎస్సి, ఎస్టి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ పరంగా ఉన్న ప్రోత్సాహకాలను వివరించారు. జగనన్న బడుగు వికాశం కార్యక్రమం ద్వారా ఎస్సి, ఎస్‌టిల అభ్యున్నతికి రాష్ట్రప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని చెప్పారు. సమావేశపు అజెండాను లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీనివాస్ వివరించారు. యుపిఐ 123 పే ద్వారా, సాధారణ సెల్‌ఫోన్ వినియోగదారులు కూడా యుపిఐ పేమెంట్లు చేసే అవకాశాన్ని ఇటీవలే ఆర్బిఐ కల్పించిందని చెప్పారు. మిస్డ్ కాల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా పేమెంట్లు చేయవచ్చని సూచించారు.
ఈ సమావేశంలో ఆర్బిఐ ఎల్డిఓ విభవ్ వ్యాస్, నాబార్డ్ డిడిఎం హరీష్, డిఆర్డిఏ పిడి ఎం.అశోక్‌కుమార్, మెప్మా పిడి సుధాకరరావు, వ్యవసాయ, పశు సంవర్థకశాఖ జెడిలు తారకరామారావు, వైవి రమణ, డిసిసిబి సిఇఓ జనార్ధన్, ఉద్యాన, మత్స్యశాఖ డిడిలు శ్రీనివాసరావు, నిర్మలాకుమారి, మున్సిపల్ కమిషనర్ ఎస్ఎస్ వర్మ, జిఎం డిఐసి శ్రీధర్, వివిధ శాఖల అధికారులు, బ్యాంకుల రీజనల్ మేనేజర్లు, ప్రతినిధులు పాల్గొన్నారు.